‘తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో నాకు మాట్లాడే అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి హాజరుకాను’ అని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఇరవై రెండు పేజీల లేఖ రాశారు. తన పదేండ్ల హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలెవరినీ తెలంగాణ ఆవిర్బావ వేడుకల్లో ఆయన మాట్లాడించిన సంప్రదాయం లేదు. తొమ్మిదేండ్లు నిండంగనే పదేండ్ల వేడుకలు నిర్వహించిన కేసీఆర్.. ఆ వేడుకల్లోనూ ప్రతిపక్షాలకు మాట్లాడేంత చోటు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ.. తనకు చోటు లేదని వేడుకలకు దూరంగా ఉండటం ఉద్యమ నేతగా తన స్థాయిని ఆయనే తగ్గించుకున్నట్లయింది. ఇప్పుడు విద్యుత్తు విభాగంలో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్ ను తూలనాడుతూ కేసీఆర్ పన్నెండు పేజీల లేఖ రాశారు.
అసలు ఆ కమిషన్కు అర్హత లేదు.. ఆయనే స్వచ్ఛందంగా విచారణ నుంచి తప్పుకోవాలంటూ రిటైర్డ్ న్యాయమూర్తిని నిందిస్తూ కేసీఆర్ తన ప్రకోపమంతా ప్రదర్శించారు. కానీ.. ఈ రెండు లేఖలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, నాలుగు కోట్ల తెలంగాణ సమాజాన్ని ఒప్పించలేకపోయాయి. పదేండ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ నిజంగానే తప్పు చేయకపోతే.. ఎందుకు తప్పించుకుంటున్నాడనేది సింపుల్ ప్రశ్న. అసెంబ్లీలో అన్ని పార్టీల సమక్షంలో ‘మేం ఏ విచారణకైనా సిద్ధం’ అని కమిషన్ వేయాలని పట్టుబట్టి అంగీకరించిన ప్రధాన ప్రతిపక్షానికి అధినేత కేసీఆర్.. ఆ విషయాన్ని మూడు నెలల్లోనే మరిచిపోయారా? హఠాత్తుగా ఆయన ఎందుకు డొంక తిరుగుడు వాదన ఎత్తుకున్నారు? నిజానికి విద్యుత్తు రంగంలో జరిగిన అవినీతి అవకతవకలన్నీ కేసీఆర్ వైపు వేలెత్తి చూపుతున్నాయి.
ఈ విద్యుత్తు వెలుగు జిలుగులు వెనుక అవినీతి అవకతవకలు జరిగాయా.. లేదా.. అనేది తేల్చేందుకే ప్రభుత్వమే చట్టసభలో అందరి ఆమోదంతో జ్యుడీషియల్ కమిషన్ వేసింది. దీంతో కేసీఆర్కు ఒక మంచి అవకాశం దొరికినట్లయింది. అవసరమైతే బహిరంగ విచారణకు డిమాండ్ చేసి.. అక్కడే తన నిర్ణయాల కుండను బద్దలుకొట్టే అవకాశం ఉంది. తను చేసింది గొప్పలో.. తప్పులో.. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పుకునే ఛాన్స్ కూడా దొరికింది. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ అసలు తప్పు చేయకుంటే.. తను తీసుకున్న నిర్ణయాలన్నీ, అనుసరించిన విధానాలన్నీ నూటికి నూరుపాళ్లు సొక్కమైతే.. అనవసరంగా భుజాలెందుకు తడుముకుంటున్నారు? అనేది ఈ లేఖతో కొత్త అనుమానాలకు తావిచ్చినట్లయింది.
