
ఆదిలాబాద్ అడవుల నుంచి.. ఖమ్మం గుమ్మం దాకా..! పాలమూరు పల్లెల నుంచి.. మెతుకుసీమ గడపల దాకా..! ఓరుగల్లు కోటల నుంచి.. హైదరాబాద్ గల్లీల దాకా..! ఇందూరు, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి.. ఊరూవాడా.. కలబడి నిలబడితే వచ్చిందీ తెలంగాణ. ఇది పోరాటాల ఖార్ఖానా. ఒక్కరా.. ఇద్దరా.. వందలు వేలమంది చావును ముద్దాడుతూ.. వదిలిన ఊపిరే ఈ తెలంగాణ. ఇది త్యాగాల వీణ!! ‘మా కొలువులు మాగ్గావాలె’ అనే నినాదంతో మొదలైన ఉద్యమం.. ఉవ్వెత్తున ఎగిసింది. స్వరాష్ట్ర కాంక్షను రగిలించింది. ఆరు దశాబ్దాలకుపైగా అలుపెరగని పోరాటాలతో 2014 జూన్ 2న రాష్ట్రం సిద్ధించింది. ఈ పోరు వెనుక ఎన్నో కీలక ఘట్టాలు.. మరెన్నో మైలు రాళ్లు. వాటిని ఒక్కసారి యాదికి తెచ్చుకుందాం...
ఒక్కటిగా కదిలి
- 2009 డిసెంబర్ 24: తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ప్రకటించడంతో తెలంగాణ రగిలిపోయింది. ఐక్యంగా పోరాడేందుకు ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్‌గా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ఏర్పాటు.
- 2010 ఫిబ్రవరి 3: ప్రత్యేక తెలంగాణ అంశంపై ఐదుగురు సభ్యులతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన అప్పటి కేంద్ర ప్రభుత్వం.
- 2010 మే 28: తెలంగాణ ఉద్యమంలో మానుకోట రాళ్లదాడిదీ ప్రత్యేక స్థానం. లోక్‌సభలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్లకార్డును ప్రదర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఓదార్పు యాత్రను మానుకోట నుంచి ప్రారంభించాలని నిర్ణయించడంతో ఉద్యమకారులు ఆగ్రహించారు. మానుకోట రైల్వే స్టేషన్‌ను ముట్టడించారు. ‘జగన్ గో బ్యాక్’ అంటూ నినదించారు.
- 2010 డిసెంబర్ 30: ఆరు ఆప్షన్లతో రిపోర్ట్ ఇచ్చిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ.
- 2011 మార్చి 10: తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్. ఉద్యమకారులు, ప్రజలు, వివిధ పార్టీల నేతలు భారీగా తరలిరావడంతో ఆ మార్చ్ సక్సెస్ఫుల్ అయింది. పోలీసుల నిర్బంధాల మధ్యనే మార్చ్సాగింది. ఎవరూ రాకుండా జిల్లాల్లో పోలీసుల నిర్బంధాలు. మొత్తంగా లక్ష మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకోగా.. ఒక్క హైదరాబాద్‌లోనే 11 వేల మందిని అరెస్ట్ చేశారు.
- 2011 సెప్టెంబర్ 12: కరీంనగర్లో టీఆర్ఎస్ ప్రజా సదస్సు. అందులో టీజేఏసీ, బీజేపీ, న్యూడెమోక్రసీ నాయకులూ పాల్గొన్నారు.
- 2011 సెప్టెంబర్ 13: 42 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మె ప్రారంభమైన రోజు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులందరూ ఇందులో భాగమయ్యారు.
- 2013 జులై 30: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్– అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్, మిత్ర పక్షాల కూటమి) కో ఆర్డినేషన్ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల నిర్ణయం.
- 2013 అక్టోబర్ 3: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం.
- 2013 అక్టోబర్ 25: రాష్ట్ర విభజనను ఆపాలంటూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా నిరసన.
- 2013 డిసెంబర్ 5: ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013కి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి మండలి. బిల్లు ఆమోదానికి ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీకి పంపిన కేంద్రం.
- 2013 డిసెంబర్ 9: అభిప్రాయాలు చెప్పాలంటూ రాష్ట్ర అసెంబ్లీకి ప్రెసిడెంట్ గడువు. జనవరి 23 వరకు గడువు విధింపు.
- 2013 డిసెంబర్ 12: ప్రత్యేక విమానంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్‌కు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు తరలింపు.
- 2013 డిసెంబర్ 16: శాసనసభ, మండలిలో బిల్లును ప్రవేశపెట్టిన నేతలు. సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్య కొట్లాట.
- 2014 జనవరి 27: బిల్లును తిరస్కరించాలంటూ అప్పటి స్పీకర్‌కు నోటీసులిచ్చిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.
- 2014 జనవరి 30: తీవ్ర ఆందోళనల మధ్యే బిల్లును వ్యతిరేకిస్తూ మూజువాణీ (వాయిస్) ఓట్ ద్వారా తీర్మానించిన అసెంబ్లీ. బిల్లును పార్లమెంట్‌కు పంపొద్దని ప్రెసిడెంట్‌కు విజ్ఞప్తి.
- 2014 ఫిబ్రవరి 5: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డి నిరసన.
- 2014 ఫిబ్రవరి 7: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న సీమాంధ్ర నేతల విజ్ఞప్తిని తిరస్కరిస్తూ.. బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపిన కేబినెట్.
- 2014 ఫిబ్రవరి 11: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ.
- 2014 ఫిబ్రవరి 13: తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల మధ్య ఘర్షణల నడుమ లోక్‌సభలో బిల్లు పెట్టిన కేంద్రం. తోటి సభ్యులపై పెప్పర్ స్ప్రేని ప్రయోగించిన అప్పటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. లగడపాటి సహా 16 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్.
- 2014 ఫిబ్రవరి 18: ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పాస్ చేసిన లోక్‌సభ
- 2014 ఫిబ్రవరి 20: రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్.
- 2014 మార్చి 1: తెలంగాణ బిల్లుకు నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపు.
- 2014 ఏప్రిల్ 30: తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణ.
- 2014 మే 16: 63 అసెంబ్లీ స్థానాలు, 11 లోక్‌సభ సీట్లను గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ.
- 2014 జూన్ 2: ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం.