ప్రేమ జంటలకు అండగా ప్రభుత్వం వినూత్న నిర్ణయం

ప్రేమ జంటలకు అండగా ప్రభుత్వం వినూత్న నిర్ణయం
  • కులాంతర జంటలకు పెళ్లి తర్వాత ఏడాది పాటు ‘సేఫ్ హోమ్స్’లో సెక్యూరిటీ

నాగరికంగా ఎంతో అభివృద్ధి చెందినా.. మన దేశంలో కులమతాల అడ్డుగోడలు మాత్రం ఇంకా చెరిగిపోలేదు. తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పట్టింపులు అలానే ఉన్నాయి. అంటరానితనం చట్ట ప్రకారం నేరమైనా ఇప్పటికీ చాలా చోట్ల ఈ భావన కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ల విషయంలో పరువు హత్యల దాకా వెళ్తున్నారు పెద్దలు. దాదాపు రెండేళ్ల క్రితం తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కులాంతర ప్రేమ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి తండ్రి దారుణంగా చంపించిన విషయం రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కేరళలోనూ 2018లో కొట్టాయం జిల్లాకు చెందిన 23 ఏళ్ల దళిత యువకుడు అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె బంధువులు దారుణంగా హత్య చేశారు. 2014లో కోజికోడ్ జిల్లాకు చెందిన గౌతమ్ అనే యువకుడు, అన్షిదా అనే యువతిని మతాంతర వివాహం చేసుకున్నందుకు నేటికీ వారి పెద్దల నుంచి చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి. పెళ్లి చేసుకున్న సమయంలో ఇంటి నుంచి పారిపోయిన ఆ జంట ఇంకా తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ దొరికితే చంపేస్తామని, ఆ యువతి చనిపోయిందని చెబుతూ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం ప్రేమ జంటలకు అండగా ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది.

కులాంతర వివాహాలు చేసుకుంటున్న ప్రేమికుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వమే ముందుకొచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాది పాటు ప్రత్యేకమైన షెల్టర్ హోమ్‌లో సెక్యూరిటీ కల్పించబోతోంది. కులమత బేధాలు లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటుున్న యువతకు ఆర్థిక సాయంతో పాటు ఉండానికి నీడ కల్పించేలా ఈ నిర్ణయం తీసుకుంది కేరళ రాష్ట్ర సర్కారు. దీనిని త్వరలోనే అమలు చేయబోతున్నట్లు ఆ రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. దీనికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ‘సేఫ్ హోమ్స్’ పేరుతో వీటిని ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయన్నారు.

అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న ఆగ్రవర్ణాల ప్రేమ జంటలకు రూ.30 వేలు, జంటలో ఏ ఒక్కరు షెడ్యూల్ కులాలవారున్నా రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే ఉపాధి కల్పన కోసం అండగా ఉంటామని తెలిపారు. మతాంతర వివాహాలు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు.