ఆఫీస్ బాయ్ టు క్రియేటివ్ డిజైనర్

ఆఫీస్ బాయ్ టు క్రియేటివ్ డిజైనర్

అద్భుతాలు చేయాలంటే ఉన్నత చదువులు చదవాల్సిన అవసరం  లేదు. పుస్తకాలతో కుస్తీ పట్టి పట్టాలు సాధించాల్సిన అవసరం అంతకంటే లేదు. మనం చేసే అద్భుతాలు మన సామర్థ్యం, పనితనం, నిబద్ధత మీద ఆధార పడతాయి’ అని ఎవరికైనా చెప్తే..  ‘ఈ మాటలు చదవడానికి, ఇతరులను ప్రేరేపించడానికి భలే ఉంటాయి. కానీ.. నిజ జీవితంలో వర్కవుట్​ కావడం కష్టమే’ అని తేలికగా తీసి పారేస్తారు. కానీ.. ఇష్టం అనుకుంటే ఏదీ కష్టం కాదని నిరూపించాడు తమిళనాడుకు చెందిన ఖతీర్​ ఆర్ముగం. ఆఫీస్​బాయ్ నుంచి క్రియేటివ్​ డిజైనర్​గా మారి ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలిచాడు.

పెయింటింగ్లో దిట్ట..

పుస్తకాల సంచి భుజానికి వేసుకొని బడికెళ్లడానికి గడప దాటేలోపే.. ఆర్థిక సమస్యలు పలకరించి ‘మరి నా సంగతేంటి?’ అని గుర్తు చేశాయి. ఎంత ఆలోచించినా.. మరో మార్గం కనిపించలేదు. తొమ్మిదో తరగతిలో భుజానికున్న స్కూల్​ బ్యాగ్​ తీసి పక్కకు పెట్టక తప్పలేదు. కష్టాలు గట్టెక్కాక మళ్లీ ఆ బ్యాగు భుజానికొస్తుందనుకున్నాడు. కానీ.. ఒక్కసారి తీసి పక్కన పెట్టిన బ్యాగు మళ్లీ ఖతీర్​ భుజానికి ఎక్కలేదు. దాని స్థానంలో కష్టాలు, బాధ్యతలు వచ్చి కూర్చున్నాయి. డిగ్రీ చదివిన వాళ్లే.. రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు. అలాంటిది తొమ్మిదో తరగతిని మధ్యలో ఆపేసిన ఖతీర్​లాంటి కుర్రాడికి ఏం పని దొరుకుతుంది? చదువు మానేసేటప్పుడు ‘కనీసం పదో తరగతైనా చదవాలి’ అనుకున్నాడు. కానీ పరిస్థితి సహకరించలేదు.

ఎంత కష్టమైనా సరే..  కనీసం పదో తరగతైనా పూర్తి చేద్దామనుకున్నాడు.  కానీ.. ఏం లాభం..? ఆ తర్వాత ఎలాగూ కాలేజీ చదువులు చదవలేను’ అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. అయితే.. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఖతీర్​ పెయింటింగ్స్​ చాలా బాగా వేసేవాడు. ఆ పెయింటింగ్స్​కి తోటి విద్యార్థులతో పాటు టీచర్లు కూడా ఫ్యాన్స్​ అయిపోయారు. అంత అందంగా పెయింటింగ్స్​ వేస్తాడు ఖతీర్​. స్కూల్​ మానేసిన తర్వాత కూడా ఖతీర్​ పెయింటింగ్స్​ వేయడం మానలేదు. రోజూ ప్రాక్టీస్​ చేసేవాడు. అంతా సాఫీగా ఉందనుకుంటున్నప్పుడు ఖతీర్​ తండ్రి చనిపోయాడు. కూలీ చేసి ఇల్లు నడపాల్సిన పరిస్థితి ఎదురైంది తల్లికి. ఖతీర్​ ఏదో ఒక పనిచేయక తప్పలేదు.

ఛాయ్వాలాగా మొదలుపెట్టాడు..

అమ్మ ఒక్కతే పొద్దుమాపు కష్టపడితేనే పూట గడుస్తున్న పరిస్థితులు ఖతీర్​ను ఆలోచనల్లో పడేశాయి. తిరిగి.. తిరిగి ఒక డిజైనింగ్​ కంపెనీలో ఆఫీస్​బాయ్​గా పని సంపాదించాడు. అక్కడే ఖతీర్​ లైఫ్​ మలుపు తిరిగింది. ఎలాగూ ఖతీర్​కి చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్​ అంటే ఇష్టం. పెయింటింగ్​ వేయడం ఖతీర్​కి బాగా తెలుసు. ఆ డిజైనింగ్​ కంపెనీలో ఉద్యోగులు కంప్యూటర్లో గ్రాఫిక్స్​ డిజైన్​ చేయడం దగ్గరి నుంచి చూసేవాడు. ఆసక్తిగా వాళ్లు ఎలా డిజైన్​ చేస్తున్నారో గమనించేవాడు. ఉత్సాహంగా పని చేస్తూ.. ఆఫీసులో అందరితో కలిసిపోయాడు. మెల్లగా అక్కడ పనిచేసే ఉద్యోగుల దగ్గర గ్రాఫిక్​ డిజైనింగ్ నేర్చుకున్నాడు.

