నిండా ముంచిన ఫక్తు రాజకీయం

నిండా ముంచిన ఫక్తు రాజకీయం

ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చిన కేసీఆర్​ పదేండ్ల క్రితమే ఫిరాయింపునకు శ్రీకారం చుట్టాడు! ఇపుడు అదే ఫక్తు పుణ్యమా అని పెట్రేగిపోయిన ఫిరాయింపుల గురించి అంగలార్చే వారు తెలంగాణలో ఎవరూ లేకుండాపోయారు.. ఫిరాయిపులతో బతికిన టీఆర్​ఎస్​.. పదేండ్ల తర్వాత అవే ఫిరాయింపులతో బక్కపలుచన పడుతున్నది. నమ్ముకున్న వాళ్లే పారిపోతారని కలలో కూడా ఆయన ఊహించుండకపోవచ్చు! చెడి బతకాలి తప్ప, బతికి చెడొద్దనే నానుడి అక్షరాల నిజం. ఫక్తును నమ్ముకొని, ప్రజలను దూరం కొట్టి, అవకాశవాదాన్ని పెంచి పోషించిన పాపం ఊరికేపోతుందా? ఉద్యమమే సాధించిన తెలంగాణలో ఫక్తు పార్టీగా మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది?   కేసీఆర్​ నడిపిన తెలంగాణ ఉద్యమ పార్టీ ఉట్టిదే అనుకోవచ్చా? చావునోట్లో తల పెట్టి తెలంగాణను తెచ్చాననే కేసీఆర్​ మాట అబద్ధమే అని తనకు తానే అంగీకరించినట్లా? ఇలాంటి జవాబు లేని ప్రశ్నలు మనకు ఎన్నో ఎదురవుతాయి! 

వచ్చిన తెలంగాణలో రాజకీయాలను కాస్తయినా ఆరోగ్యకరంగా నడిపే అవకాశం ఒక ఉద్యమ పార్టీ అధినేతగా ఆయనకు మాత్రమే  ఉండింది. అయినా, కేసీఆర్​ ఫక్తునే నమ్ముకున్నాడు తప్ప ప్రజలను ఏనాడూ నమ్ముకోలె. అధికారం కావాలా? అధికారంతో పాటు తెలంగాణ కావాలా? అంటే, కేవలం అధికారమే కావాలనుకున్నాడు అనేందుకు ఆయన ఎంచుకున్న ఫక్తు రాజకీయమే  ప్రబల సాక్ష్యం.  

ప్రజలపై విశ్వాసం ఉన్నవారెవరూ పార్టీ పంథాను మార్చుకోలేరు. ప్రజలపై విశ్వాసం లేనపుడే ఫక్తు రాజకీయాన్ని ఆశ్రయిస్తారని చెప్పడానికి.. ఇవాళ ఆరిపోతున్న దీపంలా మారిన బీఆర్​ఎస్​ పరిస్థితిని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఉద్యమ పార్టీకి, ఫక్తు పార్టీకి ఉండే అంతరమేమిటి? సాధించిన రాష్ట్రం పట్ల దాని ఆకాంక్షల పట్ల కట్టుబడి రాజకీయాన్ని నడిపేదే ఉద్యమ పార్టీ అవుతుంది. మాట తప్పడం, మడమ తిప్పడం, కుటుంబ పార్టీగా మార్చుకోవడం, అవినీతి, పెట్టుబడిని  నమ్ముకోవడం ఫక్తు రాజకీయ పార్టీ అవుతుంది. 

ఖరీదైన ఎన్నికలను తెచ్చారు

తెలంగాణ వచ్చేనాటికి నిజంగానే తెలంగాణ రాజ కీయాలు పూర్తిగా పెట్టుబడి వ్యాపారంగా మారి ఉన్నాయా? ఉమ్మడి రాష్ట్రంలో ఖరీదైన ఎన్నికలు చంద్రబాబుతో  మొదలయ్యాయని అందరూ అంటుంటారు. దాంతో ఆంధ్రలో రాజకీయాలు పెట్టుబడి వ్యాపారంగా మారినంతగా.. అప్పట్లో తెలంగాణ రాజకీయాలు పూర్తి పెట్టుబడి వ్యాపారంగా మాత్రం మారలేదనే చెప్పాలి.  ఆంధ్రా రాజకీయాల కంటే.. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడే నాటికి మెరుగైన రాజకీయాలే తెలంగాణలో ఉండినాయి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్​ తన ఫక్తు రాజకీయంతో  చంద్రబాబునే తలదన్నే ఖరీదైన రాజకీయాలను తయారు చేశారు.  ఇవాళ దేశంలో ఖరీదైన ఎన్నికలకు కేరాఫ్​ అడ్రస్​గా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత ఆయన​దే.

