
- ఇండ్లకు యూనిట్‌పై 50 పైసలు..
- కమర్షియల్, ఇండస్ట్రీలకు రూ.1 పెంపు
- ప్రజలపై అదనంగా రూ. 6,831కోట్ల భారం
- ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదన
- ఏప్రిల్ నుంచి అమలులోకి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంటు చార్జీల మోత మోగనుంది. కస్టమర్లపై అదనంగా రూ. 6,831 కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రతిపాదనలు పంపాయి. దీని ప్రకారం కోటీ 10 లక్షల మంది గృహ వినియోగదారులపై ప్రతి యూనిట్‌కు 50 పైసల చొప్పున చార్జీలు పెరుగనున్నాయి. 44 లక్షల మంది కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియోగదారులపై యూనిట్‌కు రూ. 1 చొప్పున చార్జీలు పెరుగనున్నాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ పబ్లిక్ హియరింగ్ నిర్వహించి అనుమతి ఇవ్వడమే మిగిలి ఉంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి కరెంటు చార్జీల పెంపు అమలులోకి వస్తుంది. చివరిసారిగా 2018-–19లో చార్జీలను పెంచారు.
లోటును పూడ్చుకునేందుకు..!
వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో డిస్కంలకు రూ. 53,054 కోట్ల అవసరాలు ఉన్నాయి. ఇందులో సర్కారు నుంచి రూ. 5 వేల కోట్ల సబ్సిడీలతో కలిపి రెవెన్యూ రూ. 42,126 కోట్ల వస్తాయని డిస్కంలు అంచనా వేశాయి. ఆదాయానికి, అవసరాలకు మధ్య రూ. 10,928 కోట్లు లోటు ఉన్నట్లు ప్రకటించాయి. ఈ లోటులో అంతర్గత సర్దుబాట్లు, ప్రభుత్వ మద్దతు కలిపి రూ. 4,097 కోట్ల దాకా అడ్జస్ట్ చేసుకోనున్నాయి. మిగిలిన రూ. 6,831కోట్లు చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. 2019–20, 2020–21, 2021–22కు సంబంధించిన రూ. 27 వేల కోట్ల నష్టాలను ఎట్లా పూడ్చుకుంటారనేది మాత్రం డిస్కంలు వెల్లడించలేదు.
ఎవరినీ వదిలిపెట్టలే..
గృహ, కమర్షియల్, ఇండస్ట్రియల్.. ఇట్లా అన్నివర్గాలపై కరెంట్ చార్జీల భారం పడనుంది. తాజాగా ప్రకటించిన చార్జీల టారీఫ్ ప్రకారం ఎల్టీ గృహ వినియోగదారులపై ప్రతి యూనిట్‌కు 50 పైసల చొప్పున.. కమర్షియల్, హెచ్‌టీ ఇండస్ట్రియల్ వినియోగదారులపై యూనిట్‌కు రూ. 1 చొప్పున పెంచాలని డిస్కంలు
నిర్ణయించాయి. ఈ పెంపు వల్ల సామాన్య, మధ్యతరగతి జనంపై భారీగా భారం పడనుంది. ఎల్టీ డొమెస్టిక్ వినియోగదారులపై 50 పైసల పెంపు, కమర్షియల్, కుటీర పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్ల వినియోగదారులపై రూపాయి పెంపు ద్వారా అదనంగా రూ. 2,110 కోట్లు వసూలు చేయనున్నాయి. హెచ్‌టీ ఇండస్ట్రియల్పై రూపాయి పెంపుతో అదనంగా రూ. 4,721 కోట్లు రాబట్టనున్నాయి. ఇట్లా మొత్తంగా రూ. 6,831 కోట్ల అదనపు భారాన్నీ వినియోగదారులపై మోపనున్నాయి.
150 యూనిట్లకు 754 రూపాయల బిల్లు
51–100 యూనిట్ల వినియోగానికి ప్రస్తుతం యూనిట్‌కు రూ. 2.60 చార్జీలు వసూలు చేస్తుండగా.. 50 పైసల పెంపుతో రూ. 3.10 వసూలు చేస్తారు. 101–200 యూనిట్ల వాడకానికి ప్రస్తుతం యూనిట్‌కు రూ. 4.30 చొప్పున వసూలు చేస్తుండగా.. 50 పైసల పెంపుతో రూ. 4.80 వసూలు చేయనున్నారు. 51–200 యూనిట్ల కరెంట్వాడే వారు 60 లక్షల మంది ఉన్నారు. వీరంతా సామాన్య, మధ్యతరగతి ప్రజలే. ప్రస్తుతం 150 యూనిట్ల కరెంట్ వాడకానికి రూ. 679 బిల్లు వస్తుండగా.. చార్జీల పెంపు అమలులోకి వస్తే రూ. 754 వరకు బిల్లు రానుంది.
