ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: కమ్యూనిస్టు లీడర్లు తమ కార్యకర్తలను గందరగోళంలో పడేయొద్దని, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందామని టీఆర్ఎస్ ​జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం పార్టీ జిల్లా ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడారు. కార్యకర్తల వ్యక్తిగత తగాదాలు పార్టీలకు రుద్దడం సరికాదన్నారు. టీఆర్ఎస్​ను బద్నాం చేసేందుకే లిక్కర్​ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు నోటీసులిచ్చారన్నారు. టీఆర్ఎస్​ పార్టీని ఎదుర్కోలేకనే బీజెపీ లీడర్లు గుంట నక్క రాజకీయాలకు తెరలేపారన్నారు. షర్మిల ఎన్నిమాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. మా పార్టీ టిక్కెట్లను నిర్ణయించేది అధినేత కేసీఆరేనని, ఆయన అడుగుజాడల్లో వామపక్షాలతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.  ఖమ్మం రూరల్​ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, ఎంపీపీ ఉమా, జడ్పీటీసీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు

కరకగూడెం, వెలుగు :‘ఆదివాసీ ప్రజలారా మేల్కోండి.. మావోయిస్టు వారోత్సవాలను బహిష్కరించండి’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో మావోయిస్టుల విధానాలను ప్రశ్నిస్తూ  శనివారం వాల్​ పోస్టర్లు  వెలిశాయి. ‘మావోయిస్టులు నరహంతకులు కాదా?  అభివృద్ధిని అడ్డుకోవడం మావోయిజమా..?, తుపాకీ గొట్టం ద్వారా  దశాబ్ధాలుగా సాధించిందేమిటీ? అని నినాదాలతో వెలిసిన పోస్టర్లు స్థానికంగా కలకలం సృష్టించాయి. అమాయక ఆదివాసీ యువతను బలవంతంగా విప్లవోద్యమంలోకి  రావాలని ప్రోత్సహిస్తున్నారని, వారి జీవితాలను  నాశనం చేస్తున్నారని  ప్రశ్నించారు.   

పోడు పట్టాలిప్పించండి సారూ..

ఖమ్మం టౌన్, వెలుగు: ‘మా తాతల తరం నుంచి పోడు కొట్టుకొని సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇవ్వండి సారూ’ అని కొనిజర్ల మండలం అన్నారం గ్రామానికి చెందిన ఎస్టీ  ట్రైబ్స్ శనివారం అధికారులకు మొరపెట్టుకున్నారు.  ఫారెస్ట్​ఆఫీసుకు వచ్చిన వారు  మాట్లాడుతూ..110 మంది పోడు రైతులు3 రోజులుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని  వాపోయారు. సర్వే కోసం అప్లై  చేసుకుంటే కొందరివి చేసి మరికొందరివి పెండింగ్​లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పోడు భూమిలో పంటలు సాగు చేసుకున్నామని, చేతికొచ్చిన పంటలు ఆగమైతున్నాయని వాపోయారు. అధికారులు తమ సమస్యను పరిష్కరించకుండా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇప్పటికైనా స్పందించి  తమకు పోడు పట్టాలిప్పించాలని విజ్ఞప్తి చేశారు.  

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామయ్యకు తిరుమంగై ఆళ్వార్​ తిరు నక్షత్రోత్సవాల్లో భాగంగా శనివారం వేద పండితులు సువర్ణ తులసీ దళాలతో అర్చన చేశారు. ముందుగా గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చారు. అనంతరం సుప్రభాత సేవ, బాలభోగం సేవలు చేసి  మూలవరులను అలంకరించి అర్చన చేశారు. భద్రుడి మండపంలో రామపాదుకలకు అభిషేకం చేశారు.  సాయంత్రం విశేష సేవాకాలం తొళక్కంతో ప్రారంభించారు.5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ పండితులు చెప్పారు.