సేఫ్టీ + క్వాలిటీ = కివీల్యాండ్

సేఫ్టీ + క్వాలిటీ = కివీల్యాండ్

ఇంగ్లిష్ స్పీకింగ్ ఎన్విరాన్​మెంట్, అంతర్జాతీయ గుర్తింపు కలిగిన డిగ్రీలు, మూడేళ్ల పోస్ట్ స్టడీ వర్క్ విధానం, ఎడ్యుకేషన్ క్వాలిటీ, కాస్ట్ ఆఫ్ లివింగ్, సేఫ్టీ తదితర అంశాలు న్యూజిలాండ్​ను ఫారెన్ స్టూడెంట్స్ ఫేవరెట్ డెస్టినేషన్స్​లో ఒకటిగా నిలుపుతున్నాయి. కివీ ఎక్స్​పీరియన్స్.. అదేనండి న్యాచురల్ బ్యూటీ, న్యూజిలాండ్ కల్చర్, లైఫ్ స్టైల్, ట్రావెల్ అండ్ అడ్వెంచర్ వంటివి కూడా విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. అక్కడ ఉండే ఫేవరబుల్ కండిషన్స్ వల్ల ఇటీవల న్యూజిలాండ్​కు వెళ్తున్న విదేశీయుల సంఖ్య పెరుగుతోంది. మీరు కూడా న్యూజిలాండ్​కి వెళ్లి చదవాలనుకుంటే అక్కడి స్టడీ ప్యాటర్న్, టాప్ యూనివర్శిటీలు, అడ్మిషన్ ప్రాసెస్, వీసా విధానం, ఎలిజిబిలిటీ, లైఫ్​స్టైల్​ వంటి విశేషాలు చదివేయండి మరి..

క్వాకరెల్లీ సైమండ్స్ 2018లో విడుదల చేసిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్​లో టాప్ 3 పర్సెంట్లో అన్ని యూనివర్శిటీలు చోటు దక్కించుకున్న ఏకైక దేశం న్యూజిలాండ్. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఇండియా అకడమిక్ కాన్​క్లేవ్​ 2019 స్టాటిస్టిక్స్ ప్రకారం మనదేశం నుంచి న్యూజిలాండ్ కి వెళ్తున్న విద్యార్థుల సంఖ్య 51 శాతం పెరిగింది. దీనికి కారణం అమెరికా, బ్రిటన్ వంటి దేశాల ఇమ్మిగ్రేషన్ విధానం కాస్త కఠినంగా మారడం, న్యూజిలాండ్ ఫేవరబుల్ కండిషన్స్ కల్పించడం అని నిపుణులు అంటున్నారు. అక్కడికి అత్యధిక మంది స్టూడెండ్స్​ను పంపుతున్న దేశాల్లో ఇండియా రెండోస్థానంలో ఉంది. 2010తో పోల్చినప్పుడు 2015 లో 150 శాతం పెరుగుదలతో దాదాపు 29 వేల మంది భారత విద్యార్థులు న్యూజిలాండ్​లో ఉన్నారు. 2018లోనే 8 వేల మంది అక్కడికి వెళ్లగా ప్రస్తుతం 30 వేలకు పైగా విద్యార్థులు న్యూజిలాండ్ లో చదువుతున్నారు.

ఎడ్యుకేషన్ సిస్టమ్

న్యూజిలాండ్​లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లెవెల్స్ విధానంలో ఉంటుంది. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ప్యాటర్న్​లో మొత్తం 10 దశల్లో  విద్య సాగుతుంది. ఒకటి నుంచి నాలుగు లెవెల్స్ లో సర్టిఫికెట్ కోర్సులు, 5, 6 లెవెల్స్​లో డిప్లొమా, 7లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ డిప్లొమా, 8వ దశలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, 9లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పదో దశలో డాక్టోరల్/పీహెచ్​డీ డిగ్రీలుంటాయి. ప్రాక్టికల్ ఓరియంటేషన్​కి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ దేశంలోని యూనివర్శిటీలు లండన్ లెగటమ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో బెస్ట్ ఇనిస్టిట్యూట్స్​లో ఒకటిగా నిలిచాయి.

ఎలిజిబిలిటీ

డిగ్రీ చదవాలనుకునేవారు 12 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి. పీజీకి మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. మన బీఏ, బీకాం, బీఎస్సీ  డిగ్రీలు న్యూజిలాండ్ లోని ఆర్డినరీ డిగ్రీకి సమానం కాగా ఏఐసీఎస్ఈ, సీబీఎస్ఈ వంటి పరీక్షలు ఫామ్ 7 అయిన మెట్రిక్యులేషన్ కు సమానం. డిగ్రీ, పీజీ కోర్సులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎఫీషియన్సీ తప్పనిసరి. ఇక్కడి యూనివర్శిటీలు ఎక్కువగా ఐఈఎల్టీఎస్, పీటీఈ స్కోర్స్​ను ఆమోదిస్తాయి. ఐఈఎల్టీఎస్ అయితే 6.5, పీటీఈకి సంబంధించి డిగ్రీకి కనీసం 50, పీజీకి 64 పాయింట్లు సాధించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు ఇంటర్/+2లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివుండాలి.

కోర్సులు – ఫీజులు

న్యూజిలాండ్ వర్శిటీలు దాదాపు 40 పాపులర్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ డిజైన్, యానిమేషన్, ల్యాబ్ టెక్నాలజీ, ఎన్విరాన్​మెంటల్ సైన్స్, హ్యూమానిటీస్, వంటి కోర్సులు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇండియన్స్ ఎక్కువగా జాయిన్ అవుతున్న కోర్సులు మేనేజ్​మెంట్, ఫైనాన్స్, ఇంజినీరింగ్. డిప్లొమా కోర్సులకు ట్యూషన్ ఫీజు సరాసరి 18 వేలు, సర్టిఫికెట్ కోర్సులకు 12 వేల న్యూజిలాండ్ డాలర్లు కాగా బ్యాచిలర్ డిగ్రీకి 22 నుంచి 32 వేలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు 26 నుంచి 36, పీహెచ్​డీకి 7 వేల నుంచి 9 వేల న్యూజిలాండ్ డాలర్లు ఉంటుంది.

అడ్మిషన్ ప్రాసెస్

ఏటా జనవరి, జూలైలో అడ్మిషన్లు జరుగుతాయి. ఈ సమయానికి కనీసం 6 నుంచి 8 నెలల ముందుగా ఎంక్వైరీస్ మొదలు పెట్టాలి. ఆ దేశ హై కమీషన్ కు వీసా పూర్తి చేయడానికి కనీసం 8 నుంచి 12 వారాల సమయం పడుతుంది కాబట్టి విద్యార్థులు రెండు నుంచి మూడు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్, వెబ్​సైట్​లో అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. న్యూజిలాండ్ యూనివర్శిటీలకు మేజర్ సిటీస్లో ఉండే రిప్రజెంటేటివ్స్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు నెలల కంటే ఎక్కువ వ్యవధి గల కోర్సులకు స్టూడెంట్ వీసా పొందాల్సి ఉంటుంది. ఇదే వీసా మీద భార్యా పిల్లలకు కోర్సు డ్యురేషన్ వరకు నివాసం ఉండటానికి అనుమతిస్తారు. డిపెండెంట్ చిల్డ్రన్ ను డొమెస్టిక్ స్టూడెంట్ గానే పరిగణిస్తారు కాబట్టి వారికి ప్రైమరీ, సెకండరీ దశల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ లభిస్తుంది. టెర్షియరీ లెవెల్(డిగ్రీ)లో ఫీజు చెల్లించాల్సిందే.

జాబ్ సెర్చ్​కు వీసా

స్టడీస్ పూర్తయిన వారు జాబ్ సెర్చ్ చేసుకునేందుకు గరిష్టంగా 12 నెలలకు మించకుండా గ్రాడ్యుయేట్స్ జాబ్ సెర్చ్ వర్క్ వీసాకు దరఖాస్తు చేయాలి. ఉద్యోగం లభిస్తే తిరిగి రెండు/మూడు సంవత్సరాల వరకు ‘స్టడీ టు వర్క్’ వీసా కు అప్లై చేసుకోవచ్చు. ఇదే వీసా కింద స్పౌజ్, చిల్ట్రన్ వంటి డిపెండెంట్స్ కి వీసా జారీ చేస్తారు. స్పౌజ్ కూడా వర్క్ వీసా పొంది జాబ్ చేసుకునే అవకాశం ఉంది. పిల్లలు అక్కడి విద్యార్థులతో సమానంగా ఫ్రీ ఎడ్యుకేషన్ కి అర్హులవుతారు. ఈ కాలంలో ప్రీవియస్ క్వాలిఫికేషన్ కంటే ఎక్కువ లేదా లెవెల్ 7 బ్యాచిలర్ డిగ్రీ/30 వారాల పాటు ఉండే మరో కోర్సు చేసినట్లయితే తిరిగి మరో మూడు సంవత్సరాలకు పోస్ట్ స్టడీ వర్క్ వీసాను అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు కోర్సులు చదివిన వారు దాదాపు ఆరు సంవత్సరాలు అక్కడే ఉండి జాబ్ చేసే అవకాశం లభిస్తుంది. అక్కడి ఇమ్మిగ్రేషన్ పాలసీ ప్రకారం కనీసం రెండు సంవత్సరాలు నివాసం ఉన్నవారు పర్మనెంట్ రెసిడెంట్ వీసాకు అర్హులవుతారు. దాదాపు 20 రకాల వీసాల కింద న్యూజిలాండ్​లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.