కమర్షియల్, ఇండస్ట్రియల్‌కు రూ.1పెంపు
కమర్షియల్, ఇండస్ట్రియల్ కనెక్షన్లకు యూనిట్‌పై ఒక్క రూపాయి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. కమర్షియల్ వినియోగదారులు 50 యూనిట్ల వరకు కరెంట్ వాడితే ప్రస్తుతం యూనిట్‌కు రూ. 6 వసూలు చేస్తున్నారు. పెంపు అమలైతే .. యూనిట్‌కు రూ. 7 వసూలు చేయనున్నారు. 0–100 యూనిట్ల వరకు కరెంట్ వాడే కమర్షియల్ కనెక్షన్లకు ప్రస్తుతం యూనిట్‌కు రూ. 7.50 వసూలు చేస్తుండగా.. చార్జీల పెంపుతో అది రూ.8.50కు చేరనుంది. 100–300 యూనిట్ల కరెట్వాడే కమర్షియల్ కనెక్షన్లకు ప్రస్తుతం యూనిట్‌కు రూ. 8.90 ఉండగా.. చార్జీల పెంపు అమలైతే అది రూ.9.90కు చేరుతుంది. 301–500 యూనిట్ల వరకు ప్రస్తుతం యూనిట్‌కు 9.40 వసూలు చేస్తుండగా.. పెంపు అమలులోకి వస్తే 10.40కి చేరనుంది. 500 యూనిట్ల కంటే ఎక్కువ వాడే కమర్షియల్ కేటగిరికీ ప్రస్తుతం యూనిట్‌కు రూ.10 ఉండగా.. పెరిగే ధరతో రూ. 11 కానుంది. ఇండస్ట్రియల్ కేటగిరికి ప్రస్తుతం యూనిట్ రూ. 6.70 ఉండగా.. అది రూ.7.70కి పెరుగనుంది.
40 లక్షల మంది పేదలకూ భారమే
నెలకు 0–50 యూనిట్లలోపు కరెంట్ వాడే పేదలపై కూడా డిస్కంలు కరుణ చూపలేదు. ఈ యూనిట్ల పరిధిలో దాదాపు 40 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. వీరిపై కూడా ఒక్కో యూనిట్‌కు 50 పైసలు పెంచారు. 0–50 యూనిట్లలోపు కరెంట్ వాడే గృహ వినియోగదారులకు చివరిసారిగా ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో 35 పైసలు పెంచగా.. అప్పటి నుంచి యూనిట్‌కు బేసిక్ చార్జీ రూ. 1.45 అమలు చేస్తున్నారు. ఇప్పుడు పెంచే 50 పైసలతో కలిపితే ఇక యూనిట్‌కు బేసిక్ చార్జీ రూ. 1.95 వసూలు చేయనున్నారు. 50 యూనిట్ల కరెంట్ వాడిన కస్టమర్లకు ప్రస్తుతం రూ. 101.80 బిల్లు వస్తుండగా.. చార్జీల పెంపు అమలైతే అదనంగా రూ. 25 పెరిగి రూ. 126.80 బిల్లు వస్తుంది.
ఎప్పటిలెక్కనే ఫ్రీ కరెంట్అమలు
రాష్ట్రంలోని 25.78 లక్షల అగ్రికల్చర్ కనెక్షన్లకు ఫ్రీ కరెంట్, ఎస్సీ, ఎస్టీ వర్గాల గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకం ఎప్పటిలెక్కనే కొనసాగనుంది. నాయిబ్రాహ్మణుల సెలూన్లకు, రజకుల లాండ్రీషాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అమలుకానుంది. పవర్‌లూమ్‌లకు, స్పిన్నింగ్ మిల్స్‌కు, పౌల్ట్రీఫామ్‌లకు ప్రస్తుతం యూనిట్‌కు రూ. 2 చొప్పున చేస్తున్న వసూళ్లలోనూ ఎలాంటి మార్పులు ఉండవు. వీటికి సంబంధించిన సబ్సిడీని ప్రభుత్వం భరించనుంది.
కరెంట్ చార్జీల పెంపు ఇట్లా..!
కేటగిరి కనెక్షన్లు యూనిట్‌కు పెంపు
ఎల్టీ గృహాలు 1.10 కోట్లు 50 పైసలు
ఎల్టీ కమర్షియల్ 13,27,494 రూ. 1
ఎల్టీ ఇండస్ట్రియల్ 66,519 రూ.1
ఎల్టీ కుటీర పర్రిశమలు 10,419 రూ.1
హెచ్‌టీ పరిశ్రమలు 13,717 రూ.1