
బెంగాలీ ఆర్టిస్ట్ పై పొగడ్తల వర్షం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై మానవాళి సాగిస్తున్న పోరును వివరిస్తూ అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన బెంగాల్ కు చెందిన స్వర్ణ చిత్రకార్ అనే మహిళపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బెంగాల్ లోని పింగ్లా గ్రామానికి చెందిన స్వర్ణ చిత్రకార్ స్వతహాగా పటచిత్ర కళాకారిని. తనకు తెలిసిన ఆర్ట్ ద్వారా కరోనా గురించి అందరికీ చెప్పాలనుకుంది. దీంట్లో భాగంగా కరోనాకు సంబంధించిన పటచిత్రాలు వేసి, బెంగాలీ భాషలో పాట రూపంలో మహమ్మారి కథను చెప్పే ప్రయత్నం చేసింది. పటచిత్రాల కోసం ఆమె ఏడు ఫ్రేమ్స్ యూజ్ చేసింది. కరోనా సోకిన పేషెంట్లు, హెల్త్ కేర్ వర్కర్స్ తోపాటు ఇళ్లలో ఉంటున్న వారు, లాక్ డౌన్ పాటించడకుండా బయట తిరుగుతున్న వారు, మాస్కులు వేసుకున్న వారిని తన కుంచెతో ఆ ఫ్రేమ్స్ లో బంధించింది. ఈ వీడియోను హిపమ్స్ ఇండియా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా.. ఇప్పటికే 75 వేల వ్యూస్ వచ్చాయి. వారిలో చాలా మంది పెయింటిగ్స్ ను మెచ్చుకుంటూ మెసేజ్ లు చేస్తున్నారు. పటచిత్ర వేసే కళాకారులను పాటువాస్ అని పిలుస్తారు. వీరు పురాణ గాథలు, సామాజిక సమస్యలకు తమ కాన్వాస్ షీట్స్ పై పెయింటిగ్స్ తో అద్భుత కళా రూపం ఇస్తారు. పెయింటింగ్స్ తోపాటు వాటికి సంబంధించిన కథలను లయబద్ధంగా పాడుతూ చెప్పడం వీరి ప్రత్యేకత.