కర్పూరి ఠాకూర్​కు భారతరత్న .. ప్రకటించిన రాష్ట్రపతి భవన్

కర్పూరి ఠాకూర్​కు భారతరత్న ..  ప్రకటించిన రాష్ట్రపతి భవన్
  • రెండు సార్లు బీహార్ సీఎంగా పని చేసిన ‘జననాయక్​’
  • మద్యపాన నిషేధం, బీసీ కోటా వంటివెన్నో అమలు
  • 1952 నుంచి 1988లో చనిపోయేదాకా ఎమ్మెల్యే
  • నితీశ్, లాలూ వంటి ఎంతో మందికి రాజకీయ గురువు

న్యూఢిల్లీ : బీహార్‌‌‌‌ మాజీ సీఎం, ‘జన నాయక్’, దివంగత కర్పూరి ఠాకూర్‌‌ను దేశ అత్యున్నత పౌర పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. బుధవారం ఆయన శతజయంతి నేపథ్యంలో భారతరత్నను ప్రకటించింది. మంగళవారం ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. కర్పూరి ఠాకూర్‌‌కు (మరణానంతరం) భారతరత్న పురస్కారం అందించడంపై రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారని తెలిపింది. అట్టడుగు వర్గాల కోసం, సమానత్వం, సాధికారత కోసం ఠాకూర్ చేసిన నిరంతర ప్రయత్నాలకు ఈ పురస్కారమే నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. 

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని.. 

1924 జనవరి 24న బీహార్‌‌‌‌లోని సమస్తిపూర్‌‌ జిల్లా పిటౌజియా‌‌లో అతి పేద కుటుంబంలో కర్పూరి ఠాకూర్‌‌ జన్మించారు. విద్యార్థి దశలో ఉండగానే.. క్విట్‌‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1942 – 1945 మధ్య కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపారు. స్వాతంత్ర్యం తర్వాత తన గ్రామంలో తొలుత ఉపాధ్యాయుడిగా సేవలందించారు. రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన.. 1952 బీహార్‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్‌‌పుర్‌‌ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1988 ఫిబ్రవరి 17న చనిపోయే వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1967లో బీహార్‌‌‌‌లో ఏర్పడిన తొలి నాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, విద్యా మంత్రిగా సేవలందించారు. పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు. స్కూళ్లలో ఇంగ్లిష్‌‌ను తప్పనిసరి సబ్జెక్టు జాబితా నుంచి తొలగించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 1970లో మద్యపాన నిషేధాన్ని కూడా ఆయన అమలు చేశారు. ఈ క్రమంలోనే1970 డిసెంబర్ నుంచి 1971 జూన్‌‌ వరకు, 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్‌‌ వరకు రెండు సార్లు బీహార్‌‌‌‌ సీఎంగా సేవలందించారు. ఒక్కసారి కూడా పూర్తి టర్మ్‌‌ సీఎంగా కొనసాగలేదు. కానీ రాష్ట్ర ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారు. ముంగేరి లాల్ కమిషన్ సిఫార్సులను రాష్ట్రంలో అమలు చేశారు. తద్వారా రాష్ట్రంలో బీసీ కోటాను ప్రవేశపెట్టారు.

ఎందరికో రాజకీయ గురువు

రామ్‌‌మనోహర్‌‌ లోహియా ఆలోచనలతో స్ఫూర్తి పొందిన కర్పూరి ఠాకూర్.. ఆయన స్థాపించిన సోషలిస్టు పార్టీలో కీలకంగా పని చేశారు. జయప్రకాశ్‌‌ నారాయణ్‌‌కు సన్నిహితుడిగానూ మెలిగారు. తర్వాత జనతా పార్టీలో క్రియాశీలకంగా కొనసాగారు. లాలూ ప్రసాద్‌‌ యాదవ్‌‌, నితీశ్ కుమార్‌‌ వంటి ఎంతో మందికి ఆయన రాజకీయ గురువు. జనం కోసం పనిచేసిన ఆయన్ను ‘జననాయక్‌‌’ అని బీహార్ ప్రజలు పిలుచుకుంటారు. సమస్తిపూర్ జిల్లాలో ఆయన జన్మించిన ఊరి పేరును కర్పూరి గ్రామ్‌‌గా మార్చారు. ఆయన కొడుకు రామ్ నాథ్ ఠాకూర్.. జేడీయూ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. భారత రత్నకు ఎంపికైన 49వ వ్యక్తి కర్పూరి ఠాకూర్. చివరి సారిగా 2019లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఈ అత్యున్నత పురస్కారం వరించింది.

చెరగని ముద్ర వేసిన్రు

సామాజిక వేత్త, జన నాయక్ కర్పూరి ఠాకూర్‌‌ శతజయంతి జరుపుకుంటున్న తరుణంలో ఆయనకు భారతరత్న ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు సంతోషిస్తున్నా. అట్టడుగు వర్గాల కోసం, సమానత్వం, సాధికారత కోసం ఆయన చేసిన నిరంతర ప్రయత్నాలకు ఈ అత్యున్నత పురస్కారమే నిదర్శనం. అణగారిన వర్గాలను పైకి తీసుకురావాలన్న ఆయన నిబద్ధత, దార్శనిక నాయకత్వం భారతదేశ సామాజిక-రాజకీయ వ్యవస్థపై చెరగని ముద్ర వేసింది. ఈ అవార్డు ఆయన విశేష సేవలను గౌరవించడమే కాదు.. మరింత న్యాయమైన, సమానమైన సమాజాన్ని రూపొందించేందుకు, ఆయన మిషన్‌‌ను కొనసాగించడానికి మనకు స్ఫూర్తినిస్తుంది.
-
 ప్రధాని నరేంద్ర మోదీ

ఎంతో సంతోషంగా ఉంది

కర్పూరి ఠాకూర్‌‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌‌ను నేను ఎప్పటి నుంచో లేవనెత్తుతున్నా. ఆయన 100వ జయంతి సందర్భంగా వెలువడిన ఈ ప్రకటన నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. ఈ నిర్ణయం సమాజంలోని అణగారిన వర్గాలకు సానుకూల సందేశాన్ని పంపుతుంది.
-
 బీహార్ సీఎం నితీశ్ కుమార్