20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  టచ్‌‌లో ఉన్నరు : కేసీఆర్

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  టచ్‌‌లో ఉన్నరు : కేసీఆర్
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌లోకి వస్తామంటే.. ఇప్పుడే వద్దని వారించిన: కేసీఆర్​
  • ఏడాదిలో గవర్నమెంట్ కూలిపోతది.. మళ్లీ మేమే అధికారంలోకి వస్తం
  • బీఎల్‌‌ సంతోష్‌‌పై కేసు పెట్టినందుకే కవితను అరెస్టు చేసిన్రు
  • ఈ నెలాఖరు నుంచి బస్సుయాత్ర చేస్త.. టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తానని వెల్లడి
  • ఎంపీ అభ్యర్థులకు బీ ఫామ్‌‌లు అందజేత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోగా కూలిపోతుందని, మళ్లీ బీఆర్​ఎస్సే అధికారంలోకి వస్తుందని బీఆర్‌‌‌‌ఎస్ చీఫ్​ కేసీఆర్ అన్నారు. 20 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు బీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా రేవంత్‌‌రెడ్డి సర్కార్‌‌‌‌ను కూల్చేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు. 

కాంగ్రెస్‌లో ఇప్పటికే బీజేపీ చెప్పినట్టుగా వ్యవహారం నడుస్తున్నదని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ నుంచి ఓ కీలక నాయకుడు నాకు  ఫోన్ చేసిండు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్‌‌ఎస్‌లోకి వస్తానన్నడు. ఇప్పుడే వద్దు అని నేనే వారించిన” అని చెప్పారు. సొంతంగా 104 మంది ఎమ్మెల్యేలు, మద్దతుగా ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేల బలం ఉన్న బీఆర్‌‌ఎస్ ప్రభుత్వాన్నే బీజేపీ కూల్చేందుకు కుట్ర చేసిందని, అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడం బీజేపీకి పెద్ద విషయం కాదని కేసీఆర్​ ఆరోపించారు.

‘‘కేటీఆర్ చెప్తున్నట్టుగా రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ రేవంత్ బీజేపీలోకి వెళ్లినా, ఆయన వెంబడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం లేదు. ఎటొచ్చి ఏడాదిలో రాష్ట్రంలో సర్కార్ కూలిపోతది. అప్పుడు జరిగే ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్ బంపర్ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తది” అని ఆయన వ్యాఖ్యానించారు. బీ ఫామ్ ఎవరికిస్తే వాళ్లు గెలిచినట్టేనని అన్నారు. పార్టీ నుంచి పోయే వృద్ధుల గురించి ఆలోచించొద్దని, యువకులకు అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు. సమావేశంలో కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

8 ఎంపీ సీట్లు గెలుస్తం

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై 4 నెలలకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. తాజా సర్వేల ప్రకారం రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లలో బీఆర్‌‌ఎస్ గెలుస్తుందని, మరో 3 స్థానాల్లో విజయానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు పదే పదే గుర్తు చేయాలని బీఆర్​ఎస్​ నేతలకు ఆయన సూచించారు. పొద్దంతా రైతుల వద్దకు, కల్లాల వద్దకు వెళ్లి వారితో మాట కలపాలని.. కాంగ్రెస్ ఇచ్చిన రూ.500 బోనస్ సహా ఇతర హామీలను గుర్తు చేయాలని చెప్పారు. అనవసరమైన విమర్శలకు పోకుండా.. కాంగ్రెస్ హామీలపై ఎక్కువగా ఫోకస్  పెట్టాలన్నారు. ఈ నెల చివరివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. ముఖ్యనాయకత్వమంతా కూర్చొని చర్చించి, రూట్‌మ్యాప్‌పై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందే టీవీల్లో కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తానని, అన్ని విషయాలపై మాట్లాడుతానని కేసీఆర్ చెప్పారు. 

ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షలు

బీఆర్‌‌ఎస్ ఎంపీ అభ్యర్థులందరికీ బీ ఫామ్‌లను, ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్కరికి రూ.95 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదితను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన మీటింగ్‌లో నివేదితకు కూడా బీఫామ్‌ను, రూ.45 లక్షల చెక్కును కేసీఆర్ అందజేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ అరెస్ట్ లు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నదని ఆయన ఆరోపించారు. కేసులపై పోరాడేందుకు లీగల్ సెల్‌ను పటిష్టం చేశామని, రూ.10 కోట్లు కేటాయించామని తెలిపారు. భవిష్యత్ లో ఎటువంటి న్యాయపరమైన సేవలైనా అందించేందుకు పార్టీ సీనియర్ అడ్వకేట్ల బృందం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు.

