కొడంగల్‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌కు ఎట్టకేలకు మోక్షం.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

కొడంగల్‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌కు ఎట్టకేలకు మోక్షం.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : నారాయణపేట కొడంగల్‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ లిఫ్ట్‌‌‌‌ నిర్మాణానికి 2014లోనే అనుమతులు వచ్చినా.. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు పట్టాలెక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్‌‌‌‌ నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. రేవంత్‌‌‌‌రెడ్డి సీఎం అయిన తర్వాత కొడంగల్‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ కోసం సర్వేలు చేయించారు.  ఇటీవలే భూ సేకరణ, టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది.

 దీంతో ఈ పనులకు సోమవారం సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మూడు నెలల్లో పనులు ప్రారంభించి.. మూడేండ్లలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఈ స్కీమ్‌‌‌‌ కింద ఊట్కూరు మండలంలో 19 వేల ఎకరాలు, మక్తల్‌‌‌‌లో ఆరు వేలు, నారాయణపేటలో తొమ్మిది వేలు, ధన్వాడలో 1,100, దామరగిద్ద, దౌల్తాబాద్‌‌‌‌ మండలాల్లో పది వేల చొప్పున, కోస్గిలో 14,600, మద్దూరులో 16,700, కొడంగల్‌‌‌‌లో నాలుగు వేలు, బొంరాస్‌‌‌‌పేటలో ఏడు వేల ఎకరాలు కలిపి మొత్తం 1.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు.

రెండు ప్యాకేజీలుగా పనులు

కొడంగల్ లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ను రూ.4,350 కోట్లతో చేపట్టనున్నారు. పనులను రెండు ప్యాకేజీలకు విభవించి టెండర్లు పిలువగా.. ప్యాకేజీ-1 పనులను రాఘవ కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌, ప్యాకేజీ-2 పనులను మేఘ కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌ కంపెనీలు దక్కించుకున్నాయి. ప్యాకేజీ-1 పనుల్లో మొదటి దశ కింద ఒక పంప్‌‌‌‌హౌస్‌‌‌‌, ప్రెషర్‌‌‌‌ మెయిన్‌‌‌‌ పనులు చేయనుండగా, రెండో దశలో రెండు పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లు, ప్రెషర్, మెయిన్‌‌‌‌, సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌, అప్రోచ్‌‌‌‌ చానల్‌‌‌‌ పనులు చేపట్టనున్నారు. ప్యాకేజీ 1 పనులు పూర్తయ్యాక రెండో ప్యాకేజీ పనులను చేపట్టనున్నారు. ఈ ప్యాకేజీలో కొడంగల్‌‌‌‌ నియోజకవర్గంలోని చెరువుల కెపాసిటీని పెంచి రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఒక రిజర్వాయర్​ నుంచి మరో రిజర్వాయర్‌‌‌‌కు గ్రావిటీ కెనాల్స్‌‌‌‌ నిర్మించనున్నారు. ప్యాకేజీ 1 పనుల కోసం మొత్తం 2,660 ఎకరాలకు అవసరం కాగా.. నారాయణపేట మండలంలో 421.27 ఎకరాలు, దామరగిద్ద మండలంలో 1,047, ఊట్కూరు మండలంలో 1,035.30, మక్తల్‌‌‌‌ మండలంలో 155.38 ఎకరాలను సేకరించారు. ఈ భూములకు ఇటీవల సర్వే పూర్తి చేసి నోటిఫికేషన్‌‌‌‌ సైతం జారీ చేశారు. భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.24 లక్షల చొప్పున పరిహారం సైతం అందించారు.