ఇవాళ (సెప్టెంబర్ 04) అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేశ్ దర్శనం..

ఇవాళ (సెప్టెంబర్ 04) అర్ధరాత్రి వరకే  ఖైరతాబాద్ గణేశ్ దర్శనం..
  • రేపటి నుంచి శోభాయాత్ర పనులు షురూ  
  •     నిమజ్జనం పాయింట్​కు చేరుకున్న భారీ క్రెయిన్ 
  •     నేడు మండపం వద్దకు విజయవాడ నుంచి భారీ టస్కర్​
  •     ఇప్పటిదాకా గణపయ్యను దర్శించుకున్న 30 లక్షల మంది భక్తులు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్​బడా గణేశుడి దర్శనానికి వచ్చే భక్తులను  గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకే అనుమతిస్తామని ఉత్సవ సమితి ప్రకటించింది. 6వ  తేదీన శోభాయాత్ర, నిమజ్జనం ఉన్న దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా, బడా గణపతి నిమజ్జనం కోసం శంషాబాద్​నుంచి భారీ క్రేన్​ను తీసుకువచ్చి ఎన్టీఆర్​గార్డెన్​ముందున్న హుస్సేన్​సాగర్​తీరంలో ఉంచారు.  ఈ క్రేన్​సుమారు 200 టన్నులను అలవోకగా లిఫ్ట్​చేయగలదు.  

ఇక శోభాయత్ర కోసం గణపతిని తీసుకువెళ్లే అతి పెద్ద టస్కర్​ను గురువారమే విజయవాడ నుంచి తీసుకురానున్నారు. బడా గణేశ్​పక్కన ఉన్న కన్యాకపరమేశ్వరి, జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీయ స్వామి విగ్రహాల తరలింపు కోసం కూడా హైదరాబాద్ నుంచి మరో టస్కర్ రెడీ చేస్తున్నారు.  

శుక్రవారం షెడ్ కర్రల పనులు

విగ్రహం వద్ద వెల్డింగ్, షెడ్  కర్రల తొలగింపు వంటి ముఖ్యమైన పనులను నిమజ్జనానికి ఒక రోజు ముందైన శుక్రవారమే చేయనున్నారు. బడా గణేశ్ నిమజ్జన ప్రక్రియ కోసం మూడు టన్నుల స్టీల్ ఉపయోగిస్తున్నామని ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు.  

6న ఉదయం 6 గంటలకు ఊరేగింపు 

సెప్టెంబర్ 5న అర్ధరాత్రి 12 గంటల తర్వాత మహా గణపతికి కలశ పూజ నిర్వహించనున్నారు. ఈ పూజ తర్వాత వినాయకుడి విగ్రహాన్ని కదిలించి, నిమజ్జనానికి సిద్ధం చేస్తారు. 6న ఉదయం పూజల అనంతరం విగ్రహం భద్రత బాధ్యతలను పోలీసులకు అప్పగిస్తారు. అదే రోజు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ నుంచి వినాయకుడి శోభాయాత్ర మొదలవుతుంది. ఈ ఏడాది మహా గణేశుడి దర్శనానికి ఇప్పటి వరకు 30 లక్షల మంది వచ్చారని ఉత్సవ కమిటీ తెలిపింది. ఏడు రోజుల హుండీ లెక్కింపు నిర్వహించగా.. రూ.18.70 లక్షలు వచ్చాయి.  బడా గణేశ్​నిమజ్జనానికి పోలీస్ శాఖ తరుఫున అన్ని ఏర్పాట్లు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. నగరవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది పోలీసులను మోహరించామన్నారు.