కీలక సమస్యలను మీడియా కవర్ చేయట్లేదు: రాహుల్ గాంధీ

కీలక సమస్యలను మీడియా కవర్ చేయట్లేదు: రాహుల్ గాంధీ

భోపాల్: దేశంలో నిరుద్యోగం, ఇన్‌‌ఫ్లేషన్, అవినీతి పెరిగిపోయాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇవే ఇప్పుడు దేశానికి అతి పెద్ద సవాళ్లని వెల్లడించారు. అయితే, ఈ సమస్యలను మీడియా అస్సలు కవర్ చేయట్లేదని తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం మధ్యప్రదేశ్‌‌లోని శివపురికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.."దేశం ప్రస్తుతం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి అనే మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే, వీటిపై మీడియాలో చర్చ జరగటం లేదు. మీడియా కేవలం చైనా, పాకిస్తాన్, క్రికెట్, బాలీవుడ్ వంటి అంశాలనే ప్రసారం చేస్తున్నది. 

తద్వారా ప్రజల దృష్టిని విజయవంతంగా దారి మళ్లిస్తున్నది. జామ్‌‌నగర్‌‌లో అనంత్ అంబానీ, -రాధిక మర్చంట్‌‌ల పెండ్లి జరుగుతున్నది. అంబానీ ఫ్యామిలీలోని ఆ  పెండ్లిని మీడియా 24 గంటలు ఎందుకు చూపిస్తున్నది? ఎందుకంటే మీడియాను బిలియనీర్లే నియంత్రిస్తున్నారు కాబట్టి. సాధారణ ప్రజలకు సంబంధించిన 75% సమస్యలకు వారి వార్తా కవరేజీలో స్థానం లేదు. మీ దృష్టిని మళ్లించి మీ జేబులోంచి డబ్బు తీసి నేరుగా అదానీజీ జేబుల్లోకి వేస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపుల్లో పేదలకు అన్యాయం జరుగుతున్నది. మేం అధికారంలోకి వచ్చాక కుల గణన నిర్వహించి అన్ని వర్గాలకు న్యాయం చేస్తం" అని రాహుల్ వివరించారు.

15 శాఖల్లో 30% పోస్టులు ఖాళీ..

పార్లమెంటులో  కేంద్ర ప్రభుత్వం సమర్పించిన డేటాను పరిశీలిస్తే.. 78 శాఖల్లో 9,64,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 15 ప్రధాన శాఖల్లో 30 శాతానికి పైగా పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా?’ అని రాహుల్​ గాంధీ ప్రశ్నించారు.

ఉద్యోగ కల్పనకు ప్రణాళిక రెడీ

ఉద్యోగాలు పొందడం దేశంలోని యువత హక్కు. వాటిని భర్తీ చేయడానికి మేం ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్ధం చేశాం.  ఉద్యోగాల కల్పన జరగకుండా మోదీ సర్కార్ మూసిన తలుపులను మేం తెరుస్తం. గతంలో యువత బీహెచ్‌‌ఈఎల్ వంటి ప్రభుత్వ రంగ యూనిట్లలో ఉద్యోగాలు పొందేవారు. అయితే మోదీ ప్రభుత్వం ఈ రంగాలను మూసివేసిందని కాంగ్రెస్ మాజీ చీఫ్​ చెప్పారు.