ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రారంభమైన క్రిస్మస్​ సంబురాలు

ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్​సంబురాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చర్చిల్లో క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శనివారం ఖమ్మంలోని కరుణగిరిలో క్రిస్మస్​ సందర్భంగా బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో 1000 మంది పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ మాథ్యూ వరప్రసాద రాజు, ఫాదర్ సుధాకర్, ఫాదర్ విజయ్, సిస్టర్లు పాల్గొన్నారు.  భద్రాద్రి జిల్లాలోని పలు చర్చిల్లో శనివారం అర్ధరాత్రి నుంచే క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ, బూర్గంపహాడ్, చర్ల, అశ్వారావుపేట పట్టణాల్లోని చర్చీలను అలంకరించారు. 

రెజోనెన్స్​ శ్రీనగర్​లో.. 

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలోని శ్రీనగర్​ రెజోనెన్స్​స్కూల్​ లో శనివారం క్రిస్మస్​ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారుల సమక్షంలో కేక్​ కట్ చేసి వేడుకలు చేశారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు కొండా శ్రీధర్​రావు, కృష్ణవేణి, ప్రిన్సిపాల్ ప్రసన్నరావు, సిబ్బంది పాల్గొన్నారు. 

రాష్ట్రపతి టూర్​లో  స్టాఫ్​కు కరోనా టెస్టు తప్పనిసరి:  కలెక్టర్ ​అనుదీప్​


భద్రాచలం, బూర్గంపహాడ్, వెలుగు: ఈనెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటన సందర్భంగా డ్యూటీ చేసే సిబ్బంది తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేస్తూ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ , రామాలయంలో డ్యూటీ చేసే స్టాఫ్​కు కరోనా టెస్టులు చేయించి తక్షణమే సర్టిఫికేట్లు ఆయా శాఖల అధికారులు సమర్పించాలని కలెక్టర్​ శనివారం ఆదేశించారు. రాష్ట్రపతి ప్రత్యేక హెలీకాప్టర్​లో హైదరాబాద్​ నుంచి సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్​కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వస్తారని కలెక్టర్​తెలిపారు. రామాలయంలో ప్రత్యేక పూజలతో పాటు, ప్రసాదు స్కీం పనులకు భూమి పూజ, టూరిజం స్కీంలపై పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​, ఆదివాసీ మహిళలతో భేటీ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పర్యటనలో సుమారు 5వేల మంది స్టాఫ్​ విధుల్లో పాల్గొంటారు.  రామాలయంలో అర్చకులతో పాటు సిబ్బందికి టెస్టులు చేయనున్నారు. రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు పాల్వంచ, దమ్మపేట, దుమ్ముగూడెం, చర్ల మండలాల నుంచి ఆదివాసీ మహిళలు వస్తారు. వారికి కూడా టెస్టులు చేయించేందుకు రెడీ అవుతున్నారు. మావోయిస్టు ప్రభావిత మండలాల నుంచి వచ్చేవారి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేంద్ర హోంశాఖ కేటాయించిన వాహనాల్లోనే వారిని తీసుకురావాలి. తీసుకెళ్లి దించి రావాలి. వారి వద్ద సెల్​ ఫోన్​ వంటి ఇతర వస్తువులేమీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రానికి చెందిన ఆఫీసర్లు, ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉంటే వారు కూడా రాష్ట్రపతి సెక్యూరిటీ అధికారులు పరిశీలించి ఓకే అంటేనే కాన్వాయ్​లోకి అనుమతిస్తున్నారు. భద్రాచలం మన్యంతో పాటు  అటవీ ప్రాంతాలను ఏరియల్​ సర్వే ద్వారా బలగాలు జల్లెడ పడుతున్నాయి. గగనతలంలో శనివారం హెలీకాప్టర్లు చక్కర్లు కొట్టాయి. వాతావరణ పరిస్థితులపై నివేదికలు తయారు చేశారు.  భద్రాచలం, రామాలయం, సారపాక ఐటీసీలోని హెలీప్యాడ్, గెస్ట్​హౌజ్​ను కలెక్టర్​పరిశీలించారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ 28న బ్రిడ్జిపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాకపోకలపై ఆంక్షలు ఉంటాయన్నారు. ఆ రోజు నిర్వహించే యూనివర్శిటీ పరీక్షలకు స్టూడెంట్లను ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి పరీక్షలు రాయించాక తిరిగి వారిని క్షేమంగా తరలించే బాధ్యత తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, డీపీవో లక్ష్మీరమాకాంత్, పీఆర్ ఈఈ మంగ్యా, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేశ్, ఆర్డీవో రత్నకల్యాణి, పాల్వంచ డీఎస్పీ సత్యనారాయణ, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఈవో మహేశ్ పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే కందాళ పరామర్శ 

