గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

TRS ఎమ్మెల్సీ, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు కేంద్రసాహిత్యఅకాడమీ అవార్డు వచ్చింది. ఆయన రాసిన వల్లంకితాళం అనే పుస్తకానికి గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను కవితా విభాగంలో ఆయన అవార్డు అందుకోబోతున్నారు. మొత్తం 20 భాషల్లో అవార్డులు ప్రకటించగా తెలుగు నుంచి గోరటి వెంకన్నకి ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయలు నగదు ఇస్తారు. 
ప్రజాకవి, గాయకుడైన గోరటి వెంకన్న 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. జానపద పాటలతో ప్రజల్ని  ఎంతో ఆకట్టుకునే వెంకన్న.. మా టీవీలో ప్రసారమైన రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. నాగర్ కర్నూల్ జిల్లాలో జన్మించిన వెంకన్న ..పల్లె ప్రజలు, ప్రకృతిపై ఎన్నో పాటలు రాయడమే కాకుండా పాడి, డాన్సులతో ఉర్రూతలూగిస్తాడు. ఆయన రాసిన వీ6 న్యూస్ 2019 బతుకమ్మ పాట ఎంతగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం గోరటి వెంకన్న ఎమ్మెల్సీ (గవర్నర్ కోటా)గా ఉన్న విషయం తెలిసిందే.

తెలుగు భాషకు సంబంధించి సాహిత్య అకాడమీ యువ పురస్కార్-2021 అవార్డు తగుళ్ల గోపాల్ కు దక్కింది. గోపాల్ రచించిన "దండకడియం" కవితాసంపుటికి సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు వచ్చింది. అలాగే.. దేవరాజు మహారాజుకు బాల సాహిత్య పురస్కారం వరించింది. "నేను అంటే ఎవరు" నాటకానికి ఈ అవార్డు వచ్చింది.