ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాల్జేసిండు : బండి సంజయ్ 

ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాల్జేసిండు : బండి సంజయ్ 

అసెంబ్లీ సమావేశాలు, ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ పోరాటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి.. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు ఒకే చెప్పిందని అన్నారు. కేసీఆర్ సర్కారు ఇప్పటికీ టీచర్లకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. ఉద్యోగులకు బకాయి ఉన్న 3 డీఏలకుగానూ ఒక డీఏ మాత్రమే ఇస్తానని కేసీఆర్ చెబుతున్నారంటూ మండిపడ్డారు. దీనంతటికీ కారణం రాష్ట్రం దివాళ తీయడమేనని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని, ధనిక రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5 లక్షలకు కోట్లపైగా అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. 

ప్రతి కుటుంబంపై రూ.6 లక్షల అప్పు

ప్రతి ఏటా కేవలం మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తోందని, తెలంగాణ రాకముందు అది కేవలం రూ.10వేల కోట్లు మాత్రమేనని బండి చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి సర్కారుకు దాదాపు రూ.50 వేల ఆదాయం సమకూరుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అప్పుల వల్ల ప్రతి కుటుంబంపై రూ.6 లక్షల అప్పు ఉందని ఇప్పుడు వాటిని తీర్చే పరిస్థితి కూడా లేదని వాపోయారు. రాష్ట్రానికి తండ్రి పాత్ర పోషించాల్సిన సీఎం కేసీఆర్ అప్పుల మీద అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, మరోసారి అధికారం ఇస్తే మళ్లీ రూ.5 లక్షల కోట్ల అప్పు చేస్తారని మండిపడ్డారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుపై లక్ష కోట్లు అప్పు చేసిండు. ఇంకా రూ.4 లక్షల కోట్ల అప్పు దేని కోసం చేశారు..?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

ఇండియాను పొగడొద్దు : బండి సంజయ్ 

‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ దేశాన్ని పొగిడినా ఆ దేశం పరిస్థితి చిన్నాభిన్నమవుతోందని బండి సంజయ్ సెటైర్ వేశారు. శ్రీలంక, పాకిస్తాన్ లో ఏ మాత్రం పరిస్థితులు బాగోలేవని, పొరుగుదేశంలో పిండి కోసం ప్రజలు కొట్లాడుకునే పరిస్థితి ఉందన్నారు. అందుకే కేసీఆర్ భారతదేశాన్ని ఎప్పుడు పొగడొద్దని జనం కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు.