కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నరు .. కీలక రికార్డులు స్వాధీనం

కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నరు .. కీలక రికార్డులు స్వాధీనం

కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలను తేల్చేందుకు  విజిలెన్స్​  అండ్​  ఎన్​ఫోర్స్​మెంట్​రంగంలోకి దిగింది. హైదరాబాద్​లోని జలసౌధతోపాటు పది చోట్ల మంగళవారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు అధికారులను ప్రశ్నించి వివరాలు రాబట్టింది. జలసౌధలో దాదాపు ఎనిమిది గంటలకుపైగా సోదాలు జరిగాయి. ఈఎన్సీ మురళీధర్​తోపాటు ఇతర సీనియర్​ ఇంజనీర్లను విచారించింది. ప్రాజెక్టు డిజైన్స్, డ్రాయింగ్స్, క్వాలిటీ కంట్రోల్​ రిపోర్టులు, టెండర్​ డాక్యుమెంట్లు, కాస్ట్  ఎస్కలేషన్ ​రిపోర్టులను విజిలెన్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 

12 టీమ్​లతో..

ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్​ అండ్​ఎన్​ఫోర్స్​మెంట్​ఎస్పీ శ్రీనివాస్​రావు నేతృత్వంలో 12 టీమ్​లు తనిఖీల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్​లోని జలసౌధతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఎల్ఎండీ కాలనీ క్యాంప్, రామగుండం, మహదేవపూర్​ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జలసౌధలో మంగళవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. విజిలెన్స్​ అధికారులు జలసౌధకు చేరుకోగానే మొదట సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకొని మధ్యాహ్నం 2 గంటల తర్వాత తిరిగి ఇచ్చేశారు. తనిఖీలు జరుగుతున్న క్యాబిన్ల వద్దకు ఎవరూ వెళ్లకుండా జలసౌధ ప్రధాన గేట్ల వద్ద సిబ్బందిని కాపలాగా ఉంచారు. 


ఎవరు జలసౌధ భవనంలోని పైఅంతస్తుల్లోకి వెళ్లకుండా, కిందికి దిగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సెకండ్​ఫ్లోర్​లోని​ఈఎన్సీ (జనరల్) మురళీధర్​ఆఫీస్​నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్​–1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్​లకు సంబంధించిన అన్ని రికార్డులు సీజ్​చేసి స్వాధీనం చేసుకున్నారు. అదే ఫ్లోర్​లో ఉన్న పీ అండ్​ఎం ఎస్ఈ శ్రీనివాస్​నుంచి పలు రికార్డులు తీసుకున్నారు. ఆయన నుంచి సమాచారం సేకరించారు. అదే ఫ్లోర్​లో ఉన్న హైడ్రాలజీ డిపార్ట్​మెంట్​నుంచి గోదావరిలో ప్రవాహాలు, మేడిగడ్డకు అనుమతులు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఫస్ట్​ఫ్లోర్​లోని కాళేశ్వరం కార్పొరేషన్​ఎండీ, గజ్వేల్​ఈఎన్సీ హరిరాం ఆఫీస్​నుంచి కార్పొరేషన్​ అప్పులు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై ఆయన నుంచి సమాచారం సేకరించారు. 

సీడీవో సీఈ ఆఫీస్​ నుంచి 16 కీలక ఫైళ్లు

జలసౌధ ఆరో అంతస్తులోని సెంట్రల్​డిజైన్స్​ఆర్గనైజేషన్​(సీడీవో) సీఈ ఆఫీస్​నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 16 కీలక ఫైళ్లను విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫైళ్లలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో లోపాలకు సంబంధించిన డిజైన్లు.. కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్​ల ముంపునకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్​ఇతర కీలక డాక్యుమెంట్లు ఉన్నాయి. ఐదో ఫ్లోర్​లోని రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు క్యాంప్​ఆఫీస్​లో తనిఖీలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నాలుగో ఫ్లోర్​లోని ఓ అండ్​ఎం ఈఎన్సీ నాగేందర్​రావు చాంబర్​లో తనిఖీలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్​ల ముంపు గురించిన సమాచారాన్ని ఆయన నుంచి సేకరించారు. 

