- మోదీ సర్కార్ చెప్తున్న ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అంతా ఉత్తదే
- ‘బీసీ రిజర్వేషన్ల సాధన పోరుబాట’ ధర్నాకు మద్దతుగా ఖర్గే, రాహుల్ ట్వీట్
న్యూఢిల్లీ, వెలుగు: ‘సబ్ కా సాత్ సబ్‌కా వికాస్’ అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా ఉత్తిదేనని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అణగారిన వర్గాల కోసం తమ పార్టీ పోరాడుతున్నదని తెలిపారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ‘బీసీ రిజర్వేషన్ల సాధన పోరుబాట’ ధర్నాకు మద్దతుగా బుధవారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఈ ధర్నాలో పాల్గొనలేకపోయారని ఏఐసీసీ పార్టీ వర్గాలు తెలిపాయి.
సామాజిక న్యాయం కోసం..: ఖర్గే
‘‘విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల హక్కు కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులను ఆమోదించింది. ఇవి ఇప్పుడు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో నిరసన తెలిపారు. కుల సర్వే అనంతరం సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే చర్య మా ప్రభుత్వం తీసుకుంది” అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అనే మోదీ ప్రభుత్వ నినాదం అంతా ఉత్తిదేనని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే బిల్లులకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఇది సమిష్టి పోరాటం: రాహుల్
‘‘తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేపట్టాయి. విద్య, ఉపాధి, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాలి. కులగణన లెక్కల ఆధారంగా, సామాజిక న్యాయం గురించి రాజ్యాంగ దృక్పథం వైపు ఈ చట్టం ఒక పెద్ద ముందడుగు. మద్దతు ఇచ్చిన ‘ఇండియా’ కూటమి నేతలకు నా కృతజ్ఞతలు’’ అని రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. తెలంగాణ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదని, దేశంలోని అణగారినవర్గాలకు అధికారం, పురోగతిలో వారి హక్కుల భాగస్వామ్యం కోసం ఇది సమిష్టి పోరాటమని తెలిపారు.
