మరో 4 వేల కోట్ల కొత్త అప్పుకు రెడీ అయిన సర్కారు

మరో 4 వేల కోట్ల కొత్త అప్పుకు రెడీ అయిన సర్కారు
  • ఆర్‌‌‌‌బీఐ బాండ్ల వేలంతో సేకరించాలని నిర్ణయం!
  • ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా 7 నెలల్లో రూ.30 వేల కోట్ల అప్పు
  • సగటున మిత్తీలకే నెలకు రూ.1,500 కోట్ల చెల్లింపులు

హైదరాబాద్, వెలుగు: మరో రూ.4 వేల కోట్ల అప్పు తెచ్చేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయింది. ఆర్‌‌బీఐ బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలని భావిస్తోంది. ఖజానా ఖాళీ అవడంతో ప్రతినెలా అప్పులపైనే ప్రభుత్వం ఆధారపడుతోంది. వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆమ్దానీ కూడా కిస్తీలు, మిత్తీలకే సరిపోతోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున రావాల్సిన జీతాలు వారం, పది రోజులకు వస్తున్నాయి. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మూడు, నాలుగు నెలలకోసారి శాలరీలు చెల్లిస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ స్టూడెంట్ల ఫీజు రీయింబర్స్​మెంట్ వంటి పథకాలకు చెల్లింపులు నిలిచిపోయాయి. నిధులు కొరత ఉండటంతో ఆసరా కొత్త ఆప్లికేషన్లను మంజూరు చేయడం లేదు.

రైతుబంధుకు అప్పుడూ, ఇప్పుడూ అప్పులే

యాసంగి సీజన్ అక్టోబర్ నుంచే మొదలైంది. ఇప్పటికే రైతుబంధు సొమ్ము రైతుల అకౌంట్లలో జమ చేయడం మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 60.84 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.7,360 కోట్లు జమ చేశారు. ఇప్పుడు యాసంగిలోనూ దాదాపు అంతే మొత్తంలో జమ చేయాల్సి ఉంది. ఇటీవల ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇంటర్నల్ రివ్యూలో వివిధ పథకాలకు చెల్లింపులపై డిస్కషన్ జరిగింది. రైతుబంధు కోసం రూ.4 వేల కోట్లు అప్పు తీసుకోవాలని ప్రపోజల్స్ రెడీ చేసినట్లు తెలిసింది. ఆర్బీఐ బాండ్ల వేలం పాటలో ఈ మొత్తాన్ని తీసుకోనున్నారు. గత ఖరీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇచ్చిన రైతుబంధు పైసలను అప్పులతోనే సర్దుబాటు చేశారు. ఇందుకోసం ఒక్క జులై నెలలోనే రూ.8,500 కోట్లు అప్పు తీసుకున్నట్లు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి.

కొత్త ‘ఆసరా’ మరింత ఆలస్యం

నిధుల కొరతతోనే సర్కార్ కొత్త ఆసరా పెన్షన్లను పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టింది. కొత్త అప్లికేషన్లకు అప్రూవల్ ఇస్తే 57 ఏండ్లు పైబడిన వారికి రూ.2,016 పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల మంది కొత్తగా అప్లై చేసుకున్నారు. దివ్యాంగులు, వితంతువులు, ఇతర పెన్షన్లకు సంబంధించిన ఆప్లికేషన్లు కూడా పెండింగ్​లో ఉన్నాయి. కొత్త అప్లికేషన్లకు అప్రూవల్ ఇస్తే ఇప్పుడు చెల్లిస్తున్న దానికి అదనంగా ప్రతినెలా మరో రూ.300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అర్హులు అప్లికేషన్లు చేసుకోవాలంటూ ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచింది. ఈ గడువుల వాయిదాతో పాటు.. అప్లికేషన్ల పరిశీలన పేరుతో మరింత లేట్ చేసే ఆలోచన ఉందని ప్రభుత్వ వర్గాలే చెప్తున్నాయి.

రెండేళ్లుగా ఆగిపోయిన రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్

స్టూడెంట్లకు రావాల్సిన స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు రెండేళ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి. కాగితాల్లో శాంక్షన్ ఆర్డర్లు వస్తున్నాయే తప్ప పైసా కూడా జమ చేయడం లేదు. బీసీ, ఎస్సీ, మైనార్టీ స్టూడెంట్లకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, స్కాలర్​షిప్పుల మొత్తం దాదాపు రూ.4 వేల కోట్లు ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు. కరోనా పేరుతో కాలేజీలు బందయ్యాయని ఫండ్స్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేయకుండా సర్కార్ తప్పించుకుంది. ఇప్పుడు విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో మార్కుల మెమోలు, టీసీ, ఇతర సర్టిఫికెట్ల విషయంలో స్టూడెంట్లను ప్రైవేట్ యాజమాన్యాలు సతాయిస్తున్నాయి. కొన్నిచోట్ల స్టూడెంట్ల నుంచి డబ్బు కట్టించుకుని, ప్రభుత్వం జమ చేసినప్పుడు ఇస్తమని చెప్పి సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. ఇక కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ అప్లికేషన్లను నెలల కొద్దీ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెడుతున్నారు.

ప్రతినెలా అప్పుల కోసం వేట

రాష్ట్ర సర్కార్ ప్రతినెలా రూ.4 వేల కోట్ల అప్పులు తీసుకుంటున్నది. ఇలా ఏడు నెలల్లో చేసిన అప్పు రూ.30 వేల కోట్లకు చేరింది. పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలు ఇవ్వడం, తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టేందుకే ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. మరోవైపు దళిత బంధు స్కీమ్, జిల్లాల పర్యటనలో సీఎం ప్రకటించిన వరాలకు, ఇతరత్రా వంటి వాటి భారం కూడా ఉన్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.47,500 కోట్లు అప్పులు చేయాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. అనుకున్నదాని కంటే మరింత ఎక్కువ అప్పులు చేసేందుకు.. అప్పుల పరిమితిని 4 శాతం నుంచి 5%కు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ అడుగుతోందని ఆఫీసర్లు అంటున్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకున్న అప్పులు రూ.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

సర్కారు ఆమ్దానీ కిస్తీలు, మిత్తీలకే

రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై మిత్తీలకే ప్రతినెలా సగటున రూ.1,500 కోట్లు కడుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఇట్ల రూ.8,801 కోట్లు కట్టింది. ఇక చేసిన అప్పులకు కడుతున్న కిస్తీలు కూడా వేల కోట్లలోనే ఉన్నాయి. సెప్టెంబర్ నెలఖారు వరకు రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం రూ.45,859 కోట్లు కాగా ఇందులో సగం అప్పులకు, మిత్తీలకే పోయింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న అప్పు (రూ.కోట్లలో)

ఏప్రిల్                 4,112

మే                       1,502

జూన్                   3,505

జులై                   8,504

ఆగస్టు                5,447

సెప్టెంబర్          3,601

అక్టోబర్              2,002

నవంబర్ (1వ తేదీన)    2,000

మొత్తం    30,673