కేజ్రీవాల్ హామీ.. ప్రజలందరికీ ఉచిత వైద్యం

కేజ్రీవాల్ హామీ.. ప్రజలందరికీ ఉచిత వైద్యం

లుధియానా: పంజాబ్‎లో పాగా వేయడమే లక్ష్యంగా కేజ్రీవాల్ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పంజాబ్ ప్రజలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‎తో అందిస్తామని ప్రకటించిన కేజ్రీవాల్.. తాజాగా నేడు మరో వాగ్దానం చేశారు. పంజాబ్ ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తానని మరో హామీ ఇచ్చారు. ఈ రోజు లుధియానాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘సమయం వచ్చినప్పుడు పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తాం. సిద్ధూ ఆప్‎లో చేరబోతున్నారనే వార్త ప్రస్తుతానికి కల్పితం మాత్రమే. అలాంటిదేమైనా ఉంటే ముందు మీకే చెప్తాం. చరణ్‎జిత్ సింగ్ చన్నీ మమ్మల్ని కాపీ కొడుతున్నారు. నన్ను కాపీ కొట్టడం సులభమే కానీ, నేను చేసిన పనులను అమలు చేయడమే కష్టం. నా సహచర మంత్రిపై ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెండ్ చేయడమే కాదు, కేసును సీబీఐకి అప్పగించా. కానీ, చన్నీ క్యాబినెట్‎లో ఆరోపణలు వచ్చిన వారున్నా.. చర్యలు లేవు. కరోనా టైంలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారో.. అంతమందికి రెండు నెలల్లోనే ఉద్యోగాలు కల్పించాం. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగ భృతి కల్పిస్తామని కెప్టెన్ అమరేందర్ సింగ్ హామీ ఇచ్చి నిలుపుకోలేదు. ప్రస్తుత సీఎం చన్నీ కెప్టెన్ హామీని నెరవేర్చాలి. ఢిల్లీలో అవినీతిని అంతం చేశాం. ఢిల్లీ ప్రభుత్వం ఒక్కరూపాయి అప్పులో లేదు. ఢిల్లీలో అందించినట్లే పంజాబ్ ప్రజలకు కూడా ఉచితంగా వైద్యం అందిస్తాం. ప్రైవేట్ హాస్పిటల్‎లో ఎలాంటి చికిత్సలు అందుతాయో.. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా కూడా అంతే మెరుగైన వైద్యం అందిస్తాం. మందులు, టెస్టులు, ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తాం. 10 వేల ఖరీదైన ఇంజెక్షన్లు కూడా ఢిల్లీలో ఉచితంగానే అందిస్తున్నాం. ఢిల్లీలో ఇచ్చిన మాటను ఆప్ సర్కార్ నెరవేర్చింది. ఇప్పుడు పంజాబ్ ప్రజలకు మాట ఇస్తున్నా. అన్ని రకాల మందులు ప్రజలకు ఉచితంగా అందిస్తాం. ఒకప్పుడు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు చేసేందుకు మెషిన్లు, టెక్నీషియన్లు ఉండేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డు ఇస్తాం. ఢిల్లీలో ఏర్పాటు చేసిన 16 వేల మొహల్లా క్లినిక్ తరహా క్లినిక్‎లను పంజాబ్‎లో కూడా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తూ.. కొత్త ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తాం. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యాక్సిడెంట్ బాధితులకు మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. చిన్న చిన్న నగరాల్లో కూడా ప్రెస్ క్లబ్‎లు ఏర్పాటు చేస్తాం’ అని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

For More News..

చీరలు పంచితే.. కవిత కట్టుకునే క్వాలిటీ చీరలు అడగండి

నెట్​ లేకుండానే యూపీఐ ట్రాన్సాక్షన్లు