
- రామగుండం ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి
- మీడియాతో చిట్‌చాట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతు అడగలే
- యూరియా కేటీఆర్ ఫామ్‌హౌస్‌లో తయారుచేసేది కాదు
- మునుగోడు బైపోల్ కోసమే ఫామ్‌హౌస్ కేసును కేసీఆర్ క్రియేట్ చేసిండు
- ‘ఓట్ల చోరీ’ అంటూ రాహుల్‌ది పసలేని వాదన.. బిహార్‌లో తామే గెలుస్తమని ధీమా
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో యూరియాను ఇల్లీగల్‌గా అమ్ముతున్నారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రామగుండం ఫ్యాక్టరీ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయిందని, నిపుణులు సరి చేసే పనిలో నిమగ్నమయ్యారని, త్వరలో అక్కడ ఉత్పత్తి స్టార్ట్ అవుతుందని తెలిపారు.
యూరియా ఇచ్చిన వారికే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. స్టేట్‌లో ఎవరున్నా యూరియా కేంద్రమే ఇస్తుందని, అది కేటీఆర్ ఫామ్‌హౌస్‌లో తయారు చేసేదికాదని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో కిషన్‌రెడ్డి చిట్ చాట్ చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అడిగిన 50 వేల టన్నుల యూరియా గురించి తాను వెంటనే జేపీ నడ్డాతో మాట్లాడానని తెలిపారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత యూరియాను సమకూరుస్తామని నడ్డా హామీ ఇచ్చారు” అని చెప్పారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే యూరియా కొరత ఎందుకు వచ్చింది? రాష్ట్ర మంత్రులు యూరియా కొరత ఉందని పదే పదే చెప్పడం వల్ల పెద్ద రైతులు కొనుగోలు చేసి పెట్టుకున్నారు” అని అన్నారు.
మునుగోడు ఎన్నికతోనే ఫామ్‌హౌస్ కేసు ముగిసింది
మునుగోడు ఎన్నికలతోనే ఫామ్‌హౌస్ కేసు ముగిసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అప్పట్లో ఎన్నికల కోసమే కేసీఆర్ దాన్ని క్రియేట్ చేశారని ఆయన ఆరోపించా రు. కేసీఆర్ ఆ వీడియోలను జడ్జిలకూ పంపించార ని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకే విధంగా ఉన్నా యని.. దొందూ దొందేనని విమర్శించారు. బిహార్‌లో ఎన్డీయే కూటమికి అనుకూలమైన వాతావరణం ఉం దని, గత ఎన్నికల కన్నా ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘బిహార్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ నాయకులకే అర్థం కావడం లేదు.
వారికి అక్కడ ఎలాంటి ఎజెండా లేదు. రాహుల్ చెప్పే ‘ఓట్ల చోరీ’ అనేది పసలేని వాదన. నిజానికి ఓట్లు లేకపోవడం, డబుల్ ఓట్లు ఉండడం అన్ని చోట్లా ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఒక్కరి ఓటు నాలుగైదు బూతుల్లో ఉంటాయి. నాకు గతంలో సిటీలో, ఊరిలో ఓటు ఉండేది. ఆ తర్వాత ఊరిలో తీసివేయించిన. ఈ పరిస్థితి దేశమంతా ఉన్నప్పటికీ.. రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
రిజర్వేషన్లు ఒక ఇష్యూ కావచ్చని, కానీ ఓటు చోరీ ఇష్యూ కాదని చెప్పారు. మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా తీవ్ర నేరారోపణలతో నెలరోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోయేలా కొత్త చట్టం తెస్తే కాంగ్రెస్‌కు భయం ఎందుకని, అవినీతిపరులు మాత్రమే భయపడతారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలు తుమ్మితే ఊడిపోతాయని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ ఆ పార్టీ తుక్కు తుక్కు ఓడిపోతుందని అన్నారు.
దేశానికి తొలిసారి ఉప రాష్ట్రపతిగా బీసీ
ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్‌ఎస్ మద్దతును తాము అడగలేదని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కిష న్ రెడ్డి అన్నారు. అయితే, వైసీపీ మాత్రం స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుందని చెప్పారు. ఈసారి దేశంలో తొలి బీసీ ఉప రాష్ట్రపతి రానున్నారని తెలిపారు. బీజేపీలో చేరికలు కొనసాగుతున్నాయని, కేవలం రాజకీయ నాయకులే కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా చాలా మంది పార్టీలో చేరుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
బీజేపీలో ఎవరైనా చేరాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనన్నారు. రాజకీయాల్లో శత్రువులు ఉండరని, ప్రత్యర్థులే ఉంటారని ఆయన అన్నారు. ‘‘రేవంత్ రెడ్డి నన్ను సైంధవుడు అనడం ఏమిటి? బట్టలు విప్పుతా, లాగులో తొండలు వదులుతా అనడం సరైన భాష కాదు. మాకు పాకిస్తాన్ మాత్రమే శత్రువు” అని పేర్కొన్నారు. తాను ఆర్‌ఎస్‌ఎస్ స్క్రిప్ట్ చదువుతానని విమర్శించే వాళ్లకు.. తాను ఆర్‌ఎస్‌ఎస్ స్క్రిప్టే చదువుతానని, తన సిద్ధాంతం అదేనని కిషన్‌రెడ్డి చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి చాలామంది అభ్యర్థులు ఉన్నారన్నారు.
మెట్రో కొత్త లైన్లకు ప్రస్తుత కంపెనీలు ముందుకు రావడంలే
హైదరాబాద్ మెట్రో రైలు కొత్త లైన్లను నిర్మించేందుకు ప్రస్తుతం ఉన్న కంపెనీలు ముందుకు రావడం లేదని, ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఫస్ట్ ఫేజ్ కూడా ఇంకా పూర్తి కాలేదని, ఈ అంశాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. మెట్రోకు కేంద్రం వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అధికార దుర్వినియోగం, నష్టం జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు.
ఎన్‌డీఎస్ఏ కేవలం నిర్మాణ లోపాలపై నివేదిక ఇచ్చిందని, సీబీఐ దర్యాప్తుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ‘‘ఎవరిపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అనడం కాంగ్రెస్ వైఖరి మార్చుకున్నట్లుగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. పదకొండేండ్లలో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందనే దానిపై త్వరలో నివేదిక ఇస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.