ప్రతిరోజూ ఉదయాన్నే ఆఫీసుకు వచ్చి ఉద్యోగులందరికీ నీళ్లు పెట్టడం, వారికి ఛాయ్​ అందించడం ఖతీర్​ పని. కాస్త విరామం దొరికితే ఎవరో ఒకరి పక్కన కూర్చొని వారు చేసే డిజైన్​​లను గమనిస్తూ, ఏవైనా సందేహాలు వస్తే అడిగేవాడు. వాళ్లు వాడుతున్న టూల్స్​ గమనించేవాడు. టిప్స్​ అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. ఇలా ప్రతిరోజూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ కొన్ని రోజుల తర్వాత మంచి గ్రాఫిక్​ డిజైనర్​ అయ్యాడు. అప్పటి వరకు ఆర్ట్​, పెయింటింగ్​ వేయడం మాత్రమే తెలుసు ఖతీర్​కి. ప్రతిరోజూ కంప్యూటర్​ మీద వాళ్లు చేస్తుంటే చూడడం, నేర్చుకోవడమే కానీ.. పూర్తిస్థాయిలో కంప్యూటర్​లో తను ఇంకా ఏ డిజైన్​ వేయలేదు. మెల్లగా తన క్రియేటివిటీతో గ్రాఫిక్ డిజైన్స్​ చేయడం మొదలుపెట్టాడు.

ఇప్పుడు.. క్రియేటివ్ డిజైనర్!

పొద్దంతా కంపెనీలో ఉద్యోగులకు టీ అందించడం, వారు చేసే డిజైన్లను గమనించడం చేసేవాడు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు తన క్రియేటివిటీతో గ్రాఫిక్స్​ డిజైన్​ చేసేవాడు. ఉదయాన్నే మళ్లీ ఇంటికి వచ్చి పెయింటింగ్​ ప్రాక్టీస్​ చేసేవాడు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు శివరాజ్​ అనే ప్రొఫెషనల్​ ఆర్టిస్ట్​తో ఖతీర్​కి పరిచయమైంది. ఈ పరిచయంతో ఖతీర్​ జీవితం మరోసారి మలుపు తిరిగింది.

ఖతీర్​ తను వేసిన ఆర్ట్స్​ అన్నీ శివరాజ్​కి చూపించాడు​. ఆయన సలహాతో తన  ఆర్ట్​ వర్క్​తో తమిళనాడు స్టేట్​ ఆర్ట్​ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచాడు. మంచి పేరొచ్చింది. ఆ పెయింటింగ్స్​కి మంచి గిరాకీ వచ్చింది. ఖతీర్​ చేసిన వర్క్స్​ అన్నీ తమిళనాడు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. ఖతీర్​ని పిలిపించి..  ‘పాఠశాల, కాలేజీ స్థాయి ప్రభుత్వ పుస్తకాలకు కవర్ డిజైన్​ చేస్తావా’ అని అడిగారు.  సంతోషంగా ‘సరే’ అన్నాడు.

ఏమేం సబ్జెక్టులకు కవర్​ పేజీ చేయాలో లిస్టు రాసుకున్నాడు. రెండురోజులు టైమ్​ తీసుకొని లేటెస్ట్​ డిజైన్స్​తో పుస్తకం చూడగానే ఆకట్టుకునేలా స్కూల్​, కాలేజీ పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే పుస్తకాల కవర్స్​ డిజైన్​ చేశాడు. అవి తీసుకెళ్లి ఉన్నతాధికారులకు చూపించాడు. అప్పటి వరకు మూసధోరణిలో ఉన్న ప్రభుత్వ పుస్తకాల అట్టలకు ఖతీర్​ కొత్తరూపు తెచ్చాడు. ఫస్ట్​లుక్​లోనే ఆకట్టుకునేలా అద్భుతంగా ఉందా వర్క్​. అంతే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళనాడు ప్రభుత్వ పుస్తకాలకు కవర్​ (అట్ట) డిజైన్​ చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పుస్తకాలు వదిలేసిన ఆ చేతులతో ఇప్పుడు ఆ పుస్తకాల కవర్స్​ డిజైన్​ చేస్తున్నాడు.