
నామ్‌కే వాస్తేగా కోహీర్ మండల జనరల్ బాడీ మీటింగ్
మునిపల్లి (కోహీర్), వెలుగు : మూడు నెలలకోసారి ప్రజా సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు నిర్వహించే మండల జనరల్ బాడీ సమావేశం నామ్‌కే వాస్తేగా కొనసాగింది. ఉదయం11 గంటలకు ప్రారంభం కావాల్సిన మీటింగ్ 12 గంటలకు స్టార్ట్ చేసి మధ్యాహ్నం ఒంటి గంటకే ముగించారు. కోహీర్ ఎంపీపీ అధ్యక్షురాలు మాధవి అధ్యక్షతన శుక్రవారం ఎంపీడీఓ ఆఫీస్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి మండల స్థాయి ఆఫీసర్లకు బదులు కింది స్థాయి సిబ్బంది రావడం పట్ల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్వో కు బదులు ఆర్ఐ, ఏవోకు బదులు ఏఈఓ, విద్యుత్ ఏఈకి బదులు లైన్మెన్లు హాజరయ్యారు. ‘మండల స్థాయి మీటింగ్‌కు ఎమ్మార్వో రాకుంటే ఎలా.. ఆయన ఫోన్లో కూడా అందుబాటులో ఉండరు’ అని వెంకటపూర్గ్రామ సర్పంచ్ రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. రోడ్ల విషయంలో ఆర్ అండ్ బీ అధికారి సంధ్య నిర్లక్ష్యం చేస్తున్నారని వైస్ ఎంపీపీ షాకిర్సభా దృష్టికి తెచ్చారు. కోహీర్సాంఘిక సంక్షేమ వసతి గృహానికి కాంపౌండ్ వాల్ లేక స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారని, సర్వే విషయమై రెవెన్యూ అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని హాస్టల్ వార్డెన్ తెలిపారు. ఇంతలోనే జనరల్ బాడీ మీటింగ్ ముగించేశారు. సమావేశంలో జడ్పీటీసీ రాందాస్, ఎంపీడీఓ సుజాత, ఏపీఓ సునంద్రావు, ఎంఈఓ శంకర్, పశువైద్యాధికారి జిన్నత్బాంద్, వైద్యాధికారి సంధ్యరాణి, ఎంపీఓ వెంకట్రామిరెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వినతుల వెల్లువ
మెదక్, వెలుగు: మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సమస్యలు విన్నవించారు. పార్ట్ బీ సమస్యలు పరిష్కరించాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని, సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, బ్యాటరీ వెహికల్స్ కావాలంటూ 110 మంది వినతి పత్రాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్‌చేసి ప్రాధాన్యత క్రమంలో ఆయా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కోర్టులో ఉన్నవి తప్ప పార్ట్- బీలో ఉన్న భూ సమస్యలు పరిష్కరించి అర్హులైన రైతులకు పట్టాపాస్ పుస్తకాలు ఇప్పిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల రోడ్లకు రూ.53 కోట్లు, బీటీ రెన్యూవల్ కు రూ.10 కోట్లు, ఎఫ్డీఆర్ కింద రూ.10 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్లకు రూ.24 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 3 కోట్లు మంజూరైనట్టు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. అనంతరం మెదక్ పట్టణం, మెదక్, హవేలీఘనపూర్ మండలాలకు చెందిన 47 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
క్రిస్మస్ గిఫ్ట్‌ల పంపిణీ
స్థానిక వైస్రాయ్ గార్డెన్ లో మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రిస్టియన్లకు ఎమ్మెల్యే క్రిస్మస్ గిఫ్ట్ లను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, జడ్పీ వైస్ చైర్ పర్సన్లావణ్య, మెదక్ నియోజకవర్గ క్రిస్టియన్ సెలెబ్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు సంజీవరావు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
మెదక్, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ బీ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని అడిషనల్కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఇంజనీరింగ్, పోలీస్అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించేలా చూడాలన్నారు. ప్రమాద హెచ్చరికలు, స్పీడ్ నియంత్రణ సూచికలు, స్పీడ్ బ్రేకర్లు అవసరమైన చోట లేకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరగుతున్నాయని చెప్పారు. మనోహరాబాద్ నుంచి తూప్రాన్, చేగుంట, రామాయంపేట నేషనల్ హైవే, నర్సాపూర్–మెదక్ నేషనల్హైవే మీద గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పెద్దశంకరంపేట–-అంకోలా నేషనల్ హైవే మీద పెట్రోల్ బంక్ వద్ద యు టర్న్ ఏర్పాటు చేయాలని, అల్లాదుర్గ, బొడ్మట్ పల్లి సర్వీస్ రోడ్డు అనుసంధానం చేయాలని, జమ్మికుంట వద్ద ఇరుకుగా ఉన్న వంతెన వద్ద లైటింగ్ ఉండేలా చూడాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలలో రేడి యం సైన్ బోర్డులు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని చెప్పారు. మెదక్ పట్టణంలోని వెల్కమ్ బోర్డు దగ్గర రహదారిని సరిచేసి సర్కిల్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీటీఓ శ్రీనివాస్ గౌడ్, ఆర్ అండ్ బి డీఈఈ వెంకటేశం, నేషనల్ హైవే మేనేజర్ తరుణ్ కుమార్, హైవే సీనియర్ ఇంజనీర్ ఏడుకొండలు, కిరణ్ కుమార్, ఈఎస్ రజాక్ పాల్గొన్నారు.