మురళీధర్​తో ప్రత్యేక సమావేశం

ఈఎన్సీ (జనరల్) మురళీధర్​తో విజిలెన్స్​ఎస్పీ శ్రీనివాస్​రావు ప్రత్యేకంగా సమావేశమై కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్​–1కు సంబంధించిన సమాచారం సేకరించారు. అరగంటకు పైగా ఆయన నుంచి పలు డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన పనులు, అడిషనల్​టీఎంసీకి సంబంధించిన డిజైన్లు, ఆయా పనులు వర్క్​ఏజెన్సీలకు ఎలా కేటాయించారు..? ఎంతమేరకు పనులు పూర్తయ్యాయి..? వర్క్​ఏజెన్సీలకు ఎంత బిల్లులు చెల్లించారు..? అనే వివరాలు రాబట్టారు. సాయంత్రం 5.45 గంటల తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన కీలక రికార్డులన్నీ తీసుకొని విజిలెన్స్​అధికారులు జలసౌధ నుంచి వెళ్లిపోయారు. సుమారు ఎనిమిది గంటలకు పైగా జలసౌధలో విజిలెన్స్​అధికారులు సోదాలు చేశారు. 

మేడిగడ్డ, కన్నెపల్లి, మహదేవ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ఆఫీసుల్లో తనిఖీలు

భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌తో పాటు మహాదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌, రామగుండం, కరీంనగర్​లోని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల్లో విజిలెన్స్​ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. ఉదయం 11.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి వరకూ కొనసాగింది. కాళేశ్వరం పనులు జరిగిన దగ్గరే తనిఖీ చేయడానికి విజిలెన్స్ ఎస్పీ రమేశ్​ ఆధ్వర్యంలో 15 మందికి పైగా ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ విజిలెన్స్‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌అధికారులు మూడు బృందాలుగా మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. కాళేశ్వరంలోని కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్​, అంబట్‌‌‌‌‌‌‌‌పల్లి దగ్గర ఉన్న మేడిగడ్డ  బ్యారేజీ, మహాదేవపూర్ లోని ఇరిగేషన్ డివిజన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల్లో సోదాలు జరిపారు. లోపలికి ఎవరినీ అనుమతించలేదు. లోపలి నుంచి బయటికి ఎవరినీ రానివ్వట్లేదు. లంచ్‌‌‌‌‌‌‌‌ కూడా బయటి నుంచే తెప్పించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌  ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రికార్డులను విజిలెన్స్‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌ అధికారులు  స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కన్నెపల్లి పంపుహౌస్​‌‌‌‌, మేడిగడ్డ బ్యారేజీ ఆఫీస్ ల నుంచి రికార్డులను  రాత్రి 6.30 గంటలకు  రెండు కార్లలో మహాదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. విచారణ  బుధవారం  కూడా  కొనసాగే అవకాశముంది. 