కాఫర్​ డ్యామ్​ కట్టుడు బీఆర్​ఎస్​ విజయమే

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందన్నట్టు అబద్ధాలు, కట్టుకథలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని కేసీఆర్  దుయ్యబట్టారు. ఇప్పుడు అదే ప్రభుత్వం కాఫర్ డ్యామ్ కట్టాలని నిర్ణయించటం బీఆర్ఎస్ సాధించిన విజయమేనని ఆయన చెప్పారు. ప్రజలకు ఈ విషయం తెలిసేలా మీటింగుల్లో చెప్పాలని బీఆర్​ఎస్​ నేతలకు సూచించారు. 

మిల్లర్లపై అక్రమ కేసులు పెడ్తున్నరు

వడ్ల కొనుగోలు చేతగాక, మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నదని కేసీఆర్ అన్నారు. ‘‘వరికోతలు కొనసాగుతున్నాయి. ఎక్కడివక్కడే వడ్లకుప్పలు మిగిలిపోయాయి. కల్లాలకు వచ్చిన ధాన్యాన్ని కొనే దిక్కే లేదు. ధాన్యం కొనడం చేతగాక మిల్లర్ల మీద కేసులు బనాయిస్తన్నరు. 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నరు.. అదీలేదు. ధాన్యం కొనుగోలు కోసం గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని పకడ్బందీ చర్యలను యధాతథంగా అమలు చేయటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. నిర్లక్ష్యంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తూ రైతులకు నష్టం చేస్తోంది” అని ఆయన దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై పోస్టు కార్డు ఉద్యమం చేయాలని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లక్ష పోస్టు కార్డులను ప్రభుత్వానికి పంపించాలని అన్నారు. 

బీఎల్‌ సంతోష్‌ వల్లే కవిత అరెస్ట్‌

తన కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ స్పందించారు. ‘‘ప్రజలు పూర్తి మెజార్టీతో గెలిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ పన్నిన కుట్రలను భగ్నం చేసి, కుట్రదారులను వల వేసి పట్టుకున్నం. బీఎల్ సంతోష్ వంటి కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వామిగా ఉన్నారని తెలిసి ఆయనను కూడా వదిలిపెట్టలేదు.

ఆయన మీద కేసులు పెట్టినం. అరెస్ట్ చేయడానికి ఢిల్లీలోని బీజేపీ ఆఫీసుకు పోలీసులను పంపించినం. అందుకే బీఎల్​ సంతోష్, ప్రధాని మోదీ మనమీద కక్ష పెంచుకున్నరు. బీఎల్ సంతోష్ కు నోటీసులు పంపినందుకు ప్రతీకారంగా అక్రమ కేసు బనాయించి కవితను అరెస్ట్ చేయించిన్రు. ఢిల్లీ లిక్కర్​ కేసు పేరుతో సాగుతున్న వ్యవహారం అసలు ఓ కేసే కాదు. అందులో ఎటువంటి ఆధారాలు లేవు. రూ.వంద   కోట్ల స్కామ్ జరిగినట్టుగా కూడా ఇప్పటివరకూ నిరూపించలేదు. బీఎల్ సంతోష్‌ మీద కేసు పెట్టకపోతే, అసలు కవితను అరెస్ట్ చేసేవాళ్లు కాదు” అని కేసీఆర్  అన్నారు. 

నదీజలాలపై బీజేపీ కుట్రలు

తెలంగాణకు దక్కాల్సిన గోదావరి నది జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని  కేసీఆర్ ఆరోపించారు. “గోదావరి నది మీద ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్ట్ కట్టి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీళ్లను మలుపుకుపోదామని బీజేపీ కుట్రలు చేస్తున్నది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టే కుట్రలకు బీజేపీ సిద్ధమైందని దుయ్యబట్టారు.

బీజేపీని నిలదీయటానికి వంద రకాల కారణాలున్నాయని, వాటన్నింటిని ప్రజలకు వివరించేందుకు బీఆర్​ఎస్​ శ్రేణులు సోషల్ మీడియా వేదికలను విస్తృత స్థాయి లో వినియోగించుకోవాలని కేసీఆర్ సూచించారు. ‘‘బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో నిలదీయాలి. ఒక్క డాలర్  విలువను 83 రూపాయలకు పెంచినందుకా? ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మలుపుకుపోతున్నందుకా? కృష్ణా నది మీద ప్రాజెక్ట్ లను కేఆర్ఎంబీ కి అప్పగించినందుకా? ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినందుకా? తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నందుకా? ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వనందుకా? ఇట్ల వంద కారణాలు ముందు పెట్టి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఆ పార్టీ నేతలను నిలదీయాలి” అని బీఆర్​ఎస్​ లీడర్లతో ఆయన అన్నారు.