అవార్డు సినిమా తీసి ఆసుపత్రి పాలైన సినీ నిర్మాత

అవార్డు సినిమా తీసి ఆసుపత్రి పాలైన సినీ నిర్మాత

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం పోరాడి అతిచిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడి పై సినిమా తీసిన నిర్మాత ఆర్థిక భారాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

అసలు విషయం ఏంటంటే.. గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై నిర్మాత విజ‌య్ జాగర్ల‌మూడి తీసిన సినిమా  ఖుదీరామ్ బోస్. 18 ఏళ్ళ వయసులోనే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో స్ఫూర్తి పొంది దేశం కోసం పోరాటం చేసి ప్రాణ త్యాగం చేశారు ఖుదీరామ్ బోస్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 15 ఏళ్ళ వయసులోనే పోరాటం మొదలు పెట్టిన ఖుదీరామ్ బోస్.. బ్రిటిష్ వారిని గడగడలాడించి 1908 ఆగష్టు 11న వీరమరణం పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేశారు విజ‌య్ జాగర్ల‌మూడి.

ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. మణిశర్మ, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ తోట త‌ర‌ణి, స్టంట్ డైరెక్ట‌ర్‌ క‌న‌ల్ క‌న్న‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌ ర‌సూల్ ఎల్లోర్, ఎడిట‌ర్‌ మార్తాండ్ కె.వెంక‌టేష్ వంటి హేమాహెమీలు ఈ సినిమా కోసం పనిచేశారు. అంతేకాదు ఇటీవ‌ల గోవాలో జ‌రిగిన ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఈ చిత్రాన్ని ప్ర‌దర్శించ‌గా మంచి స్పంద‌న వచ్చింది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే అనేక కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

ఖుదిరామ్ బోస్ గురించి ఈ జనరేషన్ కి తెలియకపోవటం, కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న వేల ఇలాంటి బయోపిక్ సినిమాలకు పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి ఆదరణ లేకపోవడంతో సినిమా రిలీజ్ ఆగిపోయి నిర్మాతకు ఈ దుస్థితి ఏర్పడింది.