ఇంజనీర్లలో టెన్షన్

కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలను నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం విజిలెన్స్​ఎంక్వైరీకి ఆదేశించడంతో ఇరిగేషన్​ఇంజనీర్లలో టెన్షన్​నెలకొంది. మంగళవారం ఒక్కసారిగా విజిలెన్స్​అధికారులు జలసౌధతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడంతో ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని హైరానా పడుతున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్​ల్లో పని చేసిన ఇంజనీర్లలో ఆందోళన కనిపిస్తున్నది. ప్రాజెక్టుకు క్లియరెన్స్​ఇచ్చిన ఈఎన్సీ (జనరల్)తో పాటు అడ్మినిస్ట్రేటివ్​శాంక్షన్​ఇచ్చిన అప్పటి ప్రిన్సిపల్​సెక్రటరీ, డిజైన్లు క్లియర్​చేసిన సీఈ సీడీవోలోని ఇంజనీర్లు, ఫీల్డ్​ఇంజనీర్లు సహా ఇతర అధికారులు కలుపుకొని మొత్తం 33 మందిపై విచారణ చేపట్టే చాన్స్​ ఉన్నట్లు తెలుస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు పడటం.. కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్​లు మునిగిపోవడానికి డిజైన్ల లోపంతో పాటు ఆపరేషన్​అండ్​మెయింటనెన్స్​ను పూర్తిగా గాలికి వదిలేయడమే కారణమని డిపార్ట్​మెంట్​లో చర్చ జరుగుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం క్రెడిట్​తమదేనని చెప్పుకున్న ఇంజనీర్లే ఇప్పుడు ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైతే లింక్​-1లోని డాక్యుమెంట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని, రానున్న రోజుల్లో మొత్తం ప్రాజెక్టులోని  లోపాలపైనా ప్రభుత్వం విజిలెన్స్​ఎంక్వైరీ చేయించే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. విజిలెన్స్​తనిఖీల నేపథ్యంలో బుధవారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​పై సమీక్ష ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి ఉత్తమ్

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్​విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మేడిగడ్డ నుంచి హైదరాబాద్​వరకు ఉన్న పది ఇరిగేషన్​ఆఫీసుల్లో విజిలెన్స్​అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ కుంగిపోయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్​గా స్పందించిందని, మేడిగడ్డ వద్ద పూర్తి సమాచారంతో అధికారులతో పవర్​పాయింట్​ప్రజెంటేషన్​కూడా ఇప్పించామన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనపై సిట్టింగ్​జడ్జితో జ్యుడీషియల్​ఎంక్వైరీ కోరుతూ హైకోర్టు సీజేకు లేఖ రాయాలని రాష్ట్ర కేబినెట్​ఇప్పటికే తీర్మానించిందని, ఈ మేరకు సీజేకు లేఖ రాశామని ఆయన వెల్లడించారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో వైఫల్యాలపై ప్రభుత్వం చాలా సీరియస్​గా ఉందని, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఎన్టీపీసీలోని మూడు ఆఫీసుల్లో..!

గోదావరిఖని/కరీంనగర్​, వెలుగు:  పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఏరియాలో గల మూడు ఇరిగేషన్​ ఆఫీస్లుల్లో విజిలెన్స్‌‌‌‌ అధికారులు తనిఖీలు చేశారు. అన్నపూర్ణ కాలనీలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌  ఇన్‌‌‌‌‌‌‌‌  చీఫ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌,  క్వాలిటీ కంట్రోల్‌‌‌‌‌‌‌‌, సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఈ  ఆఫీస్‌‌‌‌‌‌‌‌లను ఉదయమే తమ ఆధీనంలోకి తీసుకుని రికార్డులను పరిశీలించారు. విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అడిషనల్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో డీఎస్పీ కమలాకర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, డీఈలు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, బాలకృష్ణతో పాటు  12 మంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ఆఫీసులోనూ విజిలెన్స్ అధికారులు సోదాలు జరిపారు. విజిలెన్స్ ఎస్పీ వెంకటరమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస రావుతో పాటు 12 మంది అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ముందుగా.. ఇటీవల కంప్యూటర్లు చోరీ జరిగిన ఇరిగేషన్ సర్కిల్ - 5 ఆఫీసుకు వెళ్లి చోరీ  వివరాలు ఆరా తీశారు.   

మీడియాపై ఈఎన్సీ మురళీధర్ గరం గరం

జలసౌధలో విజిలెన్స్​ తనిఖీలపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ​ఈఎన్సీ (జనరల్) మురళీధర్​ గరమయ్యారు. ‘‘ఎందుకింత హడావుడి చేస్తున్నరు.. అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు.. నన్ను ఎందుకయ్యా చంపుతారు.. విజిలెన్స్​అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారు.. వాటిని అందజేశాం..” అంటూ ఆయన జలసౌధ నుంచి వెళ్లిపోయారు.