కాలం చెల్లిన టెక్నాలజీ
దేశంలోనే అత్యధిక ఖర్చుతో చేపట్టిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టులో ఉపయోగించిన కాలం చెల్లిన టెక్నాలజీయే ఇప్పుడు వివాదాస్పదమైంది. మణుగూరులో యుద్ధ ప్రాతిపదికన రెండేండ్లకు నిర్మించాలనుకున్న ఈ ప్లాంట్ ఏడేండ్లకు పూర్తయింది. ఈ ప్రాజెక్టులో వినియోగించిన యంత్ర సామగ్రి ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కొనుగోలు చేసినప్పటికీ.. అది కాలం చెల్లినదా.. పది కాలాలకు ఉపయోగపడే టెక్నాలజీనా.. అనే విజ్ఞతను గత ప్రభుత్వం విస్మరించింది. అప్పటికే బీహెచ్ఈఎల్కు ఆర్డర్ పెట్టిన ఇండియా బుల్స్ ప్రైవేటు సంస్థ వదులుకున్న యంత్ర సామాగ్రిని ఈ ప్లాంట్ కు వినియోగించారు. అంటే.. ఒక ప్రైవేటు కంపెనీకి ఉన్న దూరదృష్టి అప్పటి ప్రభుత్వానికి ఎందుకు కొరవడింది..? ఇప్పుడు ఆ భారం తెలంగాణ ప్రజలపై పడిందనేది వాస్తవం కాదా..? రెండేండ్లలోనే అత్యధిక రిపేర్లు వచ్చిన ఏకైక ప్లాంట్ ఇదేనని విద్యుత్ ఇంజినీర్లు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఇది ఎవరి నిర్వాకమో తేలాలి కదా?
పవర్ ప్లాంట్లపై డబుల్ గేమ్
ఎక్కడ బొగ్గు నిల్వలు, నీటి లభ్యత అందుబాటులో ఉంటే, వాటికి సమీపంలోనే విద్యుత్తు ప్లాంట్లు నిర్మించాలనేది ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన సహజ సూత్రం. దీంతో బొగ్గు రవాణా భారం కూడా తగ్గడమే కాకుండా బొగ్గు, విద్యుత్తు పంపిణీ, ఫ్లై యాష్ తో ఉత్పత్తి అయ్యే కాలుష్యం తగ్గిపోతుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో విజయవాడ, రాయలసీమలో థర్మల్ పవర్ స్టేషన్లపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. బొగ్గు, నీటి నిల్వలున్న తెలంగాణలో పెట్టాల్సిన ప్లాంట్లను ఆంధ్రాకు ఎలా తరలిస్తారు? అని కేసీఆర్ ఉద్యమాన్ని రాజేశారు. ఏకంగా కృష్ణా కమిటీకి ఇచ్చిన నివేదికలోనూ మీరు అదే విషయాన్ని ప్రస్తావించిన విషయాన్ని మరిచిపోయారా? ఇప్పుడు ఆ రెండు పవర్ స్టేషన్లను మీ లేఖలో సమర్థించిన తీరు చూసి తెలంగాణ ఉద్యమకారులు ముక్కున వేలేసుకుంటున్నారు.
తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిందే
దామరచర్లలో ప్లాంట్ నిర్మించేందుకు మీరు సమర్థించుకున్న తీరు చూసి నిపుణులు సైతం నివ్వెరపోయేలా ఉంది. దామరచర్లలో యాదాద్రి ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు భవిష్యత్తులో పోర్ట్ల ద్వారా బొగ్గు రవాణా చేసుకోవాల్సి వస్తుందని కావొచ్చు అన్నంత వ్యూహాత్మక ముందుచూపు ఈ లేఖలో గొప్పగా కనిపిస్తోంది. కానీ, భద్రాద్రిలో కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించేటప్పుడు అదే ముందుచూపు ఎటు పోయింది? అయిదేండ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుకు పదేండ్లు ఎందుకు పట్టింది? రూ.25 వేల కోట్ల అంచనా రూ.34 వేల కోట్లకు ఎలా పెరిగింది? ఈ అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కాలేదు. వీటిపై తెలంగాణ సమాజానికి ఇప్పుడు కాకున్నా.. భవిష్యత్తులోనైనా సరే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముమ్మాటికి కేసీఆర్పై ఉంది.
పదేండ్లలో విద్యుత్ రంగం విధ్వంసం
తెలంగాణ విద్యుత్తు రంగం గడిచిన పదేండ్లలో విధ్వంసమైంది. విద్యుత్తు సంస్థల పేరిట దాదాపు రూ. 83 వేల కోట్ల అప్పులు తెచ్చారు. మరో రూ.80 వేల కోట్లు సంస్థలు నష్టపోయాయి. దాదాపు రూ.60 వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇవన్నీ దాచిపెట్టి విద్యుత్తు వ్యవస్థను ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పుకోవటం.. తెలంగాణ ప్రజల కళ్లకు గంతలు కట్టడం కాదా? విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 20 వేల మెగావాట్లకు పెంచినట్లు చెప్పుకోవటం కూడా అతికినట్లు చెప్పిన అబద్ధాల్లో ఇంకొకటి. కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు రంగం, సౌరశక్తితో పెరిగిన సామర్థ్యం తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది తక్కువ. చెప్పుకున్నది ఎక్కువ. 800 మెగావాట్ల కేటీపీఎస్ ఏడో దశ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ హయాంలోనే చేపట్టిన ప్రాజెక్లు బీఆర్ఎస్ పూర్తి చేసింది.
కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ..
సబ్ క్రిటికల్ ప్లాంట్లపై అప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవని చాంతాడంత వివరణతో సమర్థించుకున్నతీరు జుగుప్సాకరం. బీహెచ్ఈఎల్ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించటంలో తప్పేమీ లేదనే మీ వాదన వెనుక రాష్ట్ర ప్రయోజనాలున్నాయా? ఆ పనులు చేపట్టిన సబ్ కాంట్రాక్టర్ల ప్రయోజనాలున్నాయనే ఆరోపణలకు కేసీఆర్ రాసిన లేఖ జవాబు చెప్పలేకపోయింది. చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలు వల్ల ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని ఈ లేఖలో ప్రస్తావించిన తీరు విస్మయం కలిగిస్తోంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్తును 12 ఏండ్ల పాటు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నది మీరే. వెయ్యి మెగావాట్ల విద్యుత్తును తెచ్చుకునేందుకు ఏకంగా రెండు వేల మెగావాట్ల సామర్థ్యముండే లైన్ల కారిడార్ ను ముందుచూపుతో బుక్ చేసింది మీరే. నష్టం లేకపోతే 2022 ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్తును ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? చత్తీస్గఢ్ విద్యుత్తును రూ.3.90కే కొనుగోలు చేసినందుకు సంతోషమే. కానీ.. ఈ విద్యుత్తు రాష్ట్రానికి చేరేసరికి ఇంధన సర్ ఛార్జీలు, వాటర్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇంటర్ రీజనల్ ఛార్జీలు, కారిడార్ వాడినా వాడకున్నా కట్టిన ఛార్జీలన్నీ కలిపి చత్తీస్ గఢ్ విద్యుత్తు ఒక్కో యూనిట్ రూ.10 దాటిపోయిందనేది వాస్తవం కాదా?
న్యాయ వ్యవస్థపై కేసీఆర్ కన్నెర్ర
లేఖలో కేసీఆర్ అడుగడుగునా కమిషన్ను నిందించారు. స్వచ్ఛందంగా కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ రిటైర్డ్ జస్టిస్ నరసింహారెడ్డిని డిమాండ్ చేశారు. ఒక రకంగా న్యాయ వ్యవస్థపై తన దురుసుతనాన్ని ప్రయోగించారు. సీఎం హోదాలో ఉన్నప్పుడే ఏకంగా భారత రాజ్యాంగాన్ని మార్చేయాలని మీడియా సమావేశం పెట్టి డిమాండ్ చేశారు. తనకు అవసరమైన మరో సందర్భంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామాను రక్తి కట్టించేలా ఆడించిన కేసీఆర్.. దేశంలోని హైకోర్టులు, ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ ఆడియో టేపులను, ఫుటేజీలను పంపించి.. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు కేసీఆర్కు గౌరవపూర్వకంగా కనిపించిన న్యాయ వ్యవస్థ ఇప్పుడు కనిపించకపోవచ్చు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వయిరీలు చేయకూడదని, కనీస ఇంగితం కూడా రేవంత్రెడ్డి ప్రభుత్వానికి లేదని కేసీఆర్ తన లేఖలో తప్పుబట్టారు. కానీ.. ప్రభుత్వం ఈ కమిషన్ను నియమించింది ఈఆర్సీల తీర్పులపై కానే కాదనే విషయాన్ని మరిచిపోయారు. అప్పుడు వన్ మ్యాన్ షోగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటులో జరిగిన అవినీతి అవకతవకలపైనే ఈ కమిషన్ నియామకం జరిగిందనేది ప్రజలకు తెలుసు. అందుకే ఈ లేఖలో కేసీఆర్ ఊకదంపుడు దబాయింపులు తప్ప వాస్తవాలు లోపించాయి. ఇందులో ఉటంకించిన అంశాలు కూడా నేతి బీరకాయలో నెయ్యిని వెతుక్కున్నట్లుగానే ఉన్నాయి.
- అవనీంద్ర