కేసీఆర్ డబుల్ వంచన..కట్టిందెంత, ఇచ్చిందెంత ? 

కేసీఆర్ డబుల్ వంచన..కట్టిందెంత, ఇచ్చిందెంత ? 

నేను డాక్టర్ గా ఉద్యోగం మొదలు పెట్టిన తరువాత ఒక 4 ఏండ్లు గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేశా. తదుపరి హైదరాబాద్ కు వచ్చే ముందే, అప్పుడు 3 లక్షల ఖర్చుతో, అందులో కొంత బ్యాంకు లోన్ తో ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కున్న. ఇల్లు కొన్న తర్వాతనే  హైదరాబాద్ కు వచ్చాను. అంటే ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది కల. ఆ ఇల్లు తాను పనిచేసే ప్రాంతానికి, తన పిల్లలు చదువుకు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. ఇంకా పేద, దిగువ మధ్య తరగతి వారికీ అయితే ఇది చాలా ముఖ్యం. ఈ సొంతింటి కలను ఆసరాగా చేసుకొని, రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు. ఆ ఆశలను అవకాశంలా చేసుకొని కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ కథ అల్లాడు. ఒక్క సారి కండ్లు మూసుకొని కేసీఆర్ స్క్రిప్ట్ వింటే, ఇంకా సన్నివేశం గుర్తుకు వస్తది. జైలు గది లాంటి ఒక్క రూమ్​లో కుటుంబం ఎట్లా బతుకుతది ? అల్లుడొస్తే ఎక్కడ పడుకుంటడు?  కూతురు స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకుంటది ? అంటూ పిట్ట కథలు చెప్పి 9 ఏండ్లు కేసీఆర్, ఆయన కుటుంబం సర్వ భోగాలు అనుభవించి తెలంగాణాలో ప్రజలను డబుల్ దగా చేశారు. వాస్తవాల్లోకి వెళితే కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే.. సొంత ఇల్లు లేని కుటుంబాలు దాదాపు 23 లక్షలు, ఆ 23 లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్​సినిమా చూపెట్టి రాజకీయ పబ్బం గడిపారు. ఇవాళ కేసీఆర్ కుటుంబం ప్రగతి భవన్, ఇంద్ర భవన్, బినామీ భవన్, ఫామ్ హౌస్​లు ఇలా సకల భోగాల సరస్సులు పన్నీరు స్నానాలు చేస్తున్నారు. కానీ, పేద ప్రజల డబుల్ బెడ్ రూమ్ కల, కల్లలుగా మారింది. 

కట్టిందెంత, ఇచ్చిందెంత ? 

ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కట్టిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు కేవలం 1,00,230 అయి తే, ఇచ్చింది 30,000 దాటలేదు. కట్టిన వాటిలో కూడా నీటి నల్లా లేదు, కిటికీలు లేవు, గృహప్రవేశం కాకుండగానే పగుళ్లు. ఉదాహరణకు కొల్లూరులో ఒక భారీ సముదాయాన్ని నిర్మించి, వచ్చిన వారికెల్లా ఒక తాజ్ మహల్ లాగ ఒక టూరిజం స్పాట్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన, సిటీకి ఎంతో దూరంలో ఉన్న ఆ ఇండ్లలో పేదలు ఉంటే వారు ఎక్కడ పనిచేసుకోవాలె, పిల్లలను ఏ పాఠశాలలో చదివించాలే అనే ఆలోచనే లేదు. ప్రచారం తప్ప, ఫలితం శూన్యం. సొంతింటి కల నిజం చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో లబ్ధిదారుడికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఇస్తారు. అదే కాకుండా 6 నుంచి -8 లక్షల రూపాయల వరకు కేవలం పావలా వడ్డీకి లోన్​ అందజేస్తారు. 

ఉదాహరణకు రాష్ట్ర సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం  ఇచ్చే రూ.1,5 లక్షలు, రాష్ట్ర వాటా ఒక 3 లక్షలు, లబ్ధిదారుడు ఒక లక్ష, పావలా వడ్డీతో 3 నుంచి- 6 లక్షల లోన్లు ఒక సమన్వయం చేస్తే ఒక టర్మ్ లో 5 నుంచి10 లక్షల ఇండ్లు కట్టే అవకాశం ఉండేది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఉంటే సొంత జాగాలో లేదంటే.. ప్రభుత్వ జాగాలో నిర్మాణం చేపడితే.. అద్భుతంగా అందరి సొంతింటి కల నెరవేరేది.  కేంద్ర ప్రభుత్వం ఒక సాచురేషన్ మోడ్ లో ఎన్ని లక్షల ఇండ్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నా, కేసీఆర్ అవి రాకుండా సైంధవ 
పాత్ర పోషిస్తున్నారు.

కారణం ఏంటి?

కేసీఆర్ పేదల ఇండ్లకు కేంద్రం డబ్బులు రాకుండా సైంధవ పాత్ర పోషించడానికి కారణం ప్రధానంగా మోదీ పేరు గానీ, ఫొటో కానీ, కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని గానీ ప్రజలకు తెలియొద్దు. అమ్మ పెట్టదు.. అడుక్కోనీయదు అనే సామెతకు సరిగ్గా సరిపోతది. ఇంకో విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం 2015లోనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.1700 కోట్లు ఇస్తే, ఇప్పటి వరకు దానికి సంబంధించి లబ్ధిదారుల పేర్లు కేంద్ర ప్రభుత్వానికి పంపకుండా రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారు. అదే ఉత్తరప్రదేశ్ లో 40 లక్షల ఇండ్లు, మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్​లో 20 లక్షల ఇండ్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించారు. ఇప్పటి వరకు కట్టిన ఇండ్లను కూడా ఎందుకి ఇవ్వట్లేదు అంటే, లక్షలాది మంది డబుల్ బెడ్ రూమ్ గురించి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వాటిని కొంతమంది లబ్ధిదారులకు ఇస్తే మిగతా వారు వ్యతిరేకం అవుతారు కాబట్టి, ఇంకో కొత్త స్కీం తెచ్చి, మిగతా వారిని మభ్య పెట్టడానికి మరో పాచిక వాడుతున్నారు. అంతిమంగా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. తెలంగాణలో బీజేపీ సర్కారు వస్తేనే.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సహకారంతో ఎన్ని లక్షల మందికైనా సొంత ఇంటి కల నిజం చేసే అవకాశం దక్కుతుంది. అంతిమంగా ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలే.

- డా. బూర నర్సయ్య గౌడ్,
మాజీ ఎంపీ, భువనగిరి