అందరి సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధి
రామచంద్రాపురం, వెలుగు : అందరి సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు శ్రీకృష్ణదేవరాయ కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ప్రైమరీ స్కూలుకు కంప్యూటర్ సెట్ ను అందజేశారు. బీరంగూడ మంజీరా నగర్ కాలనీలో వడ్డెర సంఘం కొత్త భవనాన్ని ప్రారంభించారు. పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీకృష్ణ బృందావన్ కాలనీలో దేవాలయ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
తరంగణి మేళాలో...
ఐసీడీఎస్ అండ్ అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ల కోసం పటాన్చెరు పట్టణంలోని అంగన్వాడీ ఆవరణలో ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక విద్య తరంగణి టీచర్స్ మేళాలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన నృత్య రూపకాలను పరిశీలించారు. ప్రతిఏటా తరంగిణి కార్యక్రమంతో అంగన్వాడీ టీచర్లకు కొత్త విద్యావిధానం మేలకువలు నేర్పించడంలో అజీజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే అభినందించారు.
సిద్దిపేటలో ఫిర్జాదీగూడ మేయర్ పర్యటన
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట మున్సిపాలిటీలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణ రావు, డీఈ శ్రీనివాస్ రావు శుక్రవారం పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. పట్టణంలోని స్వచ్ఛ బడి, బుస్సాపూర్ రీసోర్స్ పార్క్, డీఆర్సీసీలను సందర్శించారు. తడి చెత్తతో ఎరువు తయారీ చేసే విధానం, ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేధిస్తూ పూర్వం పద్ధతిలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడే విధానం, జీరో వేస్ట్ హోమ్ విధానం, వర్మీ కంపోస్టు ఎరువు తయారీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్సు, కౌన్సిలర్లు మల్లికార్జున్, సాయి దీప్తి, మున్సిపల్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, సతీశ్ పాల్గొన్నారు.
మల్లన్న కల్యాణానికి గట్టి బందోబస్తు
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అడిషనల్ డీసీపీ మహేందర్ తెలిపారు. మల్లన్న కల్యాణం ఆదివారం జరుగనుండటంతో ఆలయ ఈవో బాలాజీ, ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్ తో కలిసి ఆయన శనివారం కల్యాణం జరిగే తోటబావి, పార్కింగ్, క్యూలైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వారి ఆలయ పరిసరాలలో 80 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకునేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బందోబస్తును నాలుగు సెక్టార్లుగా విభజించి భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నామని తెలిపారు. భక్తులు పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలిపి పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో చేర్యాల సీఐ శ్రీనివాస్, సిద్దిపేట, గజ్వేల్ ట్రాఫిక్ సీఐలు రామకృష్ణ, తిరుపతి, స్థానిక ఎస్సై చంద్రమోహన్ యాదవ్ పాల్గొన్నారు.
