పోటీ లేకుండానే మండలికి కవిత?

పోటీ లేకుండానే మండలికి కవిత?

వెలుగు నెట్​వర్క్​/హైదరాబాద్‌‌, వెలుగు: నిజామాబాద్‌‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి రెండే నామినేషన్లు దాఖలయ్యాయి. కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆమెపై పోటీకి దిగిన ఇండిపెండెంట్‌‌ ను బుజ్జగించడానికి మంత్రి తదితరులు రంగంలోకి దిగారు. లోకల్‌‌బాడీస్‌‌ ఎమ్మెల్సీ స్థానాలకు చివరి రోజు మంగళవారం భారీగా నామినేషన్లు పడ్డాయి. బీజేపీ పోటీకి దూరంగా ఉంది. తమకు ప్రత్యర్థులెవరూ ఉండరని, ఏకగ్రీవమేనని అధికార పార్టీ లీడర్లుఅనుకోగా తెల్లారేసరికి అనూహ్య పరిణామాలు జరిగాయి. చాలాచోట్ల రూలింగ్​పార్టీ నుంచే రెబల్స్, ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు సీన్​లోకి ఎంటరై క్యాంప్​రాజకీయాలు షురూ చేశారు. కరీంనగర్​జిల్లాలో చివరి రోజు13 మంది 31నామినేషన్లు వేశారు. రూలింగ్​పార్టీ లీడర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్​సింగ్​ఇండిపెండెంట్​గా దిగారు. -టీఆర్ఎస్​కే చెందిన రాష్ట్ర ఎంపీపీ ల ఫోరం అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి మరో ఇద్దరు ఎంపీటీసీలు కూడా నామినేషన్లు వేశారు. మంత్రులు గంగుల, కొప్పుల సూచనలతో అందుబాటులో ఉన్న ఓటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఎంపీటీసీలు,  జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పెద్దగా రాకపోవడంతో లీడర్లలో టెన్షన్​ మొదలైంది. దాంతో అప్పటికప్పుడు 60 ఆర్టీసీ  బస్సులు తెప్పించి మీటింగ్​నుంచి హైదరాబాద్‍ శివారులోని రిసార్ట్ కు తరలించారు. 

జగ్గారెడ్డి ఎంట్రీతో..
మెదక్ లోకల్ బాడీ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని డాక్టర్ యాదవ రెడ్డితో టీఆర్ఎస్ నామినేషన్ ​వేయించింది. కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య, సంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ నిర్మల బరిలో నిలిచారు. వీరికి తోడు ఐదుగురు టీఆర్​ఎస్​ లీడర్లే ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేయడం పార్టీని కలవరపెడుతోంది.

నల్గొండ జిల్లాలో బుజ్జగింపులు.. 
నల్గొండ జిల్లాలో 10 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. వీరిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనచరుడు నల్గొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ కుడుదల నగేశ్, ఎంపీ బడుగుల లింగయ్య బంధువు రవీందర్​తదితరులు బరిలో నిలవడంతో టీఆర్ఎస్ లీడర్లలో టెన్షన్​ మొదలైంది. వాళ్లకు ఏకంగా వంద మంది సపోర్ట్​చేయడంతో మంత్రి జగదీశ్ రెడ్డి రంగంలోకి దిగి ఇండిపెండెంట్లను బుజ్జగించే పనిలో పడ్డారు.

కొత్తగూడెంలో హైడ్రామా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాముదాకా  హైడ్రామా కొనసాగింది. మున్సిపాలిటీ లోని 26 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్ల నుంచి 15 మంది వేరుపడి తమలో ఒకరిని ఇండిపెండెంట్ గా బరిలో నిలిపేందుకు రెడీ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు టెన్షన్​ మొదలైంది. ఆయన తన తనయుడు రాఘవను రెబల్​కౌన్సిలర్ల వద్దకు సోమవారం అర్ధరాత్రి పంపించారు. మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు రాఘవ టీఆర్ఎస్ కౌన్సిలర్ల తో మంతనాలు జరిపి, నామినేషన్​ వేయకుండా ఒప్పించారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇప్పటికే  కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండగా, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. ఆదిలాబాద్  ఎమ్మెల్సీ స్థానానికి 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్​లో మొత్తం 937 ఓటర్లు ఉండగా అందులో 540  ఓటర్లు టీఆర్ఎస్​వాళ్లే. కానీ రూలింగ్​పార్టీ తన అభ్యర్థిగా పెద్దగా పరిచయంలేని విఠల్ ను ప్రకటించడంతో అంతా నారాజ్ అయ్యారు. దీంతో టీఆర్ఎస్​కే చెందిన సారంగాపూర్ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, కడెం జెడ్పీటీసీ శ్రీనివాస్​రెడ్డి నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.

26 వరకు గడువు
నామినేషన్లను బుధవారం పరిశీలిస్తారు. ఉప సంహరణకు 26 తుది గడువు.

నిజామాబాద్​, వెలుగు: స్థానిక సంస్థల అభివృద్ధి, నిధుల కోసం కృషి చేస్తానని టీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ క్యాండిడేట్​ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నిజామాబాద్​ కలెక్టరేట్​లో ఆమె నామినేషన్​ వేశారు. కలెక్టర్​ నారాయణరెడ్డికి నామినేషన్​ పేపర్లను అందజేసి మీడియాతో మాట్లాడారు. గతంలో పోటీ చేసినప్పుడు స్థానిక సంస్థల నేతలు తనను గెలిపించారని, ఈ ఏడాది కాలంలో స్థానిక సంస్థలను అభివృద్ధి చేశానని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలే ఉన్నారని, 90 శాతం మంది స్థానిక సంస్థల నేతలు  టీఆర్​ఎస్‌‌కు చెందినోళ్లేనని  ఆమె చెప్పారు. మరోసారి సహకరించాలని కోరారు.