విద్యా ప్రమాణాలు పడిపోతుంటే.. సమీక్షించే తీరిక లేదా?

విద్యా ప్రమాణాలు పడిపోతుంటే.. సమీక్షించే తీరిక లేదా?

విద్యా వ్యవస్థ మీద జాతీయ స్థాయిలో విడుదలవుతున్న ప్రతీ సర్వే, నివేదిక తెలంగాణలో సదువుల దుస్థితిని కళ్లకుగడుతున్నా.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. విద్యా ప్రమాణాలు అడుగంటుతున్నాయని మొర్రో మొర్రో మొత్తుకుంటున్నా.. సర్కారుకు కనీసం సమీక్షించే తీర్పాటం ఉంటలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన విద్యారంగం.. స్వరాష్ట్రంలో పట్టించుకునే నాధుడు లేక దిక్కు లేని అనాథగా మారుతున్నది. ఎనిమిదో క్లాసు చదివే స్టూడెంట్​కు కనీసం కూడికలు కూడా వస్తలేవని మొన్నామధ్య ‘జాతీయ సాధన సర్వే’ తెలంగాణ సదువుల డొల్లతనాన్ని బయట పెడితే.. దేశంలోని బడుల పనితీరుపై కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ‘పెర్ఫార్మెన్స్​ గ్రేడ్​ ఇండెక్స్(పీజీఐ)లో రాష్ట్రం అట్టడుగున నిలిచింది. మనతో విడిపోయిన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం కోసం పోటీ పడుతుంటే.. తెలంగాణ మాత్రం బిహార్, ఈశాన్య రాష్ట్రాలతో మిగిలింది.  విద్యలో ఇంత దిగజారుడుతనం కనిపిస్తున్నా..  కనీసం సమీక్ష నిర్వహించి సమస్య ఎక్కడుందో గుర్తించి దాన్ని పరిష్కరించే ఏ ప్రయత్నం జరగకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ పరిస్థితి ఇట్లే కొనసాగితే ‘అఆ ఇఈలు, ఏబీసీడీలు అంబాడి బుడి బుడి అడుగుల ప్రైమరీ స్కూళ్లై.. పెరిగి కాలేజీలై యూనివర్సిటీల గడ్డాలు పెంచుకుని ఉద్యోగాల భిక్షాటనకు బైల్దేరుతాయ్”అని అలిశెట్టి ప్రభాకర్​అన్నట్లు.. నాణ్యత లేని సదువులతో తెలంగాణ బిడ్డలు రేపటి ప్రపంచంతో పోటీ పడలేక నిరుద్యోగులుగా, గుమాస్తాలుగా మిగిలిపోతారు. 

ఏటి కేడు పడిపోతున్న ప్రమాణాలు

కేంద్ర విద్యాశాఖ ఏటా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో పాఠశాల విద్య స్థితిగతులు, పనితీరుపై గ్రేడింగ్ సూచికల(పీజీఐ) పేరుతో నివేదిక విడుదల చేస్తుంది. మధ్యాహ్న భోజన పథకం, యూడైస్, జాతీయ సాధన సర్వే, జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ(ఎన్​సీఈఆర్​టీ) గణాంకాల ఆధారంగా పీజీఐ నివేదిక రూపుదిద్దుకుంటుంది. అభ్యసనా ఫలితాల నాణ్యత, విద్యార్థులు, మౌలిక వసతులు, సమానత్వం, పరిపాలన విధానం అనే ఆరు అంశాల ఆధారంగా పది దశల్లో 70 సూచికల్లో1000 పాయింట్ల ఆధారంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాల విద్య స్థితిగతులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. 2019–-20 పీజీఐ నివేదికలో తెలంగాణ అట్టడుగు స్థానంలో నిలిచింది. గత నివేదికతో పోలిస్తే పనితీరు గ్రేడింగ్ లో నిరుడు 26 రాష్ట్రాల తర్వాత నిలిస్తే.. ఈసారి 31వ స్థానానికి దిగజారింది. తెలంగాణ తర్వాత  చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాలే మిగిలాయి. తెలంగాణ 2019–20లో 772 పాయింట్లు సాధిస్తే, ఈ ఏడాది754 పాయింట్లకు దిగజారింది. ఈక్విటీ, గవర్నెన్స్ ప్రాసెస్ విభాగాల్లో కేంద్ర సరాసరి కంటే రాష్ట్రం మైనస్ పాయింట్లలో నిలవడం ఆందోళన కలిగిస్తున్నది. నాలుగు నెలల కింద విడుదలైన జాతీయ సాధన సర్వే కూడా విద్యా ప్రమాణాల విషయంలో ప్రమాద ఘంటికలనే మోగించింది. 3, 5,8,10 తరగతుల 
విద్యార్థుల అభ్యసనా ఫలితాలు విశ్లేషిస్తే చాలా దారుణ స్థితిలోకి పడిపోయినట్లు బయటపడింది. వారిలో విద్యా సామర్థ్యాల(తరగతికి తగిన పరిజ్ఞానం) సగటు 50 శాతం లోపే అని తేలింది. 8వ క్లాసులో 55 శాతం విద్యార్థులకు కూడికలు, తీసివేతలు కూడా రావని సర్వే తేల్చింది. ఫలితాలు ఎందుకిలా  వస్తున్నాయని సమీక్షించడం సహా వాటికి చెక్​ పెట్టే ప్రయత్నం టీచర్​ నుంచి సీఎం వరకు జరగట్లేదు. అందుకే ఏటికేడు విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయి.

