
- ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో వెలుగులోకి
- ఆగస్టు 30నే జీవో 51 జారీ చేసినట్లు కోర్టుకు చెప్పిన సర్కార్
- ఢిల్లీ లిక్కర్ స్కాం, కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తును
- అడ్డుకోవడానికేనంటున్న ప్రతిపక్షాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం రహస్య ఉత్తర్వులు ఇచ్చింది. రెండు నెలల కిందట్నే జీవో నం.51ని జారీ చేసినప్పటికీ ఇన్నాళ్లూ బయట పెట్టలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో శనివారం ఈ జీవో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు రావడంతోనే ‘సీబీఐ విచారణకు నో’ చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 51ని ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆగస్టు 30న జీవో విడుదలైంది. ఆ మరుసటి రోజే బీహార్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఉసిగొల్పుతున్నదని, ఆ సంస్థలను రాష్ట్రాల్లో అడుగు పెట్టకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ఒక రోజు ముందే తెలంగాణలో సీబీఐ కట్టడికి జీవో ఇచ్చినా.. ఆ విషయాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ ఉత్తర్వులతో.. రాష్ట్రంలో ఏదైనా కేసులో సీబీఐ విచారణ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అయింది.
తప్పుచేసిన వాళ్లు భయపడుతారంటూనే..!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్ సహా టీఆర్‌ఎస్ నేతలు కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాము కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాం కాబట్టే సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను వేటకుక్కల్లా కేంద్రం ఉసిగొల్పుతున్నదంటూ పలుమార్లు వారు ఆరోపించారు. మంత్రి కేటీఆర్.. ‘‘ఈడీ.. మోడీ.. బోడీ మమ్మల్నేమీ చేయలేరు’’ అంటూ అనేక సార్లు వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వాళ్లు మాత్రమే భయపడుతారని, తాము అక్రమాలే చేయలేదని, కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు భయపడాలని ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఆయన ప్రశ్నిస్తున్నారు. కానీ, రాష్ట్రంలో సీబీఐ ఎంటర్ కాకుండా తాము జీవో ఇచ్చినట్టు ఎక్కడ కూడా ఇన్నాళ్లూ ప్రభుత్వ పెద్దలు చెప్పలేదు.
ఆ కేసుల్లో దర్యాప్తు జరగకుండానే..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు కవితపై ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీని ఆప్ సర్కారుతో కలిసి కవితతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉండే వ్యక్తులే రూపొందించారని, ఇందులో వందల కోట్ల ముడుపులు అందుకున్నారని బీజేపీ నేతలు బాహాటంగానే ఆరోపణలు చేశారు. ఈ స్కాం కవిత మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళనతోనే రాష్ట్రంలోకి సీబీఐ అడుగుపెట్టకుండా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అక్రమాలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు దర్యాప్తు సంస్థలకు ఇటీవల పలు కంప్లైంట్లు అందాయి. వాటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు దిగే అవకాశముందని గుర్తించే సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో..!
నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే తాము బద్దలు కొట్టామని టీఆర్‌ఎస్ చెప్పుకుంటున్నది. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అరెస్ట్ చేసిన వాళ్లెవరూ బీజేపీ నాయకులు కాదని, రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదు కాబట్టి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శనివారం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన నోట్‌లో.. రాష్ట్రంలో సీబీఐ.. విచారణకు అనుమతి రద్దు చేస్తూ ఆగస్టు 30నే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉంది. 2018లో చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత మోడీ సర్కారును టార్గెట్ చేస్తూ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ జీవో ఇచ్చారు.
కోర్టుల జోక్యంతో ఎంట్రీ.. అరెస్టులు
సీబీఐ విచారణకు అనుమతి నిరాకరించిన రాష్ట్రాల్లోకి కోర్టుల జోక్యంతో సీబీఐ అధికారులు అడుగు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో దాణా స్కాంలో సీబీఐ విచారణను అడ్డుకునేందుకు బీహార్ ప్రభుత్వం జనరల్ కాన్సెంట్ విత్ డ్రా చేసింది. అయినా సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి విచారణ జరిపి లాలూ ప్రసాద్యాదవ్ను జైలుకు పంపింది. హిమాచల్ ప్రదేశ్ లోనూ ఇట్లనే అనుమతిని అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తే... సుప్రీంకోర్టు అనుమతితో సీబీఐ
ఆ రాష్ట్రంలోకి వెళ్లింది.
స్టేట్ జనరల్ కాన్సెంట్ ఎందుకు?
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సీబీఐని ఏర్పాటు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ తప్ప మిగతా ఏ రాష్ట్రంలో దర్యాప్తు చేయాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం జనరల్ కాన్సెంట్ తప్పనిసరి. ఈమేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్ కాన్సెంట్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం 2016 సెప్టెంబర్ 23న సీబీఐ దర్యాప్తుకు జనరల్ కాన్సెంట్ ఇస్తూ జీవో నం.160ని జారీ చేసింది. రెండు నెలల కింద (ఆగస్టు 30న) ఇచ్చిన జీవో నం.51లో ఆ కాన్సెంట్‌ను విత్‌డ్రా చేసుకున్నట్టుగా పేర్కొంది. దీంతో అవినీతి నిరోధక చట్టం - 1988 సహా అనేక కేంద్ర చట్టాల ప్రకారం సీబీఐ తెలంగాణలో విచారణ జరిపేందుకు అవకాశం లేదు. రాష్ట్రంలో ఏదైనా అవినీతి కేసులో సీబీఐ అAధికారులు విచారణ చేపAతప్పనిసరి. అయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్కు తనిఖీలు, దర్యాప్తు కోసం రాష్ట్ర సర్కారు పర్మిషన్
అవసరం లేదు.
లక్షకు పైగా జీవోలు దాచిపెట్టిన్రు
గడిచిన ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం లక్షకు పైగా జీవోలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదు. జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో సాధారణ జీవోలు తప్ప ప్రభుత్వ కీలక నిర్ణయాలపై ఉత్తర్వులే ఉండటం లేదు. ప్రభుత్వం జారీ చేసే జీవోలు రహస్యం కాదని, అవన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని హైకోర్టు రెండుసార్లు ఆదేశించినా రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదు. దాచిపెట్టిన జీవోల్లో ‘సీబీఐ విచారణకు అనుమతి నిరాకరణ’ లాంటి కీలక నిర్ణయాలు ఎన్ని ఉన్నాయో అర్థం కాని పరిస్థితి.