మళ్లా అవకాశమిస్తే తప్పులు సరిదిద్దుకుంటం : మారుతున్న బీఆర్ఎస్ స్వరం

మళ్లా అవకాశమిస్తే తప్పులు సరిదిద్దుకుంటం : మారుతున్న బీఆర్ఎస్ స్వరం
  • ప్రజల్లోని అసంతృప్తిని అంగీకరిస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు
  • కాళేశ్వరం, ధరణి, టీఎస్‌‌పీఎస్సీ, రైతుబంధుపై సర్దిచెప్పే ప్రయత్నం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌‌కు టైమ్ దగ్గర పడే కొద్దీ బీఆర్ఎస్ నేతల స్వరం మారుతున్నది. తమ పాలనలో కొన్ని లోపాలు ఉన్న మాట నిజమేనని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు అంగీకరిస్తున్నారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వివిధ సందర్భాల్లో ఒప్పుకుంటున్నారు. తమ పాలనలోని లోపాలను సరిదిద్దుకుంటామని, మళ్లీ తమనే ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. 

ఉద్యోగాల భర్తీ, పేపర్ల లీకేజీలు, ధరణి పోర్టల్‌‌ సమస్యలు, ప్రజలకు పాలకులు అందుబాటులో లేకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తదితర అంశాల్లో తప్పులను సవరించుకుంటామని అంటున్నారు.

ధరణిని సవరించే మాట

భూ రికార్డుల ప్రక్షాళనకు ధరణి సర్వరోగ నివారిణి అని ఇన్నాళ్లుగా చెప్తూ వచ్చిన సీఎం కేసీఆర్, బీఆర్ఎస్​ ముఖ్య నేతలు.. ఇప్పుడు పోర్టల్‌‌లో లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోపాలను సరిదిద్దుతామని అంటున్నారు. ధరణి స్థానంలో కాంగ్రెస్ తీసుకువస్తామని చెప్తున్న ‘భూమాత’పైనా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. 

పహాణీలో కబ్జాదారు కాలమ్ పెడతారని, పట్వారీల వ్యవస్థను మళ్లీ తీసుకువస్తారని, ధరణిని తీసేస్తే భూములు రైతుల చేజారుతాయని ఆరోపణలు చేస్తున్నారు. ధరణిలో లోపాలు సవరిస్తామని సీఎం కేసీఆర్ తన ప్రతి సభలో ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ధరణి పోర్టల్ తీసేస్తే రైతుబంధు, రైతుబీమా రాదని హెచ్చరిస్తున్నారు.

రైతుబంధుకు సీలింగ్ పెడ్తరట

రైతుబంధు సాయం పంపిణీలో లోపాలను సరిదిద్దుకుంటామని మంత్రి కేటీఆర్ ఇటీవల చెప్పారు. నాలుగైదు ఎకరాలకే ఈ పథకాన్ని పరిమితం చేస్తామని తెలిపారు. 

‘‘మనకు రెండెకరాలు ఉంటే రూ.20 వేల రైతుబంధు వస్తుంది.. పక్కోళ్లకు పదెకరాలుంటే రూ.లక్ష వస్తుంది.. మనకు తక్కువ వస్తుందని కాదు.. పక్కోళ్లకు ఎక్కువ వస్తుందనే అసూయే ఎక్కువ ఉంది.. ఎక్కువ భూమి ఉన్నోళ్లకు డబ్బులు ఇవ్వొద్దనే సూచనను పరిగణనలోకి తీసుకుంటాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సీలింగ్ పెడతాం” అని చెప్పుకొచ్చారు.

కాళేశ్వరం లోపాలు చిన్నవేనంటూ..

కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను మొదట్లో సమర్థించుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవటం, అన్నారం బ్యారేజీలో బుంగలు పడి నీళ్లు లీకైన ఫొటోలు, వీడియోలు బయటపడటంతో కేటీఆర్, హరీశ్‌​రావు నిజాలు ఒప్పుకుంటున్నారు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజీనే కాదంటూ.. మేడిగడ్డలోని లోపాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణ సంస్థనే వాటిని రిపేర్ చేసి ఇస్తుందని, ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం పడదని అంటున్నారు. మరోవైపు దాదాపు 70 ప్రచార సభల్లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కాళేశ్వరం మీద ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.

ఇకపై అందుబాటులో ఉంటాం

ప్రజలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అందుబాటులో ఉండటం లేదన్న వాస్తవాన్ని వాళ్లు ఒప్పుకుంటున్నారు. ప్రజలు సీఎంను కలవాల్సిన అవసరం ఏమిటని ఓవైపు ప్రశ్నిస్తూనే.. ప్రజలను కలవకపోవడం పొరపాటేనని అంగీకరిస్తున్నారు. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉన్నా అక్కడి నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో నాయకులంతా పార్టీని వీడి వెళ్లేందుకు రెడీ కావడంతో.. వారితో కేసీఆర్ ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించారు. ఇకపై నెలలో ఒక రోజు గజ్వేల్​ నాయకులతోనే ఉంటానని తెలిపారు. కేటీఆర్ సైతం సిరిసిల్లలో క్యాడర్‌‌కు దూరమైన విషయం అంగీకరించారు. రెండు రోజుల క్రితం నియోజకవర్గ నాయకులతో ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ.. ఇకపై వారానికి రెండు రోజులు సిరిసిల్లకే టైం ఇస్తానని, అందరినీ కలుస్తానని హామీ ఇచ్చారు.

టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన రూట్

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఆలస్యం, పేపర్ల లీకేజీ నేపథ్యంలో యువతలో కొంత అసంతృప్తి ఉన్న మాట నిజమేనని మంత్రి కేటీఆర్ అంగీకరించారు. ఇటీవల కొందరు నిరుద్యోగులను పిలిపించి ఆయన మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీలతో పాటు బోర్డులో ఉన్న లోపాలను సవరిస్తామని, బోర్డును ప్రక్షాళన చేస్తామని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ నాలుగో తేదీన అశోక్ నగర్‌‌కు వచ్చి నిరుద్యోగులతో సమావేశమవుతానని తెలిపారు. తొమ్మిదిన్నరేండ్ల తమ ప్రభుత్వంలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్ సైట్‌ను ఇటీవల ఆయన ప్రారంభించారు.

టీఎస్‌‌పీఎస్సీ పనితీరును విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్చుతాం. పూర్తి ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారే డిసెంబర్ 4 నాడు నేనే అశోక్​నగర్​కు వచ్చి కూర్చుంటా. మీ ఫీడ్‌‌ బ్యాక్ ఆధారంగానే జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం.  సలహాలు, సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.   - 

ALSO READ : శభాష్.. బర్రెలక్క .. నిరుద్యోగుల గొంతుకగాఅసెంబ్లీ బరిలో శిరీష

ఇటీవల కొందరు నిరుద్యోగులతో కేటీఆర్

గ్రూప్ 1 విషయంలో కొంత పొరపాటు జరిగింది. పేపర్ లీకేజీని ప్రభుత్వమే గుర్తించింది. సీఐడీ ఎంక్వైరీ చేసి, దోషులందరినీ అరెస్టు చేసినం. టీఎస్‌‌పీఎస్సీ ప్రక్షాళన స్టార్ట్ అయింది.. కొంత చేసినం. త్వరలోనే మళ్లీ గ్రూప్ 1 పెడ్తం. అత్యంత పారదర్శకంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పూర్తి చేస్తం. ఒక్క ఖాళీ కూడా లేకుండా నింపే బాధ్యత తీసుకుంటాం. ధరణిలో బాలారిష్టాలు ఉంటే ఉండొచ్చు.     

 - మీడియాతో హరీశ్‌‌రావు