సింగరేణి లాభాల వాటా పంపిణీ సరిగా లేదు

సింగరేణి లాభాల వాటా పంపిణీ సరిగా లేదు
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో కార్మికులు కష్టపడి కంపెనీకి లాభాలు తీసుకొస్తే, సరిగా పంచకుండా కార్మికుల నోట్లో మట్టి కొట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లో హెచ్ఎంఎస్​యూనియన్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబరాలకు వెళ్తూ గోదావరిఖని తీన్​రస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణికి ఆరు వేల కోట్లకుపైగా లాభాలు వస్తే అందులో రూ.4 వేల కోట్లు పక్కన పెట్టి, కేవలం 2 వేల కోట్లపై 34 శాతం లాభాల్లో వాటా పంచడమేంటని ప్రశ్నించారు. 

న్యాయపరంగా లాభాలను ఇవ్వకుండా కాంగ్రెస్​ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని విమర్శించారు. గెలిచిన సంఘాలతో చర్చించకుండా సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులను పిలిచి లాభాలు, వాటా ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, సింగరేణి జాగృతి అధ్యక్షుడు ఎల్.వెంకటేశ్, జాగృతి లీడర్లు నిట్టూరి రాజు, బొల్లం భూమేశ్, సకినాల ప్రతాప్, సమరం తదితరులు పాల్గొన్నారు.