
- ప్రధాని, కేంద్ర మంత్రులను అవమానిస్తరా?: సంజయ్ ఫైర్
- రామప్పకు యునెస్కో గుర్తింపు మోడీ సర్కారు ఘనత కాదా?
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా రెండ్రోజులుగా సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు వల్లిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను అవమానించేలా మాట్లాడుతూ సభా సంప్రదాయాలను మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పద్మశ్రీ అవార్డులు, పర్యాటక రంగం అభివృద్ధి, విమానాశ్రయాల అనుమతి సహా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. పద్మ అవార్డుల్లో పారదర్శక విధానం ఉండటం వల్లే రాష్ట్రం నుంచి పేదలైనా వనజీవి రామయ్య, ఆసుయంత్ర సృష్టికర్త చింతకింద మల్లేశంకు అవార్డులు దక్కాయన్నారు.
ఇదేనా మీ సంస్కారం
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదనడం శుద్ధ అబద్ధమని సంజయ్ అన్నారు. యునెస్కో సభ్య దేశాలు 24 ఉంటే వాటిలో 19 దేశాలను కేంద్ర మంత్రులు జై శంకర్, కిషన్ రెడ్డి ఒప్పించి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చారని, ఈ ఘనత మోడీ ప్రభుత్వానిది కాదా అని నిలదీశారు. అలంపూర్ జోగులాంబ దేవాలయానికి కేంద్రం రూ.60 కోట్లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక తప్పిదాలతో లేటైన విషయం వాస్తవం కాదా అని అడిగారు. అరాచక, నియంత పాలన వల్ల ఫిల్డ్ అసిస్టెంట్లు, విద్యా వలంటీర్లు, స్వచ్ఛ కార్మికులు, స్టాఫ్ నర్సులుసహా దాదాపు 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు.