కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరీంనగర్ జిల్లా సర్పంచుల డెడ్ లైన్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరీంనగర్ జిల్లా సర్పంచుల డెడ్ లైన్

కరీంనగర్ : పెండింగ్ బకాయిల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరీంనగర్ జిల్లా సర్పంచులు డెడ్ లైన్ విధించారు. పెండింగ్ బకాయిలను వారం రోజుల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బకాయిలు విడుదల చేయకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టరేట్ల కార్యాలయాలను ముట్టడిస్తామని సర్పంచులు హెచ్చరించారు. 

కలెక్టరేట్ కు వచ్చిన అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ కు  సర్పంచులు వినతిపత్రం అందించారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత సర్పంచులందరూ ఆందోళన విరమించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. బకాయిలు విడుదల కాకపోవడంతో అప్పులపాలై చనిపోయిన సర్పంచుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన సర్పంచ్ కుటుంబ సభ్యులకు రూ.20లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. 

అంతకుముందు.. కరీంనగర్ కలెక్టరేట్  ధర్నా కంటే ముందుగా ప్రెస్ భవన్ లో జిల్లా సర్పంచులు సమావేశమయ్యారు. పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేయాలని నిర్ణయించున్నారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యలను వినాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తామంతా అప్పుల పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా తమకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామ ఉప సర్పంచుల చెక్ పవర్ ను కూడా రద్దు చేయాలని సర్పంచులు డిమాండ్ చేశారు. మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు,  ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వ బిల్లులు రాలేదని చెబుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల సర్పంచులు కూడా పాల్గొన్నారు. 

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సర్పంచుల ఆందోళన కొనసాగుతుండగా పోలీసులకు అక్కడకు వెళ్లారు. ఆందోళన విరమించాలని కోరగా .. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ సర్పంచి మేడి అంజయ్.. సీఐ కాళ్లను మొక్కాడు. తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని వేడుకున్నాడు.