
- మెడికల్ చెకప్ కోసం వెళ్లి ఇరుక్కుపోయిన వ్యక్తి
- కేరళ రాజధాని తిరువనంతపురంలో ఘటన
తిరువనంతపురం : అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ వ్యక్తి సుమారు రెండ్రోజుల పాటు లిఫ్ట్లోనే ఇరుక్కుపోయాడు. అతడిని ఎవరు గమనించకపోవడంతో లిఫ్ట్లోనే చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడ్డాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది. ఉల్లూర్ కు చెందిన రవీంద్రన్ నాయర్ అనే రోగి మెడికల్ చెకప్ కోసం శనివారం మధ్యాహ్నం తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ఫస్ట్ ఫ్లోర్ లోని ఓపీకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. అయితే, ఎలివేటర్ లో సమస్య తలెత్తడంతో పైకి వెళ్లడానికి బదులు అది కిందకు పడిపోయింది. లిఫ్ట్ లోని ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేసినా ఎవరు స్పందించలేదు. అలారంను అనేక సార్లు నొక్కినా ప్రయోజనం లేదు. అదే సమయంలో రవీంద్రన్ ఫోన్ కూడా స్విచ్ఛాప్ అయింది. దీంతో తాను ఎవరికీ చెప్పే అవకాశం లేకుండా పోయింది. లోపలి నుంచి సాయం కోసం అరిచినా ఎవరికీ వినిపించలేదు. రోటీన్ వర్క్ లో భాగంగా సోమవారం ఉదయం వచ్చిన లిఫ్ట్ ఆపరేటర్ రవీంద్రన్ ను రక్షించాడు. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. అంతకు ముందే ఆదివారం సాయంత్రం రవీంద్రన్ కనిపించడం లేదని అతడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దర్యాప్తునకు మంత్రి ఆదేశం
కేరళ వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. పూర్తి స్థాయి రిపోర్టును సమర్పించాలని అధికారులను కోరారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు లిఫ్ట్ ఆపరేటర్లతో సహా ఓ డ్యూటీ సర్జెంట్ ను హెల్త్ డిపార్ట్ మెంట్ సస్పెండ్ చేసింది.