రైతు బంధు, రైతు బీమా ధరణి వల్లే వస్తున్నయ్: కేసీఆర్

రైతు బంధు, రైతు బీమా  ధరణి వల్లే   వస్తున్నయ్: కేసీఆర్
  • రైతు బంధు, రైతు బీమా  ధరణి వల్లే   వస్తున్నయ్
  • ఎక్కడికెళ్లినా జనం జై కొడుతున్నరు: కేసీఆర్
  • మూడేండ్లు కష్టపడి ధరణిని తీసుకొచ్చినం
  • పోర్టల్‌‌ను రద్దు చేస్తామన్నోళ్లను బంగాళాఖాతంలో కలపాలి
  • పాలమూరు పెండింగ్​ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నం
  • గట్టు లిఫ్టు పూర్తయితే గద్వాల వజ్రపు తునక అయితది

గద్వాల, వెలుగు: రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా జనం ధరణికే జై కొడుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ధరణి వల్లే రైతు బంధు, రైతు బీమా వస్తున్నాయి. ధరణి వల్లే వడ్ల పైసలు ఖాతాల్లో పడ్తున్నాయి. అలాంటి దాన్ని రద్దు చేస్తామన్న వాళ్లను బంగాళాఖాతంలో కలపాలి” అని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టరేట్ కాంప్లెక్స్, ఎస్పీ ఆఫీసుకు ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఐజ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. మూడేండ్లు కష్టపడి ధరణి తెచ్చామని, కానీ కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా పోర్టల్ ఉండాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. 

 ‘‘తెలంగాణ వచ్చినంక పాత పాలమూరు జిల్లాను ఐదు జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నం. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నం. 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నం. గట్టు లిఫ్టు ఒక్కటి పూర్తయితే గద్వాల వజ్రపు తునక అయితది’’ అని కేసీఆర్​ అన్నారు. గద్వాలలో ఉన్న నాయకులు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని, వాళ్లు ఏనాడూ ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ‘ఒకప్పుడు గద్వాలలో భయంకరమైన బాధ ఉండేది. మహబూబ్‌‌నగర్‌‌‌‌కు 14 రోజులకోసారి మంచినీళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ రోజూ మంచినీళ్లు వస్తున్నయి. ఇలాంటి స్కీము దేశంలో మరెక్కడా లేదు’’ అని చెప్పారు. గతంలో బతుకుదెరువు కోసం పాలమూరు బిడ్డలు వలసలు వెళ్లేవారని, కానీ  ఇప్పుడు పక్క రాష్ట్రాల వారే ఇక్కడికి వలస వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే కరెంటు రాదని ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందుతున్నదని తెలిపారు.

బీఆర్ఎస్‌‌ను కాపాడుకోవాలె

24 గంటల కరెంటు కావాలన్నా , రైతు బంధు, దళిత బంధు రావాలన్నా బీఆర్ఎస్‌‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్​అన్నారు. అలంపూర్ లో 24 గంటల కరెంట్ ఉంటే పక్కనే ఉన్న కర్నూల్ లో 24 గంటల కరెంట్ లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గద్వాలలో 255 గ్రామపంచాయతీలు, 12 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని,  ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షలు, ప్రతి మండలానికి రూ.15 లక్షలు, గద్వాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మిగిలిన మూడు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున ఫండ్స్​కేటాయిస్తున్నానని సీఎం చెప్పారు. మరోసారి జిల్లాకు వస్తానని, గట్టు ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ పనులను పూర్తి చేసుకుందామన్నారు.

సీఎం సభలో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

బహిరంగ సభ అని ప్రకటించినప్పటికీ సీఎం కేసీఆర్ కేవలం 9 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. 11 నిమిషాల్లోనే సభను క్లోజ్ చేయడం గమనార్హం. ఇక కేసీఆర్ సభలో నాగర్ కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కనిపించారు. ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆయన సభలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.