అమరులను మరిచిన కేసీఆర్ సర్కారు

అమరులను మరిచిన కేసీఆర్ సర్కారు
  • ఉద్యమంలో 1,381 మంది ఆత్మ బలిదానం
  • 576 మందికి మాత్రమే ప్రభుత్వ సాయం 
  • రూ.10 లక్షలు , కుటుంబంలో ఓ ఉద్యోగం పత్తాలేవు
  • సాగు భూమి, ఇల్లు, ఎడ్యుకేషన్‌, హెల్త్ ఫెసిలిటీ ఎవరికీ రాలే
  • ఇంకా నిర్మాణ దశలోనే అమరుల స్మారక చిహ్నం

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడుతూ.. ప్రాణాలర్పించిన అమరులను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది. ఉద్యమంలో అసువులుబాసిన అమరుల కుటుంబాలను గాలికొదిలేసింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని పట్టించుకుంట లేదు. కొంత మందినే ఆదుకొని.. మిగతా కుటుంబాలకు మొండిచెయ్యి చూపింది. బాధిత కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా సర్కారులో మాత్రం చలనం కనిపించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామన్న అమరుల స్మారక చిహ్నం, స్మృతివనం ఏడున్నరేండ్లు గడుస్తున్నా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.

తెలంగాణ మలి దశ ఉద్యమంలో దాదాపు 1,381మంది అమరులయ్యారు. ఇదే విషయంపై టీఆర్ఎస్​ పార్టీ, పొలిటికల్ ​జేఏసీ నాటి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్​ ఇచ్చాయి. ఆ తర్వాత1,089 మంది అమరులు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోయారో పూర్తి వివరాలతో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కూడా ఒక నివేదిక రూపొందించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని 2014 మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు సాగుకు యోగ్యమైన భూమి, పిల్లల చదువు బాధ్యత తీసుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా రిలీజ్‌ చేసింది. కుటుంబానికి రూ.10 లక్షల సాయం, ఉద్యోగం, సాగుకు భూమి, ఇల్లు, ఎడ్యుకేషన్‌, హెల్త్‌ ఫెసిలిటీ కల్పించనున్నట్లు జీవో నంబర్‌ 80లో పేర్కొంది. 

576 మందికి జాబ్‌, రూ.10 లక్షలు మాత్రమే..

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 576 మందినే గుర్తించింది. వీరిలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.10 లక్షల ఆర్థిక సాయం మాత్రమే అందించింది. సాగు భూమి, ఇల్లు, ఎడ్యుకేషన్‌, హెల్త్‌ కార్డులు మాత్రం ఇవ్వలేదు. ఉద్యోగాల్లో ఒక్క12 మందికి మాత్రమే వీఆర్‌వో స్థాయి జాబ్స్‌ ఇచ్చారు. మిగతా వారందరికీ జూనియర్‌ అసిస్టెంట్, స్వీపర్‌, వాచ్‌మెన్‌, అటెండర్‌ ఉద్యోగాలు ఇచ్చారు. ఇక 1391లో 576 కుటుంబాలు పోగా, మిగతా మిగతావారిని ప్రభుత్వం గాలి కొదిలేసింది. రూ. 100 కోట్లు ఇస్తామని చెప్పి, ఇప్పటి దాకా రూ. 57 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా డబ్బులు ఎటు పోయాయే ఎవరికీ తెలియదు. అమరుల బలిదానాల ఆధారాలు ఉన్నా పట్టించుకోవడం లేదని ఉద్యమకారులు, అమరుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ లీడర్లు వచ్చి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారని, ఫొటోలు ఉన్నా ఇవ్వడం లేదని వాపోతున్నారు. తమను పట్టించుకోవాలని అమరుల కుటుంబాలు అనేక దఫాలుగా నిరసనలు, ఆందోళనలు చేపట్టినా పట్టించుకునేవారు కరువయ్యారు.

అమరుల స్మృతి చిహ్నాలు ఏమాయే..

హైదరాబాద్‌లో ట్యాంక్‌ బండ్‌ వద్ద ప్రపంచంలో అత్యంత ఎత్తైన అమరుల స్మారక చిహ్నం, దాని పక్కనే అమరుల స్మృతి వనం నిర్మిస్తామని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కానీ ఏడున్నరేండ్లు గడుస్తున్నా హైదరాబాద్‌లో స్మారక చిహ్నం, అమరుల స్మృతి వనం కంప్లీట్‌ కావడం లేదు. నిర్మాణ పనులు  స్లోగా నడుస్తున్నాయి. అన్ని జిల్లాల్లో అమరుల స్మృతి వనాలు నిర్మిస్తామని మేనిఫెస్టోలో పెట్టడంతోపాటు నాయకులు ఎన్నికల్లోనూ ప్రచారం చేశారు. ఇప్పటి దాకా ఏ జిల్లాలలో స్మృతి వనాలు నిర్మించలేదు. కనీసం వాటి ఊసే ఎత్తడం లేదు.

త్యాగాలు ఒకరివి.. భోగాలు మరొకరివి

తెలంగాణ సర్కారు అమరులను నిర్లక్ష్యం చేస్తున్నది. గౌరవంగా, గొప్పగా చూసుకోవాల్సింది పోయి.. త్యాగాలను అవమాన పరుస్తున్నది. రాష్ట్రంలో ఎలాంటి త్యాగాలు చేయని వారు భోగాలు అనుభవిస్తున్నరు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. అమరుల కుటుంబాలకు కనీసం మేనిఫెస్టోలో పెట్టినవి కూడా అమలు అయితలేవు. వీలైనంత త్వరగా జీవో నంబర్‌ 80 ఇంప్లిమెంట్‌ చేయాలి. లేదంటే కోర్టు మెట్లు ఎక్కి ప్రభుత్వంతో పోరాడుతం.

 -గాదె ఇన్నయ్య, ప్రజా ఉద్యమకారుల వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు

అందరినీ ఆదుకోవాలి

అమరుల త్యాగాన్ని తెలంగాణ సర్కారు మరిచిపోయింది. వారి కుటుంబాలు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. కొంత మందిని మాత్రమే సర్కారు గుర్తించింది. మిగతా వారిని పట్టించుకోవడం లేదు. అందరినీ ఆదుకోవాలి. ప్రతి అమరవీరుడి కుటుంబానికి గుర్తింపు కార్డు ఇవ్వాలి. అమరవీరుల కాలనీతోపాటు, కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. స్తూపాలను నిర్మించి, జూన్‌ 2ను అమరువీరుల దినంగా ప్రకటించాలి. 

- నరేశ్ నాయక్, తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక, ప్రెసిడెంట్‌