శివాజీ విగ్రహ ఏర్పాటుకు రూ.2.5 లక్షల విరాళం
పటాన్చెరు, వెలుగు : పటాన్చెరు మండల పరిధిలోని చిన్న కంజర్లలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుతోపాటు వాలీబాల్ కోర్టు, లైటింగ్ ఏర్పాటుకు నందీశ్వర్ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రూ. 2.5 లక్షలను బీజేవైఎం ఉపాధ్యక్షుడు అశీష్‌గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులను క్రీడాల్లో ప్రోత్సహించడం, వారిలో ధర్మ భావజాలాలను పెంపొందించడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.
ఎల్లమ్మకు వెండి తొడుగులు
గుమ్మడిదలలో ఎల్లమ్మ దేవాలయాన్ని పునర్నిర్మిస్తుండటంతో అమ్మవారికి బీజేపీ రాష్ట్ర నాయకులు, పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ వెండి తొడుగులు చేయించారు. వాటిని ఆలయ చైర్మన్ మద్దుల బాల్ రెడ్డికి శుక్రవారం అందజేశారు. నాయకులు ఉదయ్ కుమార్, శ్రవన్రెడ్డి, నరేందర్‌రెడ్డి ఉన్నారు.
క్యాట్ పరీక్ష కష్టం కాదు..
రామచంద్రాపురం, వెలుగు : ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే క్యాట్ పరీక్ష కష్టం కాదని ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి, టైమ్స్ ఇన్సిస్టిట్యూట్నిపుణుడు రాంనాథ్ స్టూడెంట్స్‌కు సూచించారు. శుక్రవారం పటాన్చెరు మండల పరిధిలోని గీతం యూనివర్సీటీలో టైమ్స్ ఇన్సిస్టిట్యూట్ సౌజన్యంతో గీతం కెరీర్ గైడెన్స్సెంటర్ ‘క్యాట్, జీమ్యాట్తో కెరీర్అవకాశాలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన మాట్లాడారు. దాదాపు 3 వేల సీట్లకు 2.50 లక్షల మంది పోటీ పడతారని తెలిపారు. పరీక్షలో సులభంగా ఉన్న ప్రశ్నలను పూర్తి చేసి కఠిన తరమైన ప్రశ్నలను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం స్టూడెంట్స్ అడిగిన డౌట్లను ఆయన క్లియర్ చేశారు.
వీఆర్ఏల నిరసన
మెదక్ (శివ్వంపేట)/ నర్సాపూర్, వెలుగు : మెదక్ (శివ్వంపేట), వెలుగు : డిమాండ్ల సాధనలో భాగంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం శివ్వంపేట, నర్సాపూర్ తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. నర్సాపూర్‌లో తహసీల్దార్‌కు, శివ్వంపేటలో ఆర్ఐ కిషన్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ చార్ట్ కు విరుద్ధంగా పై అధికారుల సూచన మేరకు కామారెడ్డిలో అదనపు విధులు నిర్వహించి ఇంటికి వెళ్తున్న వీఆర్ఏ సంగి నరేందర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా జాబ్ చార్ట్ ప్రకారం వీఆర్ఏలు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వేర్వేరు చోట్ల రెండు మృతదేహాలు లభ్యం
జోగిపేట (వట్‌పల్లి), వెలుగు : సంగారెడ్డి జిల్లా అందోల్, వట్‌పల్లి మండలాల పరిధిలో శుక్రవారం రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. అందోల్ మండలం అల్మాయిపేట శివారులో సంగుపేట గ్రామానికి చెందిన అశోక్ వ్యవసాయ పనులు చేయిస్తుండగా కెనాల్ కోసం తవ్విన కాల్వలో డెడ్‌బాడీ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నాగరాజు, ఎస్సై సామ్యానాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో గుర్తు పట్టేందుకు వీలు కాలేదు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 50 ఏండ్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలం వద్దనే పోస్టుమార్టం నిర్వహించి అక్కడే పూడ్చి పెట్టినట్లు ఎస్పై తెలిపారు.
ఖాదిరాబాద్‌లో..
వట్‌పల్లి మండల పరిధిలోని ఖాదిరాబాద్ గ్రామ శివారులోని మంజీరా నదీ తీరంలో ఓ గుర్తుతెలియని డెడ్‌బాడీ లభ్యమైంది. పంచాయితీ కార్యదర్శి సాయిబాబా ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో మృతుడు ఎవరన్నది తెలియకుండా ఉంది. సుమారు 50 ఏండ్ల వయస్సు ఉంటుందని, కుడిచేతికి దారం ఉందని పోలీసులు తెలిపారు.