బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‎పీ చీఫ్ ఖలీదా జియా (80) కన్నుమూశారు. మంగళవారం (డిసెంబర్ 30) తెల్లవారుజూమున ఆమె మరణించినట్లు బీఎన్‎పీ ప్రకటించింది. ఖలీదా జియా గతకొంత  కాలంగా వయోభారం, సిర్రోసిస్, ఆర్థరైటిస్, డయాబెటిస్, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో 2025, నవంబర్ 23న ఆమెను ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.

బంగ్లాదేశ్, యూకే, యూఎస్, చైనా, ఆస్ట్రేలియాకు చెందిన వైద్య నిపుణుల బృందం ఆమెకు చికిత్స అందించారు. 36 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోన్న ఆమె ఆరోగ్యం విషమించడంతో 2025, డిసెంబర్ 29న తుది శ్వాస విడిచారు. బంగ్లాదేశ్ మాజీ రాష్ట్రపతి రెహమాన్ సతీమణి ఖలిదా జియా. ఆమె 1991–96, 20 01–06 మధ్య పదేళ్ల పాటు బంగ్లా ప్రధానిగా పని చేశారు. 

బంగ్లాదేశ్ చరిత్రలో ఖలీదా జియానే మొదటి మహిళా ప్రధానమంత్రి. ప్రస్తుతం తన భర్త స్థాపించిన బంగ్లాదేశ్  నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‎పీ) చైర్ పర్సన్ ఆమె ఉన్నారు. ఖలీదా జియా మరణంపై పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇటీవలే ఆమె కుమారుడు తరీఖ్ రెహమాన్ తల్లిని చూసేందుకు 15 ఏండ్ల తర్వాత బ్రిటన్ నుంచి బంగ్లాదేశ్ తిరిగొచ్చారు. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‎లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో ఖలీదా జియా మరణించడం ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపించనుంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నోబెల్ అవార్డ్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఎన్నికల్లో బీఎన్‎పీ విజయం అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందే ఖలీదా జియా మరణించడం గమనార్హం.