బిజినెస్​మేన్లు, రియల్టర్​లు, కాంట్రాక్టర్లు, ఫక్తు పాలనలో ప్రజాప్రతినిధులుగా మారిపోయారు. ఆంధ్రా పెట్టుబడి రాజకీయాలను తలదన్నేలా తెలంగాణ రాజకీయాలను తయారు చేశాడు. తెలంగాణ రాజకీయాలకు అదొక శాశ్వత శాపంగా మారిపోయింది. కేసీఆర్​ మొదలు పెట్టిన ఫక్తు రాజకీయం, వచ్చిన తెలంగాణకు ఒక అంటు రోగంలా మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబుతో పెట్టుబడి రాజకీయాలు పెరిగిన మాట ఎంత నిజమో, అవి జగన్​తో మరింత  బలపడిన మాట ఎంత నిజమో, వచ్చిన తెలంగాణలో  కేసీఆర్​తో పెట్టుబడి రాజకీయాలు రెండింతలు బలపడిన మాట అంతకన్నా ఎక్కువ నిజం.

వ్యాపారంగా రాజకీయం

అధికారం కోల్పోగానే ఉండలేకపోతున్న బీఆర్​ఎస్​ నేతలను చూసి కేసీఆర్​ చింతిస్తున్నడనుకోలేం. ఎందుకంటే, తాను నిర్మించిన ఫక్తు రాజకీయ పరిణామ ఫలితం ఇలాగే ఉంటదని ఆయనకూ తెలుసు కాబట్టి! పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, రియల్టర్లతో ఒక రాజకీయ పార్టీని, ప్రభుత్వాన్ని, దోపిడీని, అవినీతిని సులభంగా నడుపుకోవచ్చనేదే ఫక్తు రాజకీయంలోని సారాంశం. అధికారం ఉన్ననాడు, ఎన్నికల్లో  బీఆర్​ఎస్​ టికెట్లకు మార్కెట్​లో బోలెడు డిమాండ్​. బీఆర్​ఎస్​ టికెట్​ దొరికిందంటే గెలుపుతో సమానం అనే భావన పెట్టుబడిదారుల్లో ఉండేంది. ఒక్కసారి ఓడిపోగానే, అదే పెట్టుబడిదారులు ఇవాళ కేసీఆర్​ మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదని వార్తలు చెపుతున్నాయి. చేసుకున్న వాడికి చేసుకున్నంత !

గుదిబండలైన అభివృద్ధి

కాళేశ్వరం, భద్రాద్రి, యాదాద్రి పవర్​ ప్లాంట్ల వంటి అభివృద్ధి పనులన్నీ గుదిబండలుగా మారాయి.  ఏ ఒక్కటీ ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్న దాఖలాలు లేవు. సరికదా, అవన్నీ మేసే వైట్ఎలిఫెంట్లుగా మారాయి తప్ప, ప్రజల బతుకులకు కామధేనువులు కాలేదు. వాటిని పోషించడం తప్ప, వాటి నుంచి ప్రజలు  ఆశించేదేమీ కనిపించదు. 

అభద్రతా భావం

రాజకీయ అభద్రతా భావంతో కుల రాజకీయాలనూ ప్రోత్సహించారు. ప్రజలు ఉచిత విద్య, వైద్యం కోరుకుంటుంటే, కులాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టి ఓటు బ్యాంకుల కోసం ఆరాటపడ్డారు. ఆడపిల్లల పెళ్లిల్లకు కల్యాణలక్ష్మి పథకం మిచ్చి, ఫీజు రియింబర్స్​మెంట్​లు ఎగ్గొట్టి.. సంక్షేమాన్ని తిరోగమనం పట్టించి  సమాజాన్ని వెనక్కి నడిపించారు.

చివరకు ఫోన్​ ట్యాపింగ్​లతో తన, మన అని తేడాలేకుండా  వందల మందిని ఫక్తు పాలన వెంటాడింది. దేశ భద్రతకు సంబంధించిన ఫోన్​ ట్యాపింగ్​లను సైతం వదలకుండా వాడుకోబడ్డాయంటే,  ఫక్తు శాసనానికి ఎల్లలు కూడా లేకుండా పోయాయంటే అన్ని వ్యవస్థలను చెరబట్టారనడానికి ఇదొక ప్రబల సాక్ష్యం. 

తాను నేర్పిన విద్యయే..

ఫక్తు రాజకీయం కాకుండా, తెలంగాణ ఆకాంక్షల రాజకీయం నడిపి ఉంటే, తెలంగాణ రాజకీయాలు ఇంతగా దిగజారేవి మాత్రం కావు. కొంతైనా పరిపాలనలో పారదర్శకత, ప్రజాసంబంధాలు మెరుగుపడేవి. ఒక నూతన రాజకీయ తరాన్ని తయారు చేసే అవకాశం ఉండేది. నూతన రాజకీయతరం తెలంగాణ భవిష్యత్​ రాజకీయాలకు దిక్సూచిగా మారేది. ఇప్పటిలాగా అంగడి సరుకులతో రాజకీయాలు నడిపే దుస్థితి మాత్రం ఉండేది కాదు. ముందటి నాగలి తప్పుదోవ పడితే వెనుక నాగళ్లు కూడా తప్పుదోవనే పడతాయి. అలాగే, ప్రజల​ ఆకాంక్షల పాలన నడిపి ఉంటే, మిగతా పార్టీలు కూడా అదే తోవలో  అనివార్యంగా నడిచే అవకాశం ఉండేది. వచ్చిన తెలంగాణకు ఫక్తు అనే పునాది రాయివేసి రాజ్యమేలారు.  ఒకప్పుడు అసెంబ్లీలో పార్టీలనే విలీనం చేసుకున్న  కేసీఆర్​ను, ఇవాళ అధికారంలోకి వచ్చిన రేవంత్​ రెడ్డి కూడా అనుసరించే అవకాశాలున్నాయని వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణ రాజకీయాలను అంగట్లో సరుకుగా మార్చిన పాపం  కేసీఆర్​ ఫక్తు రాజకీయానిదే. మొత్తం మీద తన ఫక్తు రాజకీయం ఇవాళ తనకే శాపంగా మారింది.     

విద్య, వైద్యానికి ఎగనామం

తెలంగాణ వచ్చిన నాడు దేశ అక్షరాస్యతలో తెలంగాణది 26వ స్థానం. పదేండ్ల తర్వాత కూడా విద్యలో తెలంగాణ ఇప్పటికీ దాదాపు అదే స్థానంలో ఉన్నదంటే అది ఫక్తు పాలన పుణ్యమే. అలాగే, తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రత ఏమయిందో,  వేల  కోట్ల ఆరోగ్యశ్రీ పథకం బకాయిలే చెపుతున్నాయి.  ప్రజలకు కావలసిన ఉచిత విద్య,  వైద్యాన్ని గాలికొదిలేసి, ఓట్ల సంక్షేమాన్ని నడిపిన ఫక్తు పాలన వల్ల తెలంగాణ సమాజానికి జరిగిన అపార నష్టాన్ని లెక్కించడం సాధ్యం కాదు.           

‘ఫక్తు’ తనకే పాఠమయింది

ఒక లక్ష్యం కోసం పుట్టిన పార్టీ, ఫక్తు రాజకీయం పేర తెలంగాణను ఇంతగా విధ్వంసం చేస్తుందని నిజంగా అప్పట్లో ఎవరూ ఊహించలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఫక్తు పాలన పదేండ్లు యథేచ్ఛగా వికటాట్టహాసం చేసింది. అటు రాజకీయాలను భ్రష్టు పట్టించి, ఇటు అభివృద్ధిని గుదిబండలుగా మార్చి, ప్రజలు కోరుకున్న సంక్షేమాన్ని తొక్కేసి, ఓట్ల సంక్షేమం నడుపుకొని పదేండ్లు వర్ధిల్లిన కేసీఆర్​ ఫక్తు పాలన తెలంగాణను నిండా ముంచింది. తాను నడిపిన ఫక్తు పాలన.. తనకే పాఠం నేర్పనుందని ఆయన కూడా ఎన్నడూ ఊహించి ఉండరేమో!      

- కల్లూరి
శ్రీనివాస్​రెడ్డి,
సీనియర్​ జర్నలిస్ట్