ఖమ్మం ఆర్డీవో ఆఫీస్‌‌ సామగ్రి జప్తు

ఖమ్మం ఆర్డీవో ఆఫీస్‌‌ సామగ్రి జప్తు

ఖమ్మం టౌన్, వెలుగు : రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన మహిళకు పరిహారం చెల్లించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఖమ్మం ఆర్డీవో ఆఫీస్‌‌ సామగ్రిని జప్తు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం బైపాస్‌‌ నిర్మాణం కోసం 1986లో సూపరనేని స్వర్ణ అనే మహిళకు చెందిన 1740 గజాల స్థలాన్ని ఆఫీసర్లు సేకరించారు. ఈ స్థలానికి గజానికి రూ.400 చొప్పున 2007లో పరిహారం చెల్లించారు. కాగా, పరిహారం తక్కువ మొత్తంలో చెల్లించారని, మార్కెట్‌‌ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతూ బాధితులు స్వర్ణ జిల్లా కోర్టులో పిటిషన్‌‌ వేసింది. 

దీంతో విచారణ జరిపిన కోర్టు గజానికి రూ.2,500 చొప్పున చెల్లించాలని 2021లో తీర్పు ఇవ్వగా.. ప్రభుత్వం అప్పీల్‌‌కు వెళ్లింది. విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ అప్పీల్‌‌ను కొట్టివేస్తూ, బాధితురాలికి గజానికి రూ. 6 వేల చొప్పున పరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. 50 శాతం డబ్బులు చెల్లించాలని ఆదేశించి మూడేండ్లు అయినా ఆఫీసర్లు స్పందించలేదు. దీంతో బాధితురాలు మరోసారి ఎగ్జిక్యూషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేసింది. దీంతో ఖమ్మం ఆర్డీవో ఆఫీస్‌‌ సామగ్రిని జప్తు చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు శుక్రవారం కోర్టు సిబ్బంది ఆర్డీవో ఆఫీస్‌‌కు చేరుకొని కంప్యూటర్లు, ఇతర సామగ్రిని జప్తు చేసి కోర్టుకు తరలించారు.