ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

సత్తుపల్లి, వెలుగు: నియోజకవర్గానికి రూ.5.7 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఆదివారం క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్​​ద్వారా నియోజకవర్గంలో 622 మందికి రూ.2.97 కోట్ల చెక్కులు మంజూరయ్యాయని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్  స్కీమ్​ కింద 276 మంది లబ్ధిదారులకు రూ.2.77 కోట్లు అందించినట్లు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేశానని చెప్పారు. మున్సిపల్​ చైర్మన్ కూసంపుడి మహేశ్, వైస్  చైర్మన్  తోట సుజలరాణి, లైబ్రరీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు, పార్టీ మండల అధ్యక్షుడు రఫీ, కార్యదర్శి మల్లూరి అంకమరాజు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, వీరపనేని రాధిక బాబి, చాంద్ పాషా, రఘు, వల్లభనేని పవన్  పాల్గొన్నారు. 
ఆయిల్​పామ్​ మొక్కలు పక్కదారి పడుతున్నాయ్.

వేంసూరు: ఆయిల్​పామ్​ మొక్కలు నర్సరీల నుంచి పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. మండలంలోని కందుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కల్లూరుగూడెంలో ఆయిల్​పామ్​ ఫ్యాక్టరీ ఏర్పాట్లు చేస్తున్నామని, అయితే కొంతమంది ఇక్కడి రైతుల పేరుతో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు మొక్కలను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరావు, టీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, ఏవో రామ్మోహన్, ఎంపీవో రంజిత్, నాయకులు గొర్ల ప్రభాకర్ రెడ్డి, మందపాటి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 

కోర్టులో సిబ్బంది నియామకానికి కృషి

మణుగూరు, వెలుగు: మణుగూరు ఫస్ట్  క్లాస్ జ్యుడీషియల్  మెజిస్ట్రేట్  కోర్టులో పదిరోజుల్లో సిబ్బందిని నియమించేందుకు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ రాధా రాణి తెలిపారు. ఆదివారం మణుగూరు కోర్టును విజిట్ చేసిన ఆమె అడ్మినిస్ట్రేషన్  వింగ్, కోర్టు పరిసరాలను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు, కోర్టులో సమస్యలపై వేర్వేరుగా అప్లికేషన్స్ ఇవ్వాలని బార్ అసోసియేషన్  ప్రతినిధులకు సూచించారు. ఆమె వెంట జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్, మణుగూరు జడ్జి వెంకటేశ్వర్లు, జ్యుడీషియల్ ఆఫీసర్లు  బి రామారావు, దీప, బార్ అసోసియేషన్  ప్రతినిధులు కూర్మ విజయరావు, చిర్రా రవి, రామ్మోహన్ రావు, శైలజ, కందిమల్ల నరసింహారావు, రామకోటయ్య, కవిత, పోషం భాస్కర్, నగేష్, మణుగూరు,అశ్వాపురం సీఐలు ముత్యం రమేశ్, శ్రీనివాస్, ఎస్ఐ రాజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. 

పంట పొలాలను ధ్వంసం చేయొద్దంటున్న రైతులు

ఖమ్మం రూరల్, వెలుగు: కొత్తగా నిర్మిస్తున్న ఖమ్మం–దేవదరపల్లి హైవేలో భూములు కొల్పోతున్న రైతులు తమ పొలాల్లో పంటను ధ్వంసం చేయొద్దని వేడుకుంటున్నారు. పంటలు వేసుకొనే ముందు ఏమీ చెప్పకుండా, పంట చేతికొచ్చే దశలో రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్​ చదును చేస్తాననడంతో ఆందోళన చెందుతున్నారు. ముందస్తు  సమాచారం ఇవ్వకుండా జేసీబీ, డోజర్లతో భూములను చదును చేయడానికి రావడంతో వేలాది రూపాయల పెట్టుబడితో పటు రెక్కల కష్టం పోతుందని వాపోతున్నారు. పంటలు తీయాలని లేకపోతే రెండు, మూడు రోజుల్లో మిషనరీలతో పీకేస్తామని హెచ్చరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములకు ఎకరానికి రూ.24 లక్షలు ఇచ్చారని తెలిపారు. చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తామనడం సరైంది కాదంటున్నారు. తమకు రెండు నెలల గడువు ఇవ్వాలని అంటున్నారు. అధికారులు జోక్యం చేసుకొని పనులు ఆపాలని కోరుతున్నారు.

కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి

మధిర, వెలుగు: కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని జడ్పీ​ చైర్మన్​ లింగాల కమల్​రాజు తెలిపారు. మాటూరుపేట శ్రీ సీతారామాంజనేయ కళా పరిషత్​ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని ఆత్కూరు అబ్బూరి వారి మామిడితోటలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో కళాకారుల వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు కళలు దోహదం చేస్తాయన్నారు. ప్రాచీన కళలను కాపాడేందుకు కృషి చేస్తున్న కళాకారులను అభినందించారు. అనంతరం కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. నిర్వాహకులు గడ్డం సుబ్బారావు, పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్, గడ్డం శ్రీనివాసరావు, బాబ్లా, కురిచేటి సత్యనారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్  రంగిశెట్టి కోటేశ్వరరావు, మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్  చిత్తారు నాగేశ్వరరావు, కోట రాంబాబు పాల్గొన్నారు.

టేబుల్ టెన్నిస్ లో పతకాల పంట

ఖమ్మం టౌన్, వెలుగు: ఈ నెల 25,26 తేదీల్లో మేడ్చల్  డీఎస్ఆర్​ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి అంతర్  పాఠశాలల టేబుల్  టెన్నిస్ పోటీల్లో మామిళ్లగూడెం గవర్నమెంట్ హైస్కూల్  స్టూడెంట్​ గద్దల సిరి, టేకులపల్లి గురుకుల పాఠశాలకు చెందిన మామిడి ధరణి, ఖమ్మం గోర్కీ పబ్లిక్ స్కూల్ కు చెందిన  పిట్టల మోహిత్ కృష్ణ, అశ్విన్, తల్లాడకు చెందిన బాలభారతి విద్యాలయ విద్యార్థులు  కోటగిరి హితేశ్, హరి ప్రతిభ చూపి గోల్డ్​ మెడల్స్​సాధించారు. హార్వెస్ట్  టెండర్  రూట్స్ కు చెందిన పర్శ వనిషిక, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు చెందిన హిమ శ్రినిక బ్రాంజ్​ మెడల్స్​సాధించారు. వీరిని జిల్లా క్రీడల అధికారి పరంధామ రెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్  జిల్లా అధ్యక్షుడు జంగాల సునీల్ కుమార్, ట్రెజరర్​ డాక్టర్ జొన్నలగడ్డ శశికుమార్, గౌరవ అధ్యక్షుడు కూరపాటి ప్రదీప్, ఉపాధ్యక్షుడు డాక్టర్ మాదిరాజు నందన్, కార్యదర్  వీఎస్  మూర్తి అభినందించారు.

పాఠశాలల క్రీడా కార్యదర్శిగా స్టెల్లా

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పాఠశాలల క్రీడా సెక్రటరీగా స్టెల్లాను నియమించినట్టు డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు. కొత్తగూడెంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో ఆదివారం నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఇల్లందులో పని చేస్తున్న టి స్టెల్లాను ఈ పదవికి ఎంపిక చేయగా, ఆమె రెండేండ్ల పాటు క్రీడా కార్యదర్శిగా కొనసాగనున్నారు. అనంతరం నియామకపత్రాన్ని డీఈవో అందజేశారు. డీసీఈబీ సెక్రటరీ ఎస్  మాధవయ్య, సీనియర్​ వ్యాయమ ఉపాధ్యాయులు బి వెంకటేశ్వర్లు, పి నాగేశ్వరరావు, రేవతి, పద్మజ కుమారి, సుకుమారి, పి శ్రీనివాస్, సృజన, ప్రభావతి, రాంబాయి పాల్గొన్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్​ స్థలాలను కబ్జా చేస్తున్రు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలో టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వ, ప్రైవేట్​ భూములను కబ్జా చేస్తున్నారని బీఎస్పీ స్టేట్​ జనరల్​ సెక్రటరీ యెర్రా కామేశ్​ ఆరోపించారు. పట్టణంలోని రామా టాకీస్​ రోడ్​లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తున్న ప్రాంతాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో అక్రమంగా నిర్మిస్తుండగా మున్సిపాలిటీ అధికారులు నిలిపేశారన్నారు. పట్టణంతో పాటు లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాలోత్​ వీరు, సీహెచ్​ నిరంజన్, ఎన్​ రవికుమార్, కె శేషయ్య, ధనుంజయ్​ పాల్గొన్నారు.