పార్ట్​టైమ్​తో పాకెట్ మనీ

కోర్సు కాలంలో వారానికి 20 గంటలు, సమ్మర్ హాలిడేస్ లో 40 గంటల పాటు పార్ట్ టైం జాబ్ చేసుకునే వెసులుబాటు ఉంది. స్టూడెంట్ జాబ్ సెర్చ్ అనే జాతీయ సంస్థ లేదా యూనివర్శిటీ స్టూడెంట్ హెల్ప్ సెంటర్ ద్వారా వర్క్ పొందొచ్చు. ట్రేడ్ మి, సీక్ వంటి వెబ్​సైట్​లోనూ పార్ట్​టైమ్ వర్క్ సమాచారం అందిస్తుంటాయి. రీటెయిల్ సేల్స్ అసిస్టెంట్, సీజనల్ వర్కర్, సూపర్ మార్కెట్ అసిస్టెంట్, వెయిటర్, కిచెన్ హ్యాండ్, బార్ టెండర్, కాల్ సెంటర్ వర్కర్ వంటి జాబ్స్ లభిస్తాయి. గంటకు కనీసం 17.70 న్యూజిలాండ్ డాలర్ల వేతనం ఇస్తారు. మీరు సంపాదించిన దానిపై 10.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు ఇన్లాండ్ రెవెన్యూ డిపార్ట్​మెంట్ నుంచి ఐఆర్డీ నంబర్ తీసుకోవాలి.

లివింగ్ ఎక్స్​పెన్సెస్​

ఓఈసీడీ దేశాలతో సిమిలర్​గా ఏడాదికి 20 నుంచి 25 వేల యూఎస్ డాలర్లు ఖర్చవుతుంది. నెలకు 800 నుంచి 950 న్యూజిలాండ్ డాలర్ల రేంజ్​లో రెంట్ హౌజెస్ లభిస్తాయి. గ్రోసరీస్ కి 120, ఎంటర్​టైన్​మెంట్ 50, డాక్టర్ విజిట్ కి 45 నుంచి 85 డాలర్లు ఖర్చవుతుంది. లివింగ్ ఎక్స్​పెన్సెస్​తో పాటు రిటర్న్ ఎయిర్ టికెట్ కు సరిపడ ఫండ్స్ కలిగి ఉండటం తప్పనిసరి. ఆరు నెలల కంటే ఎక్కువ స్టే చేయాల్సి వస్తే ట్యూబర్క్​యూలోసిస్ టెస్ట్ చేయించుకోవడంతో పాటు రెండేళ్ల కంటే ఎక్కువ ఉండాలనుకునేవారు పోలీసులు ఇచ్చిన కండక్ట్ సర్టిఫికెట్ సమర్పించాలి. 2019 మే లో లాంచ్  చేసిన నౌమాయ్ ఎన్జెడ్ (NauMai NZ) అనే ఆన్​లైన్ పోర్టల్లో హెల్త్​కే​ర్, అకామడేషన్, కల్చర్, లైఫ్​స్టైల్​ వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. స్టూడెంట్స్ తప్పనిసరిగా ఆ దేశం అమలు చేస్తున్న ‘కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ ద పాస్టోరల్ కేర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్’ అనే ప్రత్యేక కోడ్ ను ఫాలో కావాల్సిందే. అలాగే మెడికల్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.

స్కాలర్​షిప్స్​

అంతర్జాతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ పలు ఉపకార వేతనాలు అందిస్తున్నాయి. ఇందులో న్యూజిలాండ్ ఇంటర్​నేషనల్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది మెరిట్ ప్రాతిపదికన ఇస్తారు. మొత్తం ట్యూషన్ ఫీజుతో పాటు 25 వేల డాలర్ల లివింగ్ ఎక్స్​పెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇంటర్నేషనల్ అండర్ గ్రాడ్యుయేట్ ఫీ స్కాలర్​షిప్​ను దాదాపు 30 మందికి అందజేస్తారు. సెంట్రల్ సెక్టార్ స్కీం కింద యూకే తప్ప అన్ని దేశాలకు చెందిన వందమందికి 34 వేల యూఎస్ డాలర్ల మేర ఉపకార వేతనం లభిస్తుంది. వీటితో పాటు రిట్చీ–జెన్నింగ్స్ మెమోరియల్ స్కాలర్​షిప్​, జేన్ ఎమ్ క్లాస్మన్ వుమెన్ స్కాలర్​షిప్, యూనివర్శిటీ ఆఫ్ అక్లాండ్ స్కాలర్​షిప్, గో క్లీన్ స్కాలర్​షిప్​ వంటివి అందుబాటులో ఉన్నాయి.

– వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్