
కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్షాలు వినూత్న నిరసన చేపట్టాయి. బడ్జెట్ రోజున కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యతో పాటు మరికొందరు నేతలు చెవిలో పూలు పెట్టుకుని సభకు వచ్చారు. మోసపూరిత హామీలు ఇచ్చి 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని విమర్శించారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా మోసపూరితంగా ఉందని మండిపడ్డారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత బడ్జెట్లో ప్రకటించిన పనుల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. సగం పనులు కూడా పూర్తికాక ముందే.. రూ.3లక్షల కోట్లకుపైగా అప్పులు ఎందుకయ్యాయని బసవరాజ్ బొమ్మైను ప్రశ్నించారు. దీనిపై ఘాటుగా స్పందించిన బొమ్మై.. సిద్ధారామయ్య సీఎంగా ఉన్న సమయంలో కర్ణాటక చరిత్రలోనే ఎక్కువ అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. కర్నాటకలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బీజేపీ ప్రభుత్వం చివరి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ బాధ్యతలు సైతం నిర్వహిస్తున్న సీఎం బసవరాజ్ బొమ్మై బడ్జెట్ ను సభ ముందుంచారు.