కేరళ కొత్త మంత్రివర్గం ఖరారైంది. 21 మందితో నూతన మంత్రివర్గాన్ని సీఎం పినరయి విజయన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆయన పేర్లను ప్రకటించారు. ఈసారి కేబినెట్‌లో పూర్తిగా కొత్త మంత్రులను తీసుకోవాలని సీపీఎం నాయకత్వం ఉమ్మడిగా నిర్ణయించింది. దీంతో గత ప్రభుత్వంలోని ఒక్కరికీ కూడా ఈసారి కేబినెట్‌లో అవకాశం కల్పించలేదు. అందరినీ కొత్తవారినే తీసుకున్నారు.
కేరళ సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేతగా, సీఎంగా పినరయి విజయన్ నియమితులయ్యారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజను ఈసారి విప్‌గా నియమించనున్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఎంబీ రాజేశ్‌ను నియమించగా.. డిప్యూటీ స్పీకర్ పదవిని సీపీఐకి కేటాయించారు. ఈసారి మంత్రివర్గంలో విజయన్ అల్లుడు మహమ్మద్ రియాస్ కూడా ఉన్నారు. ఇద్దరు మహిళా మంత్రులు డాక్టర్ ఆర్ బిందు, వీణా జార్జి ఉన్నారు. విజయన్ మే 20న కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన విజయన్ ప్రభుత్వం ఈసారి పూర్తిగా కొత్త మంత్రులతో కొలువుదీరనుంది.
