ఖమ్మం, వెలుగు: స్మార్ట్ కిడ్జ్ స్కూల్ ఆధ్వర్యంలో చెరుకూరి మామిడి తోటలో శనివారం నిర్వహించిన కార్తీక మాస వన సమారాధన అందరిలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపింది. చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రోజంతా పాఠశాల చిన్నారులు వనంలో గడిపి స్నేహ బంధాన్ని చాటారు. జానపద, సాంప్రదాయ, పాశ్చాత్య నృత్యాలతో వన ప్రాంగణ వేదికపై తోటి మిత్రులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా మ్యాజిక్ కళాకారులు నిర్వహించిన మ్యాజిక్ ప్రదర్శన అందరిలో సంభ్రమాశ్చర్యాలను నింపింది. తమ కండ్లముందే పలు రకాల వస్తువులు మాయమై కొత్త వస్తువులు దర్శనం ఇవ్వడం విద్యార్థులను మరింతగా అబ్బురపరిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య, డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
