శబరిమలకు వెళ్తుండగా యాత్రికుల బస్సు బోల్తా, 44మందికి గాయాలు

శబరిమలకు వెళ్తుండగా యాత్రికుల బస్సు బోల్తా, 44మందికి గాయాలు

యాత్రికులతో కూడిన ఓ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుండి శబరిమల కొండకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 44మంది యాత్రికులకు గాయాలయ్యారు. శబరిమల మార్గంలో కేరళలోని పతనంతిట్టలోని లాహా గ్రామంలో యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడడంతో 44 మంది గాయపడ్డారని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చేర్చినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. 

ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని యాత్రికులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. వైద్యులు, నర్సుల బృందం గాయపడిన వ్యక్తులకు చికిత్స చేస్తోందన్న ఆయన.. వారికి ఇప్పటికే ప్రథమ చికిత్స చేశారని తెలిపారు. 21 మందిని పెరునాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించామని, మరికొందరిని పతనంతిట్ట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందించామని మంత్రి అన్నారు. ఎనిమిదేళ్ల బాలుడితో సహా ముగ్గురిని కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాలకు చికిత్స కోసం రిఫర్ చేసినట్లు జార్జ్ తెలిపారు. వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. అయితే బాలునికి వెన్నెముకకు గాయమైందని, అతనికి శస్త్రచికిత్స అవసరమని, దానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. ఇక బస్సులో ఉన్న ఇతర వ్యక్తులు చికిత్స పొందుతున్నారన్నారు. వారు విజయవాడ నుండి వస్తున్నారని, వారు క్షేమంగా తిరిగి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆరోగ్య మంత్రి హామీ ఇచ్చారు. 

అసలేమైందంటే..

డ్రైవర్ గత 3 రోజులుగా నిద్రపోలేదని, అందువల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు.