కిచెన్ తెలంగాణ : మ్యాంగో ట్రీట్​

కిచెన్ తెలంగాణ : మ్యాంగో ట్రీట్​

పచ్చి మామిడి అనగానే  పచ్చడి, పులిహోర వగైరా గుర్తుకొస్తాయి. వీటితోపాటు పచ్చిమామిడితో పుల్ల ఐస్​, కారం కారంగా... పుల్ల పుల్లగా... ఉండే పచ్చి రొయ్యల కూర, నోరూరించే జీడిపప్పు–మామిడి, పనీర్– మ్యాంగో స్పైసీ కర్రీ వండేయొచ్చు. అంతేకాదు ఏడాదంతా నిల్వ ఉండే పచ్చిమామిడి వడియాలు కూడా పెట్టుకోవచ్చు. పుల్లటి, కమ్మటి ఈ వంటల్ని ఈ సమ్మర్​ అయిపోయేలోపు ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.

జీడిపప్పు-మామిడి కూర


కావాల్సినవి :


పచ్చి మామిడి కాయలు – మూడు
జీడిపప్పులు – ఒక కప్పు
నీళ్లు – ఒక లీటర్
నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
ఉల్లిగడ్డ తరుగు – రెండు కప్పులు
పచ్చిమిర్చి –  ఆరు, కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – సరిపడా, పసుపు – ముప్పావు టీస్పూన్, కారం – మూడు టీస్పూన్లు
గరం మసాలా – అర టీస్పూన్

తయారీ : ఒక పాన్​లో నీళ్లు పోసి, జీడిపప్పు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. అదే పాన్​లో నూనె వేడి చేసి, కరివేపాకు, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. అందులోనే పచ్చిమామిడి తరుగు కూడా వేసి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలిపి, ఉడికించిన జీడిపప్పులు కూడా వేసి మళ్లీ ఒకసారి కలపాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి, మూతపెట్టి ఉడికించి, కొత్తిమీర చల్లి, మూత పెట్టి మరికాసేపు ఉడికిస్తే జీడిపప్పు, పచ్చిమామిడి కూర రెడీ.

వడియాలు

కావాల్సినవి :

పచ్చి లేదా దోర మామిడికాయలు – నాలుగు
కారం – ఒక టేబుల్ స్పూన్
ఉప్పు, బెల్లం లేదా పంచదార, వేగించిన జీలకర్ర పొడి – ఒక్కో టీస్పూన్ చొప్పున
మిరియాల పొడి – అర టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
తయారీ : మామిడికాయల్ని తురిమి, అందులో ఉప్పు, కారం, బెల్లం లేదా చక్కెర, వేగించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు వేసి బాగా కలపాలి. ఇంగువ టేస్ట్​ నచ్చితే దాన్ని కూడా కలుపుకోవచ్చు. కలిపిన మిశ్రమాన్ని చిన్న ఉండలు చేయాలి. ఉండలు చేయడం పూర్తయ్యాక  వాటిని వడల్లా వత్తాలి. వెన్న రాసిన ప్లేటులో లేదా బటర్ పేపర్​ మీద వాటిని పెట్టి ఎండలో రెండు రోజులు పెట్టాలి. ఒకవైపు ఎండాక రెండో వైపు తిప్పాలి. పట్టుకుంటే మెత్తగా లేకుండా గట్టిగా అయ్యేవరకు ఎండబెట్టాలి. ఇవి భలే టేస్టీగా​ ఉంటాయి. ఏడాదంతా నిల్వ ఉంటాయి. 

మ్యాంగో ఐస్​


కావాల్సినవి : మామిడి కాయలు – రెండు, చక్కెర – అర కప్పు, ఉప్పు, నీళ్లు – సరిపడా, పుదీనా – కొంచెం

మామిడి సలాడ్
కావాల్సినవి :
మామిడికాయల తరుగు – ఒక కప్పు
ఉల్లిగడ్డ తరుగు – పావు కప్పు
జీలకర్ర పొడి – అర టీస్పూన్
చాట్ మసాలా – పావు టీస్పూన్
కారం – పావు టీస్పూన్
బెల్లం పొడి – ఒక టీస్పూన్
కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్
ఉప్పు – సరిపడా
తయారీ : మామిడి కాయలు తొక్క తీసి, ముక్కలుగా తరగాలి. వాటిని ఒక గిన్నెలో వేసి అందులో ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కారం, బెల్లం పొడి, ఉప్పు వేసి అన్నీ కలిసిపోయేలా బాగా కలపాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టి తింటే వారెవ్వా అనాల్సిందే.

తయారీ : మామిడి కాయల్ని ముక్కలుగా తరగాలి. మిక్సీ జార్​లో మామిడి ముక్కలు, చక్కెర, ఉప్పు, పుదీనా వేసి, నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఐస్ మౌల్డ్స్​లో పోసి ఫ్రిజ్​లో పెట్టాలి. అవి గడ్డకట్టాక బయటకు తీసి తినేయడమే.

పచ్చి రొయ్యలు – పచ్చి మామిడి పులుసు


కావాల్సినవి : పచ్చి రొయ్యలు – అర కిలో
మామిడి కాయ తరుగు – ఒక కప్పు
నూనె – మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లిగడ్డ తరుగు – ఒక కప్పు
పసుపు – అర టీస్పూన్
ఉప్పు – సరిపడా
పచ్చిమిర్చి – నాలుగు
కారం – ఒకటిన్నర స్పూన్

తయారీ : ఒక పాన్​లో పచ్చి రొయ్యలు ఉడికించాలి. తర్వాత వాటిని నూనె వేసి వేగించాలి. అందులో పసుపు, ఉప్పు, ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి వేసి కలపాలి.  కాసేపు వేగాక, మామిడి తరుగు కూడా వేయాలి. రెండు నిమిషాలు మగ్గాక, నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. కూర  దగ్గరపడ్డాక స్టవ్​ ఆపేయాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.

పనీర్- మామిడి 


కావాల్సినవి :
పచ్చి మామిడి  ముక్కలు – ఒక కప్పు
పనీర్ ముక్కలు – ఒక కప్పు
సాంబార్ ఉల్లిగడ్డలు – అర కప్పు
పసుపు – చిటికెడు, ఎండు మిర్చి – రెండు
ఉప్పు – సరిపడా, కారం – రెండు టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – ఒక టీస్పూన్
కొబ్బరి పాలు, పచ్చికొబ్బరి ముక్కలు – ఒక్కోటి పావు కప్పు చొప్పున, కరివేపాకు – కొంచెం, ఉల్లిగడ్డ తరుగు – పావు కప్పు
పోపు గింజలు – ఒక టేబుల్ స్పూన్
అల్లం – చిన్న ముక్క , వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, పచ్చిమిర్చి – రెండు
నూనె – మూడు టేబుల్ స్పూన్లు
తయారీ :  మిక్సీ జార్​లో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి మెత్తటి పేస్ట్​లా గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి పోపు గింజలు, కరివేపాకు, సాంబార్ ఉల్లిగడ్డలు, ఎండు మిర్చి, ఉల్లిగడ్డ తరుగు, పచ్చి మామిడి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వేగించాలి. తర్వాత కొబ్బరి పాలు పోసి ఉడికించాలి. పనీర్ ముక్కలు, రెడీ చేసుకున్న పేస్ట్ వేసి మూత పెట్టి ఉడికించాలి.