గుండెపోటుతో కర్నాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నుమూత

గుండెపోటుతో కర్నాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నుమూత

మరికొన్ని రోజుల్లోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో.. ప్రచారం పీక్ స్టే్జ్ లో ఉంది. ఇలాంటి సమయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ.. క్యాడర్ మొత్తం షాక్ అయ్యే ఘటన జరిగింది. మార్చి 11వ తేదీ ఉదయం కర్నాటక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధృవనారాయణ్ కన్నుమూశారు. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి వరకు ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన.. ఉదయానికి లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. 

ఎలా చనిపోయారు :

బెంగళూరులోని తన నివాసం మార్చి 11వ తేదీ ఉదయం ఎప్పటిలాగే ఆరు గంటలకు నిద్రలేశారు. ఆరు గంటల 40 నిమిషాలకు గుండెలో నొప్పిగా ఉందని.. ఆస్పత్రికి వెళ్లాలని కారు డ్రైవర్ కు ఫోన్ చేశారు. డ్రైవర్ వచ్చి.. ఆయన్ను కారులో ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ఆయనకు రక్తపు వాంతులు అయ్యాయి. డీఆర్ఎంఎస్ ఆస్పత్రికి చేరుకునే సమయానికే ఆయన చనిపోయినట్లు తెలిపారు డాక్టర్ మంజునాథ. కార్డియాక్ అరెస్ట్ అయ్యారని.. తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు డాక్టర్లు.

ఒక్క ఓటుతో గెలిచిన రికార్డ్ :

ధృవ నారాయణ్ చాలా సీనియర్ రాజకీయ వేత్త. 1961 జూలై 31న చామరాజనగర్‌లోని హగ్గవాడిలో జన్మించారు. 2022 నుంచి కర్నాటక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దళిత నేతగా మంచి గుర్తింపు ఉన్న నేత నారాయణ్. 1983లో కాంగ్రెస్ లో చేరిన ఆయన.. చివరి శ్వాస వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. 1999లో తొలిసారిగా సంతేమరల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సంతేమరల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యేగా నారాయణ్ చరిత్ర సృష్టించారు..  ధృవనారాయణ్ కు 40 వేల 752 ఓట్లు రాగా.. జేడీఎస్ అభ్యర్థి కృష్ణమూర్తికి 40 వేల 751 ఓట్లు వచ్చాయి.. దీంతో ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యేగా దేశంలో రికార్డు సృష్టించారాన..