- నలుగురి మృతిపై వీడని మిస్టరీ
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలో ఓ ఇంట్లో భార్యాభర్తలు, ఒక కూతురు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనలో మరో చిన్నారి కూడా కన్నుమూసింది. ఈ నలుగురి మృతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. తండ్రి కణతాల రాము (32), కుమార్తె దివ్య(5) మృతిచెందినట్లు ఈ నెల 27న వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. భార్య రమ్య(28) ఎలుకల మందు సేవించడంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వాంతులు ఎక్కువ కావడంతో ఆమె కూడా అదే రోజు మృతిచెందింది. మరో కుమార్తె దీక్షిత(3) తలకు తీవ్రమైన గాయంతో ఆస్పత్రిలో చేరింది.
మొదట ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించిన డాక్టర్లు చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ కు తరలించారు. అయితే బుధవారం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆమె కూడా మృతి చెందింది. దీంతో ఒకే కుటుంబంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటన మిస్టరీగా మారింది. ఖమ్మం టూ టౌన్ పోలీసులు మృతుల పోస్టుమార్టం నివేదికలు, కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన కారణాలు తెలియలేదు.
