రాముడిని మోసగించిన చరిత్ర కేసీఆర్​ది : కేంద్ర మంత్రి బీఎల్​ వర్మ

రాముడిని మోసగించిన చరిత్ర కేసీఆర్​ది : కేంద్ర మంత్రి బీఎల్​ వర్మ
  • కేంద్ర సహాయ మంత్రి బీఎల్​ వర్మ

భద్రాచలం, వెలుగు: రాముడికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి మొండి చెయ్యి చూపించి మోసం చేసిన చరిత్ర సీఎం కేసీఆర్​ది అని కేంద్ర సహాయ మంత్రి బీఎల్​ వర్మ అన్నారు. సోమవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకురాని సీఎం కేసీఆరేనని ఎద్దేవా చేశారు. రామాలయం మాస్టర్​ ప్లాన్​ ఎటు పోయిందని ప్రశ్నించారు. రామాయణం సర్క్యూట్​లో రామాలయం అభివృద్ధికి నిధులు కేటాయిస్తే డీపీఆర్​ కూడా ఇవ్వలేదని విమర్శించారు. దీంతో కేంద్ర ప్రభుత్వమే ప్రసాద్​ పథకంలో రూ.100 కోట్లు కేటాయించిందని, రూ.41 కోట్లు రిలీజ్​ చేసిందని చెప్పారు. కాంగ్రెస్  హయాంలో రూ.11.55 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే 45 కోట్లకు పైగా జన్​ధన్​ ఖాతాలను తెరిచారని గుర్తు చేశారు. కేంద్ర పథకాలు ప్రజలకు అందకుండా తెలంగాణ సర్కారు అడ్డుపడుతుందని విమర్శించారు. రైతులకు వ్యవసాయ బీమా అమలు చేసినా, తెలంగాణ అందుకు ముందుకు రావడం లేదన్నారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ హామీ ఇచ్చి కేసీఆర్​ మాట తప్పారని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్​ సర్కార్​ వస్తేనే మరింత డెవలప్​ అవుతుందని తెలిపారు. అనంతరం సుభాష్​నగర్​ ముంపు కాలనీతో పాటు గోదావరి కరకట్టను పరిశీలించి వరదల సమయంలో జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీజేపీ లీడర్లు కుంజా సత్యవతి, ఎర్రంరాజు బెహరా, ప్రభాకర్​రెడ్డి, రాకేశ్​​పాల్గొన్నారు.

వచ్చేది డబుల్​ఇంజన్​ సర్కరే..

ఇల్లందు: రాష్ట్రంలో వచ్చేది డబుల్​ఇంజన్​ సర్కారేనని కేంద్ర మంత్రి బీఎల్​ వర్మ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్​ ఆసుపత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కై ఆయుస్మాన్​ భారత్​ స్కీమ్​ను ప్రజలకు అందకుండా చేస్తున్నారని విమర్శించారు.  అవినీతి, కుటుంబపాలన నడుస్తుందని దీనిని పక్కకు పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్​ గోపికృష్ణ గౌడ్, జిల్లా ఇన్​చార్జి రాకేశ్​ రెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జి రాజవర్ధన్​రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని పాల్గొన్నారు.