పోస్టులన్నీ ఖాళీ..

బడిలో పాఠాలు చెప్పే టీచర్​పోస్టు సహా రాష్ట్రంలో పర్యవేక్షక అధికారుల పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. బడిలో హెడ్​మాస్టర్​ నుంచి మొదలు ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవో, విద్యా శాఖ కమిషనర్, స్పెషల్​ సెక్రటరీ వరకు ప్రతీ ఒక్కరిపై పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది. కానీ ఈ కీలక పోస్టులను ప్రభుత్వం రిక్రూట్​చేయడం లేదు. రాష్ట్రంలో 440 శాంక్షన్డ్​హెడ్​మాస్టర్​ పోస్టులు ఉంటే.. 197 మంది మాత్రమే ఉన్నారు. 594 మండలాల్లో ఏడింటికి మాత్రమే రెగ్యులర్​ ఎంఈవోలు ఉన్నారు. 62 డిప్యూటీ ఈవో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 33 జిల్లాలకు రెగ్యులర్​ డీఈవోలు ఉన్నది పదిమందే.  16  వేల నుంచి 22 వేల దాకా టీచర్ ​పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేపట్టే వరకు విద్యా వలంటీర్లతోనైనా పాఠాలు చెప్పించాల్సిన ప్రభుత్వం రెండేండ్ల కిందటే 14 వేల మంది వలంటీర్లను తొలగించింది. ఇలా పోస్టులన్నీ ఖాళీగా ఉంటే విద్యా ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి?

మౌలిక వసతుల కొరత

రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ స్కూళ్లలో సరిపోను తరగతి గదులు లేవు. తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్,​ విద్యుత్ సరఫరా లాంటి సౌలత్​లు ఏవీ లేవు. సర్కారు స్కూళ్ల దశ, దిశ మారుస్తామని ప్రభుత్వం ఆర్బాటంగా తెచ్చిన ‘మన ఊరు మన బడి’ తో ఇప్పటి వరకు సమకూరిన సౌలత్​లు ఎక్కడా లేవు. బడులను బాగు చేయడానికి వేల కోట్లతో ప్రతిపాదనలు ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్​లో నిధులు కేటాయించకపోవడం విడ్డూరం. రాష్ట్రంలో 12 వేల బడుల్లో అదనపు తరగతి గదులు అవసరమని, సుమారు 300 స్కూళ్లు శిథిలావస్థలో ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కరోనా ఎఫెక్ట్​తో రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ప్రైవేటు బడ్జెట్ ​స్కూళ్లు మూతపడ్డాయి. వాటిల్లో చదివే విద్యార్థులంతా ప్రభుత్వ బడుల్లో చేరారు. దాదాపు 2 లక్షల 50 వేల మంది వరకు కొత్తగా విద్యార్థులు సర్కారు బడుల్లో చేరినా.. అక్కడ సార్లు, సౌలత్​లు లేక మళ్లీ బడి మారారు. విద్యకు ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్​కూడా ఏటా తగ్గుతూ వస్తున్నది. 2014లో రాష్ట్ర బడ్జెట్​లో విద్యా రంగానికి 10.28 శాతం నిధులు కేటాయించిన ప్రభుత్వం.. 2022 నాటికి 7.3 శాతానికి తగ్గించింది. తెలంగాణ కంటే తక్కువ ఆదాయం ఉన్న ఢిల్లీ తన బడ్జెట్​లో విద్యకు 23.50 శాతం, అస్సాం 20.10 శాతం, పక్క రాష్ట్రం ఏపీ కూడా 12.70 శాతం నిధులను బడ్జెట్​లో కేటాయిస్తున్నది. దేశంలో తెలంగాణ కంటే 21 రాష్ట్రాలు వాటి బడ్జెట్​లో విద్యా రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తుండటం గమనార్హం. సరిపోను నిధులు కేటాయించకుండా, సౌలత్​లు సమకూర్చకుండా మెరుగైన విద్యా ప్రమాణాలను ఎలా ఆశించగలం? ఏపీ సీఎం జగన్​మోహన్​ రెడ్డి ప్రతి నెలలో కనీసం రెండుసార్లు విద్యారంగంపై సమీక్ష నిర్వహించి పిల్లల చదువులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఏపీ ఈసారి మన కంటే మంచి స్థానంలో నిలబడింది. రాష్ట్ర సర్కారు ఇప్పటికైనా విద్యా వ్యవస్థ దుస్థితిపై సమీక్ష నిర్వహించాలి. సమస్యలు ఏమున్నాయో గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలి. అప్పుడే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఓ అర్థం ఉంటుంది. 

టీచర్ల జవాబుదారీతనం

విద్యా ప్రమాణాలు దిగజారడానికి కారణాలను విశ్లేషిస్తేనే.. విద్యలో నాణ్యత తెచ్చేందుకు వీలు పడుతుంది. తరగతి గదిలో టీచర్​చెప్పే పాఠం.. విద్యార్థులకు అర్థమైతేనే అభ్యసన ఫలితాలు బాగుండి విద్యా ప్రమాణాలు మెరుగుపడుతాయి. అందుకు ఉపాధ్యాయుడికి జవాబుదారీతనం అవసరం. కానీ స్వరాష్ట్రంలో ఉపాధ్యాయుడి జవాబుదారీతనం గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారికి నెలలో 15వ తేదీలోపు కూడా వేతనాలు అందడం లేదు. బదిలీలు, ప్రమోషన్లు లేక విసుగులో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఉత్సాహంగా కొత్త బోధన పద్ధతులతో టీచింగ్​ చేయడానికి వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు పెద్దగా నిర్వహించడం లేదు. ఆ శిక్షణ ఇచ్చే బీఎడ్, డైట్​కాలేజీల్లోనూ 90 శాతం ఖాళీలే ఉన్నాయి. ప్రభుత్వ బీఈడీ కాలేజీల్లో 95 పోస్టులకు గానూ.. ఒకటి మాత్రమే ఫిలప్​అయి ఉంది. 206 డైట్ ​లెక్చరర్లకు​17 మంది మాత్రమే ఉన్నారు. సీనియర్​ లెక్చరర్లు ఒక్కరూ లేకపోవడం గమనార్హం. శిక్షణ ఇచ్చే వారు లేనప్పుడు టీచర్లు వారి మెలకువలు ఎలా పెంపొందించుకోగలరు? ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్​ మీడియం ప్రారంభించిన ప్రభుత్వం.. టీచర్లకు మూడు నాలుగు వారాలు ఆన్​లైన్ శిక్షణ ఇచ్చి మమ అనిపించింది. ఏండ్లుగా తెలుగు మీడియంలో చెప్పిన టీచర్లు నాలుగు ఐదు వారాల శిక్షణతో ఇంగ్లిష్​ మీడియంలో ఎలా చెప్పగలరు? విద్యార్థులు వారిని ఎంతవరకు అందుకోగలరు?  ప్రభుత్వం ఎప్పుడైతే ఉపాధ్యాయుడి జవాబుదారితనాన్ని బలపరుస్తుందో అప్పుడు విద్యార్థి అభ్యసన ఫలితాలూ బాగుంటాయి. - కాశెట్టి కరుణాకర్, సీనియర్​ జర్నలిస్ట్