- త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడులోనూ ఇదే రిపీట్
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో బీజేపీ మునిగిపోతున్న నావ ‘టైటానిక్ షిప్’గా కేకే సర్వే సంస్థ అభివర్ణించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న హర్యానాలో ఆ పార్టీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పింది. ఈ మేరకు గురువారం ఢిల్లీ తెలంగాణ భవన్ లోని గురజాడ హాల్ లో కేకే సర్వే సంస్థ అధినేత కొండేటి కిరణ్ హర్యానా ప్రీ పోల్ సర్వేపై మీడియాతో మాట్లాడారు.
కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న హర్యానాలో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. పోటీ చేసే ప్రతి మూడు సీట్లలో రెండు స్థానాల్లో ఓడిపోతుందని సర్వేలో తేలిందన్నారు.
ఈ పరిస్థితి హర్యానాలో మాత్రమే కాదని, కొద్ది రోజుల తర్వాత జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని వివరించారు. ఈ దిశలో బీజేపీ ఒక టైటానిక్ షిప్ మునిగిపోతున్న నావలా మారిందన్నారు. హర్యానాలో బీజేపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. అయితే బీజేపీ ఓటమే కాంగ్రెస్ కి సానుకూల అంశం తప్ప, ఆ పార్టీకి ప్రత్యేక సానుకూలత ఏమిలేదన్నారు.
బీజేపీ కోర్ ఓటు ఎటూ పోవడం లేదని, న్యూట్రల్ ఓట్లను మాత్రం నష్టపోనుందని సర్వేలో తేలిందన్నారు. ఎక్కువ పార్టీలు పోటీలో ఉన్నా.. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కలిగే ప్రయోజనం కాంగ్రెస్ కే దక్కుతుందని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓటు చాలా వరకు కాంగ్రెస్ కే వెళ్తున్నదన్నారు.
అయితే హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ కాస్త ముందుగా రంగంలోకి దిగితే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడింది. ఆలస్యం కావడం వల్ల ఆ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా ఉండకపోవచ్చని అంచానా వేసింది. రైతులు, జాట్ వర్గం బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని, ఈ వర్గాలు ఎన్నికలను బాగా ప్రభావితం చేయగరని పేర్కొంది. కేవలం 5 శాతం ఓట్లు తేడా వస్తేనే సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఏర్పడుతుందని తెలిపింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే సంఖ్య మ్యాజిక్ ఫిగర్ కు దరిదాపుల్లో కూడా ఉండదని సర్వేలు గణాంకాలు చెబుతున్నాయన్నారు.