చిట్టి డబ్బుల వివాదం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కష్టపడి సంపాదించిన డబ్బులను చిట్టీ రూపంలో దాచుకుంటే ఆ డబ్బులు ఇవ్వకుండా చిట్టీల నిర్వాహకుడు మోసం చేయడంతో మనస్థాపానికి గురై యువకుడు పురుగుల మందుతాగాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను..అమ్మానాన్నా నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నానను అంటూ పురుగుల మందు తాగుతూ యువకుడి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కరీంనగర్ జిల్లా విలాసాగర్ లో శనివారం ( మే30) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో చిట్టి డబ్బుల వివాదం ఆత్మహత్య యత్నానికి దారి తీసింది. విలాసాగర్ గ్రామానికి చెందిన అరుకాల సాయి కుమార్ జమ్మికుంట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఆరు లక్షల చిట్టి వేశాడు. గడువు ముగిసిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా తన వద్ద ఉన్న బంగారం క్రెడిట్ కార్డులు తీసుకొని ఇవ్వడం లేదని సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. దీంతో సాయికుమార్ ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