కూసుమంచి, వెలుగు: కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్​ తాళ్లూరి రవి తండ్రి సత్యం దశదిన కర్మకు శనివారం ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి హాజరయ్యారు.  సత్యం ఫొటో వద్ద నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ  డైరెక్టర్​ ఇంటూరి శేఖర్, బీఆర్ఎస్​ రూరల్​ అధ్యక్షుడు వేణు, వెంకన్న, సర్పంచ్ ​
మోహన్​రావు పాల్గొన్నారు.

ప్రజలను మోసగించేందుకే బీఆర్​ఎస్​ ఏర్పాటు
    బీజేపీ రాష్ట్ర నేత శాంతికుమార్​

ఖమ్మం, వెలుగు: పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించి, మోసగించేందుకే సీఎం కేసీఆర్​ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారని బీజేపీ రాష్ట్ర ట్రెజరర్​ బండారి శాంతికుమార్ అన్నారు. శనివారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు రూ.లక్ష లోపు లోన్లను న్లను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ ​చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు రుద్ర ప్రదీప్, రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు మందా సరస్వతి, జిల్లా అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి, టూ టౌన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు

ఖబరస్తాన్ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కి వినతి

చండ్రుగొండ,వెలుగు: చండ్రుగొండ లోని ఖబరస్తాన్(శ్మశానవాటిక) ను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుకు ముస్లింలు వినతిపత్రం అందజేశారు. శనివారం తాటిసుబ్బన్నగూడెంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆయనను ముస్లింలు కలిశారు. చండ్రుగొండలోని రెండు ఖబరస్తాన్ లలో బోరు వేయించాలని, ప్రహరీ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేను ముస్లింలు సన్మానించారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు షమీ హుస్సేన్, అహ్మద్, భోలే , రహిమాన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సొసైటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, నాగేశ్వరావు పాల్గొన్నారు.

కూర్మావతారంలో రామయ్య

భద్రాచలం, వెలుగు: వైకుంఠ ఏకాదశీ అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గర్భగుడిలో స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉత్సవమూర్తులను కూర్మావతారంలో అలంకరించారు. తర్వాత బేడా మండపంలోకి తీసుకొచ్చి వేదాలు, ఇతిహాసాలు, పురాణం, భద్రాద్రి క్షేత్ర మహత్యం, నాళాయర దివ్యప్రబంధ పారాయణం చేశారు. అక్కడి నుంచి ఊరేగింపుగా స్వామి బయలుదేరి వెళ్లారు. స్వామికి దారిపొడవునా భక్తులు మంగళనీరాజనాలు పలికారు. అధ్యయన వేదిక వద్ద స్వామిని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్​కు చెందిన స్థిత ప్రజ్ఞానంద భగవద్గీత ప్రవచనం చేశారు. జనగామకు చెందిన లక్ష్మీనారాయణ అనే భాగవతార్​ తిరుమంగై ఆళ్వార్​ హరికథా కాలక్షేపం చేశారు. భక్తులు ఆసక్తిగా వాటిని ఆలకించారు. సాయంత్రం కూర్మావతార రామయ్యకు తిరువీధి సేవ జరిగింది. రాజవీధి గుండా తాతగుడి సెంటర్​ వరకు స్వామి వెళ్లి గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్నారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నారు. అంతకు ముందు ఉదయం గర్భగుడిలో స్వామికి సువర్ణ తులసీదళాలతో అర్చన జరిగింది. నేడు(ఆదివారం) శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు వరాహావతారంలో దర్శనం ఇవ్వనున్నారు.