
కర్నాటక ముఖ్యమంత్రి ఎవరవుతారు..? ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో ఈ ప్రశ్న ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సీఎం రేసులో ముందున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. సీనియారిటీ పరంగా చూస్తే సిద్ధు వైపు.. విధేయతను పరిగణనలోకి తీసుకుంటే డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో మధ్యేమార్గంగా మరో విషయాన్ని కూడా హైకమాండ్ ఆలోచిస్తోంది. ఇద్దరినీ సంతోషపరిచేందుకు చెరో రెండున్నరేండ్లు సీఎంగా ఉండే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఆదివారం (మే 14న) జరిగే సీఎల్పీ సమావేశంలో సీఎం ఎంపికపై స్పష్టత వచ్చే చాన్స్ ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు.
మూడో వ్యక్తి పేరు కూడా..
సీఎం రేసులో సిద్ధ రామయ్య, డీకే శివకుమార్‌తో పాటు మరో పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనే మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర. ఈయన పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పరమేశ్వర.. రాష్ట్రంలోని బలమైన నేతగా ఉన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోంది.
కర్నాటకలో కొత్త సర్కార్ కొలువు దీరడానికి ముహూర్తం ఖరారైంది. శనివారం (మే 13న) సాయంత్రం సీఎం బస్వరాజ్ బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి లేఖను అందజేశారు. ఆదివారం సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. సోమవారం (మే 16వ తేదీన) బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార ప్రోగ్రామ్‌కు ఏర్పాట్లు చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే.. అదేరోజు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పుట్టినరోజు.
తన పుట్టినరోజు నాడు సోనియా గాంధీ తనకు గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చారని డీకే గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో సోమవారమే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. అయితే.. డీకే శివకుమార్ ఏ హోదాలో ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్‌హైకమాండ్ ఆయనకు ఏం గిఫ్ట్ ఇస్తుందనే దానిపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆదివారం (మే 14న) సీఎల్పీ భేటీలో సీఎల్పీ నేతలను ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం ఉండగా.. సీఎం ఎంపికపైనా సాయంత్రంకల్లా ఓ స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.