కిసాన్ సమ్మాన్ నిధి: స్పీడప్ చేసిన కేంద్రం

కిసాన్ సమ్మాన్ నిధి: స్పీడప్ చేసిన కేంద్రం

 ప్రధాన మంత్రి  కిసాన్  సమ్మాన్ నిధి  పథకం  అమలు స్పీడప్  చేసింది కేంద్రం. వచ్చే మార్చి నుంచి  మొదటి  విడతగా  రైతుల  ఖాతాల్లోకి  జమ చేసేందుకు  కసరత్తు చేస్తోంది.  ఇందుకోసం  రాష్ట్రంలో  అమలవుతున్న రైతు బంధు  పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర వ్యవసాయశాఖ అధికారులు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలులో భాగంగా రైతుల వివరాలు సేకరిస్తోంది కేంద్రం. సెక్రటేరియట్ లో సీఎస్ ఎస్ కే జోషి, వ్యవసాయ శాఖ అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధా మిశ్రా. రైతు బంధు పథకం ఎలా అమలు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఉన్నారు? రెండు విడతల్లో రైతులకు ఎంత డబ్బును ఎకౌంట్ లో వేస్తున్నారు. రైతుల ఎకౌంట్ వివరాలను ఎలా సేకరించారు అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు  వసుధా మిశ్రా.

అయితే ప్రధానమంత్రి సమ్మాన్ నిధికి, రైతుబంధు పథకానికి సంబంధం లేదన్నారు వసుధ మిశ్రా. ప్రధానమంత్రి సమ్మాన్ నిధి స్కీమ్ కింద కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంటామని చెప్పారు. రైతుబంధును కేంద్ర పథకంతో కలపాలని కోరలేదన్నారు. మరికొన్ని రాష్ట్రాల్లోకూడా సమాచారం సేకరిస్తామని చెప్పారు.

రైతులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రకటించింది కేంద్రం. ఐదు ఎకరాలలోపు రైతులకు ఏటా ఆరు వేల ఆర్థిక సాయం చేయనుంది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ కానుంది. రెండు వేల చొప్పున మూడు వాయిదాల్లో నగదు చెల్లిస్తారు. 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా మేలు జరగనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 75 వేల కోట్లు, 2018-19 సంవత్సరానికి 20 వేల కోట్లు కేటాయించింది